కేరళలో ఒకే కుటుంబంలో ఐదుగురికి నెగటీవ్.. ఐసోలేషన్ వార్డు నుంచి డిశ్చార్జి.. చప్పట్లు కొడుతూ ఇంటికి పంపిన ఆస్పత్రి సిబ్బంది 

  • Published By: sreehari ,Published On : March 31, 2020 / 03:30 AM IST
కేరళలో ఒకే కుటుంబంలో ఐదుగురికి నెగటీవ్.. ఐసోలేషన్ వార్డు నుంచి డిశ్చార్జి.. చప్పట్లు కొడుతూ ఇంటికి పంపిన ఆస్పత్రి సిబ్బంది 

Updated On : March 31, 2020 / 3:30 AM IST

కరోనా వైరస్ బారినుంచి ఒకే కుటుంబంలోని ఐదుగురు సభ్యులు ప్రాణాలతో బయటపడ్డారు. వారికి రెండుసార్లు కరోనా టెస్టులు నిర్వహించగా నెగటీవ్ అని తేలడంతో వారిని డిశ్చార్జీ చేసి ఇంటికి పంపించారు. దాంతో ఆస్పత్రి ప్రాంగణంలో ఆ ఐదుగురు సభ్యులకు వైద్యులు, నర్సులు, ఇతర ఆరోగ్య సిబ్బంది వీడ్కోలు పలుకుతూ భావోద్వేగానికి గురయ్యారు. ఈ ఘటన కేరళలోని పతనమిట్ట జిల్లాలోని జనరల్ ఆసుపత్రి వెలుపల జరిగింది. 

కరోనావైరస్ టెస్టులో భాగంగా వారి శాంపిల్స్ పరీక్షించగా రెండుసార్లు నెగటీవ్ అని తేలాయి. వారిలో ఒకరు 25 ఏళ్ల వ్యక్తి, అతని తల్లిదండ్రులు 55, 53 సంవత్సరాల వయస్సు, వారి ఇద్దరు బంధువులను జనరల్ ఆసుపత్రిలో ఐసోలేషన్ వార్డ్ నుంచి ఇంటికి వెళ్లేందుకు ఆస్పత్రి వైద్యులు అనుమతించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రోటోకాల్‌కు అనుగుణంగా వీరికి ఇంటికి వెళ్లేందుకు అనుమతినిచ్చారు. పతనమిట్టలోని రాణి సమీపంలోని అథాలాలో నివసిస్తున్న 25 ఏళ్ల వ్యక్తి, అతని తల్లిదండ్రులు ఫిబ్రవరి 29న ఇటలీ నుండి వచ్చారు. వీరిలో కరోనా లక్షణాల కారణంగా మార్చి 6న ఆసుపత్రిలో చేరారు.

ఈ ఐదుగురు వ్యక్తులు ఐసోలేషన్ వార్డు నుంచి బయటకు వెళ్తుండగా సోమవారం జనరల్ ఆసుపత్రి సిబ్బంది చప్పట్లు కొట్టి ఉత్సాహపరిచారు. ఆ కుటుంబానికి మొదట స్వీట్స్ బాక్సును అందజేశారు. తరువాత రాత్రిపూట తినడానికి వండిన ఆహార ప్యాకెట్లను వారికి ఇచ్చారు. తప్పనిసరి గృహ నిర్బంధంలో వచ్చే రెండు వారాల్లో వారికి అవసరమైన ఆహారం, ఇతర సామాగ్రి డబ్బాలు కూడా వారికి అందజేశారు. అనారోగ్యం నుండి కోలుకునే వారు రాబోయే 14 రోజులు ఇంటి నిర్బంధంలో గడపాలని ఆరోగ్య శాఖ నిర్దేశించిన ప్రోటోకాల్ నిర్దేశిస్తుంది. వారి హోం క్వారంటైన్ ముగిసిన తరువాత, వారి శరీరంలో వైరస్ లేకపోవడాన్ని నిర్ధారించడానికి వారికి మరోసారి టెస్టు శాంపిల్స్‌తో మళ్లీ పరీక్షిస్తారు.

“గత 25 రోజులుగా మమ్మల్ని జాగ్రత్తగా చూసుకున్నందుకు నర్సులు, వైద్యులు, జిల్లా కలెక్టర్, డిఎంఓ, వారందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మేము ప్రాణాలతో ఇంటికి తిరిగి వెళ్తామని ఎప్పుడూ అనుకోలేదు. ఆ దేవునికి కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. మా ప్రార్థనలలో మీ అందరినీ గుర్తుంచుకుంటానని అందరికీ చెప్పాలనుకుంటున్నాను’ అంటూ బాధితులు కన్నీటిపర్యంతమయ్యారు. 

ఫిబ్రవరిలో ఇటలీ నుండి తిరిగి వచ్చిన ముగ్గురు సభ్యుల కుటుంబం కొచ్చి విమానాశ్రయంలో స్క్రీనింగ్‌ను తప్పించుకుని వెళ్లిపోయారు. వారి విదేశీ ప్రయాణం గురించి చెప్పకపోవడంపై ఆరోగ్య శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫిబ్రవరి 29, మార్చి 6 మధ్య, కుటుంబం, సామాజిక దూరాన్ని కొనసాగించడానికి బదులుగా, కార్యక్రమాలకు హాజరై, పోస్టాఫీసులు, బ్యాంకులు, పోలీస్ స్టేషన్లతో సహా అనేక ప్రాంతాలకు ప్రయాణించినట్లు తెలిసింది. 

కుటుంబంతో ప్రాధమిక లేదా ద్వితీయ సంబంధాలు కలిగి ఉన్న 900 మందికి పైగా ఆరోగ్య శాఖ క్వారంటైన్ లోకి తీసుకుంది. సోమవారం, ఆసుపత్రి నుండి విడుదలైన తరువాత, ఆ కుటుంబం ప్రోటోకాల్‌కు కట్టుబడి ఉండకుండా అనుకోకుండా పొరపాటు చేసినట్టుగా అంగీకరించింది. చికిత్స సమయంలో నిరంతరం కౌన్సెలింగ్ ఇచ్చి తమను జాగ్రత్తగా చూసుకున్న ఆసుపత్రి సిబ్బందికి వారు కృతజ్ఞతలు తెలిపారు.

Also Read | కరోనాపై యుద్ధం, ప్రైవేట్‌ ఆస్పత్రులూ ప్రభుత్వ పరిధిలోకి, సీఎం జగన్ నిర్ణయంతో జరిగే లాభం ఏంటి