ఈసారి బేర్ గ్రిల్స్‌తో ‘మ్యాన్ వెర్సెస్ వైల్డ్’ షోలో రజనీకాంత్!

  • Published By: sreehari ,Published On : January 29, 2020 / 08:25 AM IST
ఈసారి బేర్ గ్రిల్స్‌తో ‘మ్యాన్ వెర్సెస్ వైల్డ్’ షోలో రజనీకాంత్!

Updated On : January 29, 2020 / 8:25 AM IST

డిస్కవరీ ఛానల్లో ప్రసారమయ్యే మ్యాన్ వెర్సెస్ వైల్డ్ షోలో తమిళనాడు సూపర్ స్టార్ రజనీకాంత్ బ్రిటన్ కు చెందిన సాహస వీరుడు బేర్ గ్రిల్స్‌తో కనిపించనున్నారు. రజనీతో కలిసి రాబోయే మ్యాన్ వెర్సెస్ వైల్డ్ షోలో సందడి చేయనున్నట్టు మాజీ మిలటరీ మ్యాన్ గ్రిల్స్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.

ఈసారి తనతో కలిసి షోలో రజనీ కాంత్ పాల్గొనబోతున్నారని స్పష్టం చేశారు. దీంతో ప్రధాని నరేంద్ర మోడీ తర్వాత బేర్ గ్రిల్స్ తో కనిపించనున్న రెండో భారతీయుడిగా రజనీ కానున్నారు. అయితే తన ట్వీట్ లో రజనీకాంత్ గురించి సంబోధించిన విధానంపై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో వెంటనే ఆ ట్వీట్ గ్రిల్స్ డిలీట్ చేశాడు.

ట్వీట్ డిలీట్ చేసిన గ్రిల్స్ :
‘ప్రధాని మోడీ తర్వాత మన ఎపిసోడ్ లో బాలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నాతో కలిసి కనిపించనున్నారు’ అని గ్రిల్స్ ట్వీట్ చేశాడు. రజనీని బాలీవుడ్ స్టార్ గా ప్రస్తావించడంపై అభ్యంతరాలు వ్యక్తమవడంతో వెంటనే గ్రిల్స్ ఆ ట్వీట్ డిలీట్ చేసేశాడు. రజనీకాంత్ (69) దక్షిణ భారత ప్రముఖ సినీనటుల్లో ఒకరు. తన అభిమానులతో పాటు అందరికి తలైవా (నేత)గా అందరికి సుపరిచితుడు కూడా.

ఇప్పటివరకూ తన సినీ కెరీర్ లో 160కు పైగా సినిమాల్లో నటించారు. గ్రిల్స్ డిలీట్ చేసిన ఒరిజినల్ ట్వీట్ స్ర్కీన్ షాట్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ట్విట్టర్ యూజర్లు.. రజనీకాంత్ కోలివుడ్ సూపర్ స్టార్ అంటూ ట్వీట్లు చేస్తున్నారు. నెటిజన్లు తమదైన శైలిలో ట్వీట్లతో హెరెత్తిస్తున్నారు.

బందిపూర్ అటవీ ప్రాంతంలో రజనీతో కలిసి బేర్ గ్రిల్స్ ఈ వైల్డ్ షోను షూటింగ్ జరుగుతోంది. వీరిద్దరూ కలిసి టైగర్ రిజర్వ్ అటవీ ప్రాంతంలో తిరగనున్నారు. సుమారు 6 గంటల పాటు వీరిద్దరూ అడవిలో గడపనున్నారు. జనవరి 28 నుంచి ఈ నెల 30 వరకు షూటింగ్ జరుగనుంది. గత ఏడాదిలో ఇదే షోలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఉత్తరాఖండ్ లోని జిమ్ కార్బెట్ అటవీ ప్రాంతంలో బేర్ గ్రిల్స్ తో కలిసి మోదీ తిరిగారు. మోదీతో చేసిన ఈ షో (3.6 బిలియన్ల వ్యూస్)తో అత్యంత ఆదరణ పొందింది.