Gastric Problems : కడుపులో ఉబ్బరం…తినే ఆహారాల విషయంలో జాగ్రత్త

కడుపు నొప్పి, మంట, కడుపు ఉబ్బరం, కొంచెం తిన్నా కడుపు నిండుగా అనిపించడం, అజీర్ణం, వికారం, రక్తంతో కూడిన వాంతులు, ఆకలి తగ్గిపోవడం, కొంత మందిలో గ్యాస్ట్రిక్‌ సమస్య వల్ల మలం రంగు మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

Gastric Problems : కడుపులో ఉబ్బరం…తినే ఆహారాల విషయంలో జాగ్రత్త

Gas Problems

Updated On : February 24, 2022 / 1:29 PM IST

Gastric Problems : మారుతున్న అలవాట్లు, రోజు వారి జీవనశైలి కలసి మనిషిని అనారోగ్యాలపాలు చేస్తున్నాయి. సమయపాలన పాటించకుండా తీసుకునే ఆహారం, ఆయిల్ ,మసాలలతో కూడిన ఆహారం వల్ల ముఖ్యంగా గ్యాస్ వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. గ్యాస్ సమస్య తీవ్రస్ధాయికి చేరి చివరకు అల్సర్లకు దారితీస్తుంది. దీని వల్ల సరిగా ఏమి తినలేని పరిస్ధితి నెలకొంటుంది. ఏదైనా తినాలని ఉన్న కడుపు ఉబ్బరంగా ఉండటం కారణంగా తినలేకపోతారు. దీర్ఘకాలికంగా ఈ సమస్య వేదిస్తుంది.

ఈసమస్య రావటానికి అనేక కారణాలు ఉన్నాయి. మలబద్ధకం, గాలిని మింగడం,సరైన సమయానికి తినకపోవడం, మనం తరచూ తినే ఆహార పదార్థాలు సమస్యకు దారితీస్తాయి. ఆహారాన్ని తినేసమయంలో చాలా మంది బాగా నమలరు. నమలకుండా మింగడం వల్ల, కూల్‌డ్రింకులు, సోడాలను తాగడం, బబుల్‌గమ్‌ల నమలడం మసాల ఆహారాలను తినటం వల్ల కడుపు ఉబ్బరానికి దారితీస్తుంది. మరికొన్ని సందర్భాల్లో ఆందోళన, భయం, ఉద్వేగం వంటి మానసిక సమస్యలు కూడా కడుపులో గ్యాస్‌ సమస్యకు దారితీస్తాయి. పేగుపూత, అల్సర్లు, డీహైడ్రేషన్‌ వంటివి కడుపు ఉబ్బరానికి కారణాలుగా చెప్పవచ్చు.

కడుపు నొప్పి, మంట, కడుపు ఉబ్బరం, కొంచెం తిన్నా కడుపు నిండుగా అనిపించడం, అజీర్ణం, వికారం, రక్తంతో కూడిన వాంతులు, ఆకలి తగ్గిపోవడం, కొంత మందిలో గ్యాస్ట్రిక్‌ సమస్య వల్ల మలం రంగు మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. పిండి పదార్థాలను సరిగ్గా ఉడికించనప్పుడుగాని, జీర్ణక్రియకు కావాల్సిన ఎంజైములు తగ్గిన సందర్భంలో, యాంటీ బయాటిక్స్‌ను ఎక్కవ మోతాదులో వాడేవారిలో గ్యాస్‌ తయారవుతుంది. జీర్ణకోశంలోని గాఢమైన హైడ్రోక్లోరిక్ ఆమ్లం అన్నవాహిక, జీర్ణాశయం, చిన్నపేగులలో పుండ్లు ఏర్పడటానికి కారణమవుతుంది.

గ్యాస్, కడుపుబ్బరం సమస్యలతో బాధపడుతున్నవారు కాలీఫ్లవర్, క్యాబేజీ, ముల్లంగి, చక్కెర, పిండి పదార్ధాలు వంటి ఆహార పదార్థాలు తినడం వల్ల సమస్య ఉత్పన్నం అవుతుందని పోషకాహార నిపుణులు అంటున్నారు. జీర్ణవ్యవస్థ పనితీరుబాగుండాలంటే పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. పీచు అధికంగా ఉండే బెర్రీలు, పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. నీటిశాతం ఎక్కువగా ఉండే దోసకాయలు,కీరాలు తినడం ద్వారా జీర్ణ వ్యవస్థకు అవసరమైన ఎంజైమ్‌లు లభిస్తాయి. పీచు పదార్థాలు మితంగా తీసుకోవటం ఉత్తమం. తీసుకునే ఆహారం , నీరు విషయంలో శ్రద్ధ చాలా అవసరం. పరిస్ధితి మరీ ఇబ్బంది కలిగిస్తే వైద్యులను సంప్రదించి తగిన పరీక్షల ద్వారా వ్యాధిని నిర్ధారించుకుని చికిత్స పొందటం ఉత్తమం.