Increased Obesity : టీనేజర్లలో ఊబకాయాన్ని 15% పెంచిన మహమ్మారి

ప్రపంచవ్యాప్తంగా ఊబకాయం కేసులను పెంచడంలో మహమ్మారి ప్రధాన పాత్ర పోషించిందని పలువురు వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

Increased Obesity : టీనేజర్లలో ఊబకాయాన్ని 15% పెంచిన మహమ్మారి

Obesity Small

Updated On : March 4, 2022 / 4:52 PM IST

Increased Obesity : ప్రపంచ ఊబకాయం వెబ్‌సైట్ ప్రకారం, 2025 నాటికి స్థూలకాయం పెరుగుదలను అరికట్టాలనే ప్రపంచ ఆరోగ్య సంస్థ లక్ష్యానికి అన్ని దేశాలు కట్టుబడి ఉన్నాయి. అందుకు తగ్గట్టుగా ఊబకాయాన్ని తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఆశించిన మేర ఫలితాలు సాధించలేకపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం 800 మిలియన్ల మంది ప్రజలు ఊబకాయంతో జీవితం గడుపుతున్నారు. ఒక బిలియన్ కంటే ఎక్కువ మంది అధిక బరువు , ఊబకాయం వచ్చే అవకాశపు అంచుల్లో ఉన్నారు. 2016లో 5-19 సంవత్సరాల వయస్సు గల 340 మిలియన్ల మంది పిల్లలు,యుక్తవయస్సులో ఉన్నవారు ఉండగా,  2020లో 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న 39 మిలియన్ల మంది పిల్లలు ఉన్నారు.

1975 మరియు 2020 మధ్య ప్రపంచవ్యాప్తంగా ఊబకాయంతో బాధపడుతున్న వారి సంఖ్య దాదాపు మూడు రెట్లు పెరిగింది. ఈ సమస్య వేగంగా పెరుగుతోంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం ఊబకాయం తో బాధపడుతున్న వారి సంఖ్య ఇదే తరహాలో పెరుగుతూ పోతే 2030 నాటికి ప్రపంచంలోని వయోజనుల్లో దాదాపు సగం మంది అధిక బరువు, ఊబకాయం సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుందని అంచనావేసింది.

తాజా అధ్యయనం ప్రకారం, భారతదేశంలో ఊబకాయం యొక్క ప్రాబల్యం 40.3 శాతంగా నమోదైంది. పురుషుల కంటే మహిళల్లో ఊబకాయం ఎక్కువగా ఉందని తేలింది. మహిళలు 41.88 శాతం మంది పురుషులు 38.67 శాతం ఊబకాయం సమస్యతో బాధపడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. గ్రామీణ ప్రాంతజనభాలో మహిళలు 44.17 శాతం పురుషులు 36.08 శాతం ఊబకాయాన్ని కలిగి ఉన్నారు. 40 ఏళ్లలోపు వారిలో మహిళలు 45.81 శాతం పురుషులు 34.58 శాతం ఉన్నట్లు పరిశోధనలో తేలింది.

కరోనాతో మరింత పెరిగిన ఊబకాయం;

సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం, ఊబకాయం కలిగిన వారిలో కోవిడ్ మహమ్మారి ప్రభావం తీవ్రంగా ఉంది. మరోవైపు ఊబకాయం పెరుగుదలకు మహమ్మారి కూడా ఒక కారణమైంది. కోవిడ్ సమయంలో ప్రజలు ఇంట్లోనే ఉండటం, రోగనిరోధక శక్తిని పెంచేందుకునేందుకు వివిధ రకాల ఆహారాలను తీసుకోవటం, శారీరక శ్రమ లోపించటం, కోవిడ్ వచ్చిన రోగులు స్టెరాయిడ్‌లను వాడటం ఇలాంటివన్నీఊబకాయాన్ని పెంచడానికి దారితీశాయి. కరోనాకు ముందు వరకు బరువు తగ్గడానికి కసరత్తు చేస్తున్న వారు, అకస్మాత్తుగా తమ కార్యకలాపాలను నిలిపివేయటంతో తిరిగి బరువు పెరిగాల్సిన పరిస్ధితి ఏర్పడింది.

ప్రపంచవ్యాప్తంగా ఊబకాయం కేసులను పెంచడంలో మహమ్మారి ప్రధాన పాత్ర పోషించిందని పలువురు వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. 14 ఏళ్ల వయస్సు పిల్లల నుండి యుక్తవయస్సులో ఉన్నవారి వరకు అంతా ఈ ఊబకాయం బారిన పడినట్లు స్పష్టమౌతుంది. మోతాదుకు మించి ఆహారం తీసుకోవటం, అనారోగ్యకరమైన స్నాక్స్ తినటం ఇవన్నీ సమస్యకు దారితీశాయి. పట్టణాలు, నగరాల్లో పాఠశాలకు వెళ్లే పిల్లలపై జరిపిన అధ్యయనాల్లో దాదాపు 60 శాతం మంది పిల్లలు అధిక బరువుతో ఉన్నారని తేలింది. వీరిలో యుక్తవయస్సులో ఉన్నవారు మొత్తం 15 శాతం మంది ఉన్నట్లు గుర్తించారు.. 14 ఏళ్ల పిల్లలు 70 కిలోల కంటే ఎక్కువ బరువుతో ఉన్నట్లు తేలింది.

చిన్నారుల నుండి యుక్త వయస్సు వారిలో ఈ ఊబకాయం కారణంగా రానున్న రోజుల్లో తీవ్రమైన ఆరోగ్యసమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నట్లు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తల్లి దండ్రులు చొరవ తీసుకుని వారిలో ఊబకాయాన్ని, బరువును తగ్గించేందుకు అవసరమైన ఆహార నియమాలు, వ్యాయామాలు కొనసాగించే దిశగా ప్రోత్సహించటం వల్ల కొంతమేర పరిస్ధితిలో మార్పు తీసుకువచ్చేందుకు అవకాశం ఉంటుంది.