Shakuntala Devi : గణితంలో అపర మేధావి శకుంతలా దేవి జయంతి నేడు
కంప్యూటర్ లెక్క తప్పచ్చేమో కానీ ఆమె లెక్క తప్పరంటే అతిశయోక్తి కాదు. హ్యూమన్ కంప్యూటర్‌గా ఆమెను పిలుచుకునేవారు. గణితంతో పాటు రచనలు, జ్యోతిష్యం, రాజకీయాలు ఇలా ఎన్నో రంగాల్లో బహుముఖ ప్రతిభ చాటుకున్న శకుంతలా దేవి జయంతి నేడు.

Shakuntala Devi
Shakuntala Devi : కంప్యూటర్ లెక్క తప్పుతుందేమో కానీ ఆమె లెక్క తప్పదు. అందరినీ ఆకట్టుకునేలా మాట్లాడటం ఆమెలోని ఇంకో ప్రతిభ. అంతేనా.. అనేక రచనలు చేశారు. జ్యోతిష్యం కూడా చెప్పేవారు. గణిత మేధావి..బహుగుణ ప్రజ్ఞాశాలి శకుంతలా దేవి జయంతి నేడు.
Anand Mahindra : శీతల్ దేవి ప్రతిభకు ముగ్దుడైన ఆనంద్ మహీంద్రా.. బంపర్ ఆఫర్.. వీడియో షేర్
శకుంతలా దేవి.. బ్రాహ్మణ కుటుంబంలో 1929, నవంబర్ 4 వ తేదీన జన్మించారు. పట్టుమని పదేళ్లు కూడా లేని వయసులోనే లెక్కల్లో అసాధారణమైన ప్రతిభ కనపరిచేవారట శకుంతల. ఆమె జ్ఞాపకశక్తి చూసి అందరూ ఆశ్చర్యపోయేవారట. 6 ఏళ్లు నిండ కుండానే మైసూరు యూనివర్సిటీలో ఇచ్చిన ప్రదర్శనలో లెక్కల్లో ఆమె ప్రతిభని చూసి అందరూ ఆశ్చర్యపోయారట. 1944 లో లండన్ వెళ్లిపోయిన శకుంతలా దేవి పేరు ఆ తర్వాత ప్రపంచం మొత్తానికి తెలిసిపోయింది.
అంకగణితంలో (arithmetic) లో రెప్పపాటులో లెక్క తేల్చడం ఆమెకే సాధ్యం. ‘మైండ్ డైనమిక్స్’ అనే సిద్ధాంతాన్ని అభివృద్ధి చేసిన శకుంతలా దేవి కంప్యూటర్ ముందు మానవ మేథస్సు ఎంతో గొప్పదని చెప్పేవారు.. నమ్మేవారు కూడా. కంప్యూటర్లను ఓడించడం ఒక లెక్క కాదంటూ నిరూపించారు ఆమె. ఎంత పెద్ద అంకె అయినా సెకండ్లలో పరిష్కరించడం.. నోటితో సమాధానం చెప్పేయడం ఆమె ప్రత్యేకత.
PM Narendra Modi : ప్రధాని మోడీ షేర్ చేసిన శాల్మలీ వీడియో.. చిన్నారి ప్రతిభకు ప్రధాని ఫిదా..
శకుంతలా దేవి మాట్లాడుతుంటే అంతా అలా ఉండిపోయేవారట. అందర్నీ ఆకట్టుకునేలా మాట్లాడటం ఆమెలో దాగిన మరో ప్రతిభ. చాలా ఇంటర్వ్యూలు, సన్మాన కార్యక్రమాల్లో ఆమె మాట్లాడుతుంటే జనం అలా వింటూ ఉండిపోయేవారట. 1982 నాటికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించిన శకుంతలా దేవికి హీరోయిన్‌కి ఉన్నంత పాపులారిటీ ఉండేదట. ఆమె సాధించిన విజయాలు అనేక వార్తా పత్రికల్లో కవర్ స్టోరీగా వచ్చాయి.
స్వలింగ సంపర్కుల పట్ల సానుకూల భావన చూపిన శకుంతలా దేవి ‘ద వరల్డ్ ఆఫ్ హోమో సెక్సువల్స్’ అనే పుస్తకం రాసి సంచలనం సృష్టించారు. స్వలింగ సంపర్కం నేరం కాదని చెప్పిన తొలి భారతీయ మహిళ ఆమె. ప్రేమించి పెళ్లాడిన ఐఏఎస్ ఆఫీసర్ పరితోష్ బెనర్జీ హోమో సెక్సువల్ కావడంతో వాళ్లిద్దరు విడిపోయారు. శకుంతలా దేవి వంటలు, జ్యోతిష్యంపై కూడా పుస్తకాలు రాసారు. మ్యాథ్స్ పజిల్స్ పుస్తకాలతో పాటు ‘పర్ఫెక్ట్ మర్డర్’ అనే క్రైం థ్రిల్లర్ నవల కూడా రాసారు. ప్రపంచ ప్రముఖ నేతలకు, సెలబ్రిటీలకు వ్యక్తిగత జ్యోతిష్యురాలిగా కూడా పనిచేసారు శకుంతలా దేవి.
శకుంతలా దేవికి రాజకీయాలంటే మక్కువ ఎక్కువ. స్వతంత్ర అభ్యర్థిగా లోక్ సభకు రెండుసార్లు పోటీ చేసి ఓడిపోయారు. 1980 లో మెదక్ నుంచి అప్పటి మాజీ ప్రధాని ఇందిరాగాంధీపై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. శకుంతలా దేవి జీవిత కథ ‘శకుంతలా దేవి’ గా అమెజాన్ ప్రైమ్‌లో విడుదల చేసారు. శకుంతలా దేవి పాత్ర బాలీవుడ్ హీరోయిన్ విద్యా బాలన్ పోషించి అందరినీ మెప్పించారు. 2013 ఏప్రిల్ 21 న 83 సంవత్సరాల వయసులో శకుంతలా దేవి కన్నుమూసారు.