Chevella Lok Sabha Constituency : అసెంబ్లీ రిజల్ట్‌ రిపీట్‌ అవుతుందా? చేవెళ్ల ఎంపీ స్థానంలో ముక్కోణపు పోరు

మైనార్టీ ఓటు బ్యాంకు కోసం ఎత్తులు వేస్తున్నాయి. దాదాపు 5 లక్షల ఓట్లు ఉన్న మైనార్టీలు ఎవరికి మద్దతుగా నిలిస్తే.. వారికి గెలుపు అవకాశాలు మెరుగయ్యే అవకాశం ఉందనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ దిశగా పావులు కదుపుతున్నాయి.

Chevella Lok Sabha Constituency : అసెంబ్లీ రిజల్ట్‌ రిపీట్‌ అవుతుందా? చేవెళ్ల ఎంపీ స్థానంలో ముక్కోణపు పోరు

Chevella Lok Sabha Constituency

Chevella Lok Sabha Constituency : హైదరాబాద్ నగరానికి అనుకుని ఉన్న ఆ నియోజకవర్గం రాజకీయంగా చాలా స్పెషల్. ఒకసారి ఎంపీగా ఈ నియోజకవర్గం నుంచి గెలిచిన నేత.. ఐదేళ్లు తిరిగేసరికి మరోపార్టీలో జంప్ చేయడం ఆనవాయితీగా మారింది. గతంలోనూ.. ఇప్పుడూ ఇదే సీన్ రిపీట్ అవ్వగా.. ప్రస్తుతం మూడు ప్రధాన పార్టీల తరఫున పోటీ చేస్తున్న వారు కూడా ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి మారిన వారే కావడం విశేషం. జంపింగ్ జపాంగ్ రాజకీయానికి కేరాఫ్‌గా మారిన ఆ నియోజకవర్గమే చేవెళ్ల.

ఓ వైపు అభివృద్ధి.. మరోవైపు వెనుకబాటుతనం..
హైదరాబాద్ నగరానికి పశ్చిమ ప్రాంతంలో ఉంటుంది చేవెళ్ల నియోజకవర్గం. నగరంలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు.. చుట్టుపక్కల మూడు గ్రామీణ నియోజకవర్గాలతో చేవెళ్ల లోక్‌సభ నియోజక వర్గం ఏర్పాటైంది. పశ్చిమ రంగారెడ్డి జిల్లాగా గుర్తింపు పొందిన.. ఈ లోక్‌సభ స్థానంలో ఓ వైపు అభివృద్ధి.. మరోవైపు వెనుకబాటుతనం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. నగర పరిధిలోని హైటెక్ సిటీ, రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్, ఫార్మాసిటీ చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోకి వస్తాయి.

ఇక గ్రామీణ ప్రాంతమైన తాండూరు, వికారాబాద్, పరిగి నియోజకవర్గాలు వెనుకబాటుతనంతో మగ్గిపోతున్నాయి. దాదాపు 30 లక్షల మంది ఓటర్లు ఉండే ఈ నియోజకవర్గంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు వచ్చాయి. నగరంలోని శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్‌పాటు మహేశ్వరం, చేవెళ్ల నియోజకవర్గాల్లో గులాబీ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. మిగిలిన మూడు స్థానాలైన వికారాబాద్, తాండూరు, పరిగి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు.

గత రెండుసార్లు కారు జోరు..
చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో గత రెండుసార్లు బీఆర్ఎస్ స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శించింది. కారు గుర్తుపై 2014లో పోటీ చేసిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, 2019లో గడ్డం రంజిత్‌రెడ్డి ఎంపీలుగా గెలిచారు. ఐతే అనూహ్యంగా ఈ ఇద్దరూ తమ ఐదేళ్ల పదవీకాలం తర్వాత గులాబీ పార్టీకి బై బై చెప్పేసి.. మరో పార్టీలోకి జంప్ అయిపోయారు. గత ఎన్నికల సమయంలో కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ప్రస్తుతం గడ్డం రంజిత్ రెడ్డి బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరారు. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేసి కమలం గూటికి చేరగా, ప్రస్తుతం బీజేపీ టికెట్‌పై చేవెళ్లలో అదృష్టం పరీక్షించుకుంటున్నారు.

ఇక రంజిత్‌రెడ్డి కూడా సిట్టింగ్ ఎంపీగా బీఆర్ఎస్‌ టికెట్‌ను కాదని కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈసారి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా పోటీకి సిద్ధమవుతున్నారు రంజిత్‌రెడ్డి. ఇక సిట్టింగ్ ఎంపీ హ్యాండ్ ఇవ్వడంతో గత అసెంబ్లీ ఎన్నికల ముందే బీఆర్ఎస్ లో చేరిన టీ టీడీపీ మాజీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ను బరిలోకి దింపుతోంది బీఆర్ఎస్. మూడు పార్టీలు గట్టిగా పోరాడుతుండటంతో చేవెళ్లలో హోరాహోరి పోటీ కనిపిస్తోంది.

కీలకంగా మారిన ఎంఐఎం ఓటర్లు..
ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ఎంఐఎం ఓటు బ్యాంకు ఎన్నికల ఫలితాన్ని ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. గత ఎన్నికల వరకు బీఆర్ఎస్‌తో సత్సంబంధాలు కొనసాగించిన ఎంఐఎం.. ఈ మధ్య కాంగ్రెస్‌ పట్ల సానుకూల వైఖరి ప్రదర్శిస్తుండటం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. ఎంఐఎం ఓటర్లు ఎటు మొగ్గితే ఫలితం ఆ పార్టీకి అనుకూలంగా ఉంటుందనే టాక్‌తో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు అలర్ట్ అవుతున్నట్లు చెబుతున్నారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య లక్ష ఓట్లు మాత్రమే తేడా..
ఇక గత అసెంబ్లీ ఫలితాలను కూడా బేరీజు వేసుకుంటున్న అభ్యర్థులు గెలుపు వ్యూహాలను అమలు చేస్తున్నారు. నాలుగు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చేవెళ్ల నియోజకవర్గం పరిధిలో బీఆర్ఎస్ పార్టీకి 7 లక్షల 7 వేల 456 ఓట్లు రాగా, కాంగ్రెస్ పార్టీకి 6 లక్షల 9 వేల 527 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ నాలుగు స్థానాల్లో గెలవగా, కాంగ్రెస్ మూడు స్థానాల్లో విజయకేతనం ఎగరేసింది. ఇక ఎలాగైనా ఎంపీ సీటు దక్కించుకోవాలని కలలు కంటున్న బీజేపీకి అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 3 లక్షల 35 వేల 504 ఓట్లు మాత్రమే పడ్డాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య లక్ష ఓట్లు మాత్రమే తేడా ఉండటంతో.. ఆపరేషన్ ఆకర్ష్‌ను ముమ్మరంగా చేపట్టిన హస్తం పార్టీ.. పార్లమెంట్ గోల్ కొట్టేందుకు ప్రత్యేక పథకం రచిస్తోందని చెబుతున్నారు.

కేసీఆర్ ఎవరిని నిర్ణయిస్తే.. వారినే గెలిపించిన చేవెళ్ల ఓటర్లు
ఇదే సమయంలో ఏడు అసెంబ్లీ స్థానాల్లో లక్షకు పైగా ఓట్లు తేడా ఉండటంతో గులాబీ పార్టీ ధీమా ప్రదర్శిస్తోంది. గత రెండు సార్లు జరిగిన ఎన్నికల్లోనూ గులాబీ బాస్ కేసీఆర్ ఎవరిని అభ్యర్థిగా నిర్ణయిస్తే.. వారినే ఎంపీగా గెలిపించిన చేవెళ్ల ఓటర్లు.. ఇప్పుడు కూడా పార్టీ అభ్యర్థి కాసానిని గెలిపిస్తారని నమ్ముతోంది బీఆర్ఎస్ నాయకత్వం. కాంగ్రెస్, బీజేపీ నుంచి ఒకే సామాజికవర్గ నేతలు పోటీ చేస్తుండడం కూడా బీఆర్ఎస్‌కు అడ్వాంటేజ్ అవుతుందని లెక్కలు వేసుకుంటున్నారు. ఆ రెండు పార్టీలు అగ్రవర్ణాలకు టికెట్లు ఇస్తే.. తాము బీసీని బరిలోకి దింపామని ప్రచారం చేస్తూ ముదిరాజ్ సామాజికవర్గం ఓట్లపై ఫోకస్ పెట్టింది బీఆర్ఎస్.

ఈసారి రంజిత్ రెడ్డికి ఓటమి తప్పదనే లెక్కలు..
మరోవైపు గత ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ కు హ్యాండిచ్చి కాంగ్రెస్ అభ్యర్థిగా మారిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి పరాజయం పాలైనట్లే.. ఈసారి రంజిత్ రెడ్డికి ఓటమి తప్పదనే లెక్కలు వేసుకుంటోంది గులాబీదళం. బీఆర్ఎస్ పదేళ్లపాటు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే ఈ ఎన్నికల్లో తనను గెలిపిస్తాయంటున్నారు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్.

గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పావులు..
ఇక టార్గెట్ 14 అంటూ లోక్‌సభపై గురిపెట్టిన కాంగ్రెస్.. చేవెళ్ల సీటును తన ఖాతాలో వేసుకునేందుకు పకడ్బందీగా పావులు కదుపుతోంది. ఈ ఎన్నికల్లో ప్రత్యర్థులను మట్టకరిపించాలనే లక్ష్యంతో సిట్టింగ్ ఎంపీ రంజిత్‌రెడ్డిని పార్టీలో చేర్చుకుని టికెట్ ఇచ్చింది కాంగ్రెస్. చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థిత్వం ఖరారైన వెంటనే.. రంగంలోకి దిగిన రంజిత్‌రెడ్డి స్థానిక నేతలతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. కొత్తగా పార్టీలోకి రావడంతో సీనియర్ కాంగ్రెస్ నేతలతో సమన్వయం కోసం అత్యంత ప్రాధాన్యమిస్తున్నారు రంజిత్‌రెడ్డి. దీనితోపాటు ఎంపీగా ఐదేళ్లపాటు బీఆర్ఎస్ నేతలతో సన్నిహితంగా వ్యవహరించడం వల్ల.. క్షేత్రస్థాయిలో నేతలు, కార్యకర్తలు కూడా రంజిత్‌రెడ్డికి బాగా దగ్గరయ్యారు. గత ఐదేళ్లుగా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండడం, పార్టీలకతీతంగా తనకు మద్దతు దక్కుతుందని విశ్వాసంతో ఉన్నారు రంజిత్ రెడ్డి.

అదే.. బీజేపీకి మైనస్..
ఇక భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉన్న మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డికి నియోజకవర్గంలో విస్తృత సంబంధాలు ఉన్నాయి. ఎంపీగా పని చేయడం, కుటుంబ రాజకీయ నేపథ్యంతోపాటు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున బంధుగణం ఉన్న విశ్వేశ్వరరెడ్డి.. వ్యక్తిగత ఇమేజ్‌తో గెలుస్తాననే ధీమాతో ఉన్నారు. గత ఎన్నికల్లో తక్కువ తేడాతో ఓడిపోయారనే సానుభూతితోపాటు ప్రధాని నరేంద్ర మోదీ మ్యాజిక్, జాతీయ అంశాల వల్ల బీజేపీకి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు విశ్వేశ్వర్‌రెడ్డి. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క చోట కూడా బీజేపీ గెలవకపోవడం ఆ పార్టీకి మైనస్‌గా చెబుతున్నారు. గత ఎన్నికల అనుభవాలను దృష్టిలో ఉంచుకొని క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమయ్యేందుకు ఎక్కువ ప్రాధాన్యమిస్తున్న విశ్వేశ్వర్‌రెడ్డి స్థానిక నినాదంతో తన గెలుపు అవకాశాలను మెరుగు పర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

మైనార్టీ ఓటు బ్యాంకు కోసం ఎత్తులు..
మొత్తానికి మూడు పార్టీలు చేవెళ్లలో పాగా వేయాలని తహతహలాడుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను విశ్లేషించుకుంటూ.. వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. ముఖ్యంగా నియోజకవర్గ పరిధిలోని మైనార్టీ ఓటు బ్యాంకు కోసం ఎత్తులు వేస్తున్నాయి. దాదాపు ఐదు లక్షల ఓట్లు ఉన్న మైనార్టీలు ఎవరికి మద్దతుగా నిలిస్తే.. వారికి గెలుపు అవకాశాలు మెరుగయ్యే అవకాశం ఉందనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని.. ఆ దిశగా పావులు కదుపుతున్నాయి.

Also Read : పెద్దపల్లిలో బస్తీమే సవాల్‌.. ఈ ముగ్గురిలో విక్టరీ కొట్టేదెవరు?