Tollywood First Half : 2023లో హాఫ్ అయ్యిపోయింది.. ఏ సినిమా హిట్..! ఏ మూవీ ఫట్..!
ఈ ఏడాది ఫస్ట్ హాఫ్ రివ్యూ ఎలా ఉందో ఒకేసారి చూసేయండి.

2023 Tollywood First Half movies hit and flops list in telugu
Tollywood First Half : ఈ ఏడాది ఫస్ట్ హాఫ్ లో పెద్ద హీరోల సినిమాలు, క్రేజీ కాంబినేషన్ చిత్రాలు ఆడియన్స్ ముందుకు వచ్చాయి. అలాగే ఎటువంటి అంచనాలు లేకుండా ఆడియన్స్ ముందుకు వచ్చిన కొన్ని చిన్న సినిమాలు పెద్ద హిట్టుని ఖాతాలో వేసుకున్నాయి. భారీ బడ్జెట్ మరియు అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాలు మాత్రం అంచనాలు అందుకోలేక డీలా పడ్డాయి.
జనవరిలో వీరయ్య-వీరసింహుని వీరంగం..
ఈ ఏడాది సంక్రాంతి బరిలో సీనియర్ హీరోలు, చిరకాల వెండితెర ప్రత్యర్ధులు చిరంజీవి అండ్ బాలకృష్ణ మరోసారి పందానికి దిగారు. జనవరి 11న వీరసింహారెడ్డి (Veera Simha Reddy) గా బాక్స్ ఆఫీస్ వద్ద బాలయ్య ఊచకోత కొస్తే, 13న వాల్తేరు వీరయ్య (Waltair Veerayya) గా వీర విహారం చేశాడు. ఈ రెండు సినిమాలు 100 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకొని చిరు, బాలయ్య సత్తా ఏంటో బాక్స్ ఆఫీస్ కి మరోసారి చూపించాయి.
వీటితో పాటు జనవరి 14నే యంగ్ హీరో సంతోష్ శోభన్ – కల్యాణం కమనీయం (Kalyanam Kamaneeyam) చిత్రం సంక్రాంతి బరిలో నిలిచినప్పటికీ పందెం గెలవలేకపోయింది. ఇక జనవరి 26న వచ్చిన సుధీర్‌బాబు హంట్ (Hunt) బాక్స్ ఆఫీస్ వద్ద హంట్ చేయలేక డీలా పడింది.
ఫిబ్రవరిలో సార్ పాఠాలు..
ఫిబ్రవరిలో ముందుగా ఆడియన్స్ ముందుకు వచ్చిన హీరో సందీప్ కిషన్. పాన్ ఇండియా చిత్రం అంటూ ‘మైఖేల్’ సినిమాని ఫిబ్రవరి 3న తీసుకువచ్చి ప్లాప్ ని అందుకున్నాడు. అయితే అదే రోజు కమెడియన్ సుహాస్ హీరోగా తెరకెక్కిన రెండో సినిమా రైటర్ పద్మభూషణ్ (Writer Padmabhushan) మంచి మార్కులు కొట్టేసింది. ఇక ఫిబ్రవరి 4న రిలీజ్ అయిన ‘బుట్టబొమ్మ’ ఆకట్టుకోలేకపోయింది. ఫిబ్రవరి 10న నందమూరి కల్యాణ్ రామ్ బాక్స్ ఆఫీస్ వద్ద అమిగోస్ (Amigos) తో త్రిపాత్రాభినయం చేసిన ఫలితం లేకుండా పోయింది.
ఇక తమిళ్ హీరో ధనుష్ తెలుగులో ఫస్ట్ స్ట్రెయిట్ మూవీ చేస్తూ ఆడియన్స్ ని సార్ (Sir) గా ఫిబ్రవరి 17న పలకరించాడు. సార్ పాటలకు ఆడియన్స్ నుంచి మంచి మార్కులే పడ్డాయి. ఈ మూవీ వచ్చిన నెక్స్ట్ డే కిరణ్ అబ్బవరం వినరో భాగ్యము విష్ణుకథ (Vinaro Bhagyamu Vishnu Katha) అంటూ ప్రేక్షకులకు తన సినిమా కథని కొత్త కాన్సెప్ట్‌తో చెప్పడంతో విజయాన్ని అందుకున్నాడు. ఇక జనవరిలో హిట్ అందకపోవడంతో ఫిబ్రవరి ‘శ్రీదేవి శోభన్‌బాబు’తో వచ్చిన సంతోష్ శోభన్ కి ఈసారి కూడా విజయం దక్కలేదు.
మార్చిలో తెలంగాణ కథకి కాసుల వర్షం..
దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రం అన్న ఒక పాయింట్ తప్ప ఎటువంటి అంచనాలు లేకుండా మార్చి 3న రిలీజ్ అయిన చిన్న సినిమా బలగం (Balagam). జబర్దస్త్ నటుడు వేణు దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కిన ఈ సినిమా తెలంగాణ పల్లె సంస్కృతి, సంప్రదాయాన్ని ప్రతిఒక్కరికి పరిచయం చేసింది. భారీ కలెక్షన్స్ అందుకోవడమే కాకుండా ఎన్నో అంతర్జాతీయ అవార్డ్స్ కూడా అందుకుంది. ఈ సినిమాతో పాటే బిగ్ బాస్ ఫేమ్ సోహెల్ ‘ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు’ రిలీజ్ కాగా హిట్ అందుకోలేకపోయింది.
అలాగే 10న ‘సి.ఎస్.ఐ. సదన్’, 17న ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ సినిమాలు అలా వచ్చి అలా వెళ్లిపోయాయి. 22న రిలీజ్ అయిన విశ్వక్ సేన్ ‘దాస్ కా ధమ్కీ’ ఆడియన్స్ చేత విజుల్స్ వేయిస్తే, కృష్ణవంశీ ‘రంగమార్తాండ’ ప్రేక్షకుల్ని ఎమోషనల్ చేసింది. ఇక నెలాఖరులో వచ్చిన నాని – దసరా (dasara) సినిమాతో 100 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టాడు. ఈ సినిమా కూడా తెలంగాణ సంప్రదాయ నేపథ్యంతోనే వచ్చింది.
ఏప్రిల్‌లో సాయిధరమ్ గ్రాండ్ కమ్ బ్యాక్..
ఏప్రిల్‌లో చిన్న పెద్ద చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో విజయం సాధించింది మాత్రం ఒకటే సినిమా. అదే సాయిధరమ్ తేజ్ కమ్ బ్యాక్ ఇస్తూ చేసిన విరూపాక్ష (Virupaksha). తాంత్రిక శక్తులు కాన్సెప్ట్ తో 21న వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ ని థ్రిల్ కి గురి చేసి 100 కోట్లు అందుకుంది. ఇక రవితేజ నెగటివ్ షేడ్స్ లో కనిపిస్తూ చేసిన రావణాసుర (Ravanasura), భారీ అంచనాలతో మిథిలాజికల్ మూవీగా వచ్చిన సమంత శాకుంతలం (Shaakuntalam), అఖిల్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ఏజెంట్ (Agent), కిరణ్ అబ్బవరం ‘మీటర్’ బాక్స్ ఆఫీస్ వద్ద చతికిలపడ్డాయి. ఒకటే క్యారెక్టర్ తో వచ్చిన చిన్న సినిమా ‘హలో.. మీరా..!’ ప్రశంసలతో సరిపెట్టుకుంది.
మేలో మేమ్ ఫేమస్..
మేలో కూడా ఏప్రిల్ మాదిరి ఒకటే సినిమా ఆడియన్స్ ని అలరించగలిగింది. సుమంత్ ప్రభాస్ హీరోగా మే 26న వచ్చిన మేమ్ ఫేమస్ (Mem Famous) మంచి విజయం అందుకోవడమే కాకుండా మహేష్ బాబు నుంచి సుమంత్ ప్రభాస్ కి ఆఫర్ ని కూడా తెచ్చిపెట్టింది. ఇక అక్కినేని హీరోలు వరుస ప్లాప్ లతో అభిమానులను నిరాశ పరచడంతో.. అందరూ నాగచైతన్య కస్టడీ (Custody) పై ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆ సినిమా కూడా అక్కినేని ఫ్యాన్స్ ని ప్లాప్‌ల కస్టడీలోనే పడేసింది.
హిట్ కాంబినేషన్స్ వచ్చిన గోపీచంద్ అండ్ అల్లరి నరేష్ కూడా ఆడియన్స్ ని ఆకట్టుకోలేకపోయారు. తమకి ఇంతకుముందు హిట్స్ ఇచ్చిన దర్శకులతో గోపీచంద్ – రామబాణం (Ramabanam), నరేష్ – ఉగ్రం (Ugram) తీసి విఫలం అయ్యారు. ఇక సీనియర్ నరేష్ మళ్లీ పెళ్లి (Malli Pelli), కథ వెనుక కథ, భువన విజయమ్ చిత్రాలు అలా వచ్చి అలా వెళ్లిపోయాయి.
జూన్‌లో ఆదిపురుష్‌తో పరేషాన్ అయ్యిపోయింది..
ప్రభాస్ మోస్ట్ అవైటెడ్ మూవీ ఆదిపురుష్ (Adipursuh) జూన్ 16న విడుదలైంది. ప్రభాస్ రాముడిగా రామాయణ కథాంశంతో వచ్చిన ఈ సినిమా భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి వివాదాల్లో చిక్కుకుంది. రామాయణాన్ని వక్రీకరించేలా సినిమా ఉంది అంటూ ప్రధాని మంత్రి నరేంద్ర మోదీకి విన్నపాలు పంపేవరకు ఆదిపురుష్ ఇబ్బందులు ఎదురుకుంది. ఇక ఇదే నెలలో వచ్చిన రానా దగ్గుబాటి తమ్ముడు అభిరామ్ ‘అహింస’, బెల్లంకొండ గణేశ్ ‘నేను స్టూడెంట్ సర్!’, సిద్ధార్థ్ ‘టక్కర్’ చిత్రాలు ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి.
తిరువీర్ హీరోగా తెరకెక్కిన పరేషాన్ (Pareshan) జూన్ 2న రిలీజ్ అయ్యి ఆడియన్స్ ని బాగా ఎంటర్టైన్ చేసింది. అలాగే విమానం, ఇంటింటి రామాయణం సినిమాలు కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. ఇక ఈ నెలాఖరులో వచ్చిన శ్రీవిష్ణు సామజవరగమన (samajavaragamana) మొదటిరోజే సక్సెస్ టాక్ ని అందుకుంటే, నిఖిల్ స్పై (Spy) మాత్రం మిక్స్‌డ్ టాక్ తో రన్ అవుతుంది.
డబ్బింగ్‌లో బిచ్చగాడు 2, 2018..
ఈ ఫస్ట్ హాఫ్ పలు డబ్బింగ్ సినిమాలు తెలుగు ఆడియన్స్ ముందుకు వచ్చాయి. అయితే వాటిలో విజయ్ – వారసుడు, అజిత్ – తెగింపు, మణిరత్నం – పొన్నియిన్ సెల్వన్ 2 చిత్రాలు ఒకే అనిపించుకోగా.. విజయ్ ఆంటోనీ – బిచ్చగాడు 2, కేరళ చిత్రం 2018 మంచి విజయాలను అందుకున్నాయి. ఈ ఏడాది ఫస్ట్ హాఫ్ రివ్యూ అయితే ఇదే. మరి సెకండ్ హాఫ్ ఎలా ఉండబోతుందో చూడాలి.