Kismat Review : ‘కిస్మత్’ మూవీ రివ్యూ.. బిటెక్ బాధితులు చూడాల్సిన సినిమా.. ఫుల్ గా నవ్వుకోవాల్సిందే..

బిటెక్ అయిపోయి జాబ్స్ కోసం తిరిగే ఓ ముగ్గురు కుర్రాళ్లకు ఒకేసారి డబ్బులు దొరికితే ఎలాంటి సమస్యలు వచ్చాయి, వాళ్ళు వాటిని ఎలా సాల్వ్ చేసుకున్నారు అనే కథాంశాన్ని ఫుల్ లెంగ్త్ కామెడీగా చూపించారు.

Kismat Review : ‘కిస్మత్’ మూవీ రివ్యూ.. బిటెక్ బాధితులు చూడాల్సిన సినిమా.. ఫుల్ గా నవ్వుకోవాల్సిందే..

Abhinav Gomatam Naresh Agastya Comedy Movie Kisamt Review and Rating

Updated On : February 3, 2024 / 2:26 PM IST

Kismat Movie Review : నరేష్ అగస్త్య, అభినవ్ గోమఠం, విశ్వదేవ్ రాచకొండ, రియా సుమన్, అజయ్ ఘోష్, అవసరాల శ్రీనివాస్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా కిస్మత్. కామ్రేడ్ ఫిలిం ఫ్యాక్టరీ నిర్మాణంలో శ్రీనాథ్ బాదినేని దర్శకత్వంలో ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది కిస్మత్. ఈ సినిమా ఫిబ్రవరి 2న థియేటర్స్ లోకి వచ్చింది.

కథ విషయానికొస్తే.. కార్తీక్ (నరేష్ అగస్త్య), అభి (అభినవ్ గోమఠం), కిరణ్ (విశ్వదేవ్ రాచకొండ) ముగ్గురు ఫ్రెండ్స్. బిటెక్ చదివి జాబ్స్ రాక ఊళ్ళో ఖాళీగా ఉంటారు. అనుకోకుండా ఓ గొడవలో పోలీస్ స్టేషన్ వరకు ఈ ముగ్గురు వెళ్లడంతో ఇంట్లో మరింత తిడతారు. దీంతో మళ్ళీ హైదరాబాద్ కి వెళ్లి ఏదో ఒక జాబ్ చేయాలి అనుకుంటారు. ముగ్గురూ హైదరాబాద్ లో ఒక రూమ్ తీసుకొని జాబ్స్ వేటలో పడతారు. ఈ సమయంలో కార్తీక్ ఓ ఇంటర్వ్యూకి వెళ్లగా అక్కడ తాన్యా(రియా సుమన్)తో పరిచయం ప్రేమగా మారుతుంది. మరోవైపు రాజకీయ నాయకుడు జనార్దన్(అజయ్ ఘోష్) దగ్గర పనిచేసే సూరి(టెంపర్ వంశీ) పరిచయం అవ్వడంతో అతనితో పాటు ర్యాలీకి వెళ్తే డబ్బులు వస్తాయని తెలిసి కొన్నాళ్ళు ర్యాలీల్లో పాల్గొంటారు.

ఓ వ్యక్తి పది లక్షలు ఇస్తే బ్యాక్ డోర్ జాబ్స్ సెట్ చేస్తాను అని చెప్పడంతో సూరి వ్యక్తులు ర్యాలీ ఖర్చులకు బ్లాక్ మనీ తీసుకొస్తుంటే డబ్బుల కోసం కార్తీక్, అభి, కిరణ్ వాటిని కొట్టేస్తారు. అదే సమయంలో వీరికి ఇరవై కోట్లు అనుకోకుండా దొరుకుతాయి. జనార్దన్ ఇరవై కోట్లు పోతాయి. అవి ఎలా పోయాయి? సూరి, పోలీసాఫీసర్ వివేక్ (అవసరాల శ్రీనివాస్) ఆ డబ్బుల కోసం వెతకడం, ఆ ముగ్గురు ఆ డబ్బులని ఏం చేశారు? ఆ డబ్బులు చివరికి ఎవరి దగ్గరకు వెళ్లాయి? ఆ డబ్బుల కోసం ఇంకెవరెవరు వచ్చారు అనేది తెరపై చూడాల్సిందే.

సినిమా విశ్లేషణ.. మొదటి హాఫ్ అంతా ముగ్గురు యువకులు జాబ్స్ కోసం వెతకడం, వాళ్ళ మధ్య కామెడీ, డబ్బు దొరకడంతో సాగుతుంది. ఒకేసారి ఇరవై కోట్లు దొరకడంతో వాటిని ఏం చేస్తారు అని ఇంటర్వెల్ వద్ద మంచి ఆసక్తి వస్తుంది. ఇంటర్వెల్ తర్వాత మౌస్ అండ్ క్యాట్ గేమ్ లాగా ఒకరి కోసం ఒకరు వెతకడం, అందరూ డబ్బుల కోసం పరిగెత్తడం అంటూ సాగుతుంది. ఇదంతా కూడా కామెడిగానే తెరకెక్కించాడు దర్శకుడు. అయితే కథలో ముఖ్యంగా బిటెక్ చదివి ఖాళీగా ఉండే వాళ్ళు, జాబ్స్ లేకపోవడం, గవర్నమెంట్ ఇచ్చే ఫీజ్ రీయింబర్సమెంట్స్ కోసం పుట్టగొడుగుల్లాగా పుట్టుకొచ్చిన ఇంజనీరింగ్ కాలేజీలపై చర్చించాడు. ఈ సీరియస్ విషయాన్ని కూడా కామెడీతో బాగా చూపించాడు దర్శకుడు. చివర్లో సినిమా అయిపోయింది అనుకునే సరికి ఒక ట్విస్ట్ రివీల్ చేస్తారు.

Also Read : Bootcut Balaraju : ‘బూట్‌కట్‌ బాలరాజు’ రివ్యూ.. అసలు ఈ బూట్ కట్ కథేంటి?

నటీనటులు.. నరేష్ అగస్త్య, అభినవ్ గోమఠం, విశ్వదేవ్ ఫ్రెండ్స్ గా మెప్పించారు. ఎప్పట్లాగే అభినవ్ తన కామెడీతో ఫుల్ గా నవ్వించాడు. అజయ్ ఘోష్, టెంపర్ వంశీ కూడా మెప్పిస్తారు. పోలీసాఫీసర్ పాత్రలో అవసరాల శ్రీనివాస్ కూడా నవ్విస్తూనే సీరియస్ గా కనిపిస్తాడు. హీరోయిన్ గా తాన్యా ఫస్ట్ హాఫ్ లో ప్రేమ సన్నివేశాల్లో, సాంగ్స్ లో కనపడినా సెకండ్ హాఫ్ లో అందరూ డబ్బు కోసం ఈ అమ్మాయినే కిడ్నాప్ చేయడం ఫన్నీగా ఉంటుంది. చివర్లో సమీర్ వచ్చి ఓ ట్విస్ట్ ఇస్తాడు అందరికి.

సాంకేతిక విషయాలు.. ఈ సినిమాకు కథ, కథనం చాలా ప్లస్ అయ్యాయి. డైలాగ్స్ కూడా కామెడీ పండేలాగా రాసుకున్నారు. సెకండ్ హాఫ్ లో డబ్బు కోసం అందరూ వెతికే కన్ఫ్యూజన్ కథనం కూడా క్లారిటీగా రాసుకున్నారు. దర్శకుడిగా శ్రీనాథ్ బాదినేని సక్సెస్ అయ్యాడనే చెప్పొచ్చు. కెమెరా విజువల్స్, నిర్మాణం విలువలు బాగానే ఉన్నాయి. కామెడీకి సెట్ అయిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంటుంది. పాటలు పర్వాలేదనిపిస్తాయి.

మొత్తంగా బిటెక్ అయిపోయి జాబ్స్ కోసం తిరిగే ఓ ముగ్గురు కుర్రాళ్లకు ఒకేసారి డబ్బులు దొరికితే ఎలాంటి సమస్యలు వచ్చాయి, వాళ్ళు వాటిని ఎలా సాల్వ్ చేసుకున్నారు అనే కథాంశాన్ని ఫుల్ లెంగ్త్ కామెడీగా చూపించారు. ఈ సినిమాకు 2.5 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి అభిప్రాయం మాత్రమే.