Roshan – Akash : యాంకర్ సుమ కొడుకు వర్సెస్ సింగర్ సునీత కొడుకు.. మొదటి సినిమాలతోనే పోటీ..
యాంకర్ సుమ కొడుకు హీరోగా ఎంట్రీ ఇస్తున్న సమయంలోనే సుమ స్నేహితురాలు, సింగర్ సునీత కొడుకు కూడా హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు.

Anchor Suma Son Roshan Kanakala and Singer Sunitha Son Akash Goparaju Debut Movies Clash
Roshan – Akash : గత ఇరవై ఏళ్లుగా సుమ కనకాల(Suma Kanakala) తన యాంకరింగ్ తో తెలుగు ప్రేక్షకులని మెప్పించి తెలుగు వారి కుటుంబాల్లో ఒకరిగా చేరిపోయింది. యాంకరింగ్, సినిమాలు, సినిమా ఈవెంట్స్, యూట్యూబ్, సోషల్ మీడియా.. ఇలా అన్నిట్లో బిజీగా అంటుంది సుమ. సుమ తనయుడు రోషన్ కనకాల గతంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఓ సినిమా చేశాడు. ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే.
రవికాంత్ పేరెపు దర్శకత్వంలో రోషన్ కనకాల హీరోగా ‘బబుల్ గమ్’(Bubble Gum) అనే సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇందులో మానస చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా డిసెంబర్ 29న రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే టీజర్, ట్రైలర్ రిలీజ్ చేయగా ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.
అయితే సుమ కొడుకు హీరోగా ఎంట్రీ ఇస్తున్న సమయంలోనే సుమ స్నేహితురాలు, సింగర్ సునీత కొడుకు కూడా హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు.
సింగర్ సునీత(Singer Sunitha) కుమారుడు ఆకాష్(Akash Goparaju) హీరోగా ‘సర్కారు నౌకరి’ అనే ఓ సినిమాతో పరిచయం కాబోతున్నాడు. ఇందులో భావన హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాని ఆర్కే టెలీ షో బ్యానర్ పై దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు నిర్మించడం విశేషం. కొత్త దర్శకుడు గంగనమోని శేఖర్ దర్శకత్వం వహించగా ఇప్పటికే ఈ సినిమా టిజర్ రిలీజ్ చేశారు. 90ల్లో జరిగిన ఓ యదార్థ ఘటన ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు. సర్కారు నౌకరి సినిమాను న్యూఇయర్ సందర్భంగా జనవరి 1న రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు.
సుమ కొడుకు రోషన్ డిసెంబర్ 29న బబుల్ గమ్ సినిమాతో హీరోగా ఏంట్రీ ఇస్తుంటే మూడు రోజుల తర్వాత సింగర్ సునీత తనయుడు ఆకాష్ జనవరి 1న సర్కారు నౌకరి సినిమాతో రాబోతున్నాడు. దీంతో టాలీవుడ్ లో ఈ రెండు సినిమాలపై ఆసక్తి నెలకొంది. సుమ, సునీత ఎప్పట్నుంచో మంచి స్నేహితులు. వీరిద్దరూ చాలా క్లోజ్ అని గతంలో వీరే పలు ఇంటర్వ్యూలలో చెప్పారు. ఇప్పుడు ఇద్దరి కొడుకులు ఒకేసారి హీరోలుగా ఎంట్రీ ఇవ్వడం, తమ మొదటి సినిమాలతోనే పోటీ పడటం అందరిలోనూ ఆసక్తిని నెలకొల్పింది. మరి ఈ రెండు సినిమాల్లో ప్రేక్షకులని ఏ సినిమా మెప్పిస్తుంది? ఎవరు హీరోగా మెప్పిస్తారో చూడాలి.