మెగాస్టార్ అభిమానులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్

మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్స్ నిర్మాణంలో రామ్ చరణ్ నిర్మించిన సినిమా ‘సైరా నరసింహారెడ్డి’. అక్టోబర్ 2వ తేదీన అంటే రేపు ఈ సినిమా విడుదల అవుతుంది. ప్యాన్ ఇండియా మూవీగా తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల అవుతుంది ఈ సినిమా.
తెలుగు స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కింది. 270కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి, నయనతార, తమన్నా, రవికిషన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
అయితే ఈ సినిమాకు ప్రత్యేక అనుమతులు ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈ సినిమా అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల కాబోతుండగా.. సినిమా ప్రదర్శన నిమిత్తం అదనపు షోలకు అనుమతి ఇచ్చింది ప్రభుత్వం.
నిర్మాత రామ్ చరణ్ ఈ మేరకు ఏపీ ప్రభుత్వానికి అభ్యర్ధన చేసుకోగా.. దీనికి అంగీకారం తెలుపుతూ ఏపీ ప్రభుత్వం జీవోను విడుదల చేసింది. అక్టోబర్ 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు అంటే 7 రోజులు ఈ సినిమాను ఉదయం గం. 1 నుంచి ఉదయం గం. 10 వరకు అదనపు షోలు ప్రదర్శించుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.