Balakrishna: చాలా గర్వంగా ఉంది.. చంద్రబాబు, పవన్ కూడా వచ్చారు: బాలకృష్ణ

తలసీమియాతో బాధపడుతున్న చిన్నారులకు ఉచితంగా సేవలు అందిస్తున్నామని చెప్పారు.

Balakrishna: చాలా గర్వంగా ఉంది.. చంద్రబాబు, పవన్ కూడా వచ్చారు: బాలకృష్ణ

Balakrishna

Updated On : February 15, 2025 / 8:03 PM IST

విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఇవాళ ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో యూఫోరియా మ్యూజికల్ నైట్‌ పేరిట ఈవెంట్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా సినీనటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ… తలసేమియా బాధిత పిల్లల కోసం ఎన్టీఆర్ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఈ ఈవెంట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇవాళ ఉదయమే తాము పీడియాట్రిక్ ఆంకాలజీ కొత్త వార్డుని ఓపెన్ చేశామని చెప్పారు. అందులో అత్యాధునిక వసతులు కల్పించినట్లు తెలిపారు.

బసవతారకం క్యాన్సర్ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూషన్‌ నిర్మాణాన్ని తన తండ్రి సీనియర్ ఎన్టీఆర్ ప్రారంభించారని, అది పూర్తవడానికి పదేళ్లు పట్టిందని అన్నారు. చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన సహకారంతో మరికొందరి సహకారంలో ఆసుపత్రిని ప్రారంభించామని చెప్పారు.

Also Read: SBI గుడ్ న్యూస్.. వడ్డీ రేట్లపై కీలక ప్రకటన.. హోమ్ లోన్ తీసుకున్న వారికి.. తీసుకోవాలి అనుకునే వారికి..

ప్రస్తుతం చేస్తున్న సేవా కార్యక్రమాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ఇవాళ ఈ ఈవెంట్‌కు ఇంత మంది వచ్చారని అన్నారు. సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లన్న తన తండ్రి చెప్పిన స్ఫూర్తితో ఆయన ఆశయాలకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. సీనియర్‌ ఎన్టీఆర్ తనకు కేవలం తండ్రి మాత్రమే కాదని, గురువు, దైవం అని చెప్పారు.

తన తల్లి బసవతారకాన్ని కూడా తలుచుకుంటున్నానని అన్నారు. సర్వీసులు అందించడానికి తమ వంతు కృషి చేశామని, చేస్తున్నామని, చేస్తూనే ఉంటామని తెలిపారు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్, బ్లడ్ బ్యాంక్, విద్యాలయాలు, క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా తమ వంతు సేవలు అందిస్తున్నామని చెప్పడానికి గర్విస్తున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా గర్వంగా ఉందన్నారు. తలసీమియాతో బాధపడుతున్న చిన్నారులకు ఉచితంగా సేవలు అందిస్తున్నామని చెప్పారు. చాలా మంది చిన్నారులు తలసీమియాతో బాధపడుతున్నారని బాలకృష్ణ అన్నారు. ప్రస్తుతం 250 తలసీమియా చిన్నారులకు వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పారు.

ఏపీలోనూ మరో తలసీమియా కేర్ సెంటర్‌ను ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని, ఇందుకోసం సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. సంగీతంతో ఎన్నో సమస్యలు దూరం అవుతాయని బాలకృష్ణ అన్నారు. ఇవాళ ఈ ఈవెంట్‌లో తమన్ సంగీతం వినిపిస్తారని చెప్పారు.