బాలయ్య చిత్రాలు 30 మరియు 35 సంవత్సరాలు పూర్తి..

యువరత్న నందమూరి బాలకృష్ణ నటించిన రెండు చిత్రాలు 2020 ఏప్రిల్ 27 నాటికి 30 మరియు 35 సంవత్సరాలు పూర్తిచేసుకుంటున్నాయి.
ప్రముఖ రచయితల ద్వయం, పరుచూరి బ్రదర్స్ దర్శకత్వంలో బాలయ్య, ఊర్వశి హీరో హీరోయిన్లుగా, సత్య చిత్ర పతాకంపై సత్యనారాయణ, సూర్యనారాయణ నిర్మించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.. ‘భలేతమ్ముడు’.. 1985 ఏప్రిల్ 27న విడుదలైన ఈ చిత్రం నేటితో 35 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. కె.చక్రవర్తి ఈ సినిమాకి సంగీతమందించారు.
అలాగే యువరత్న నందమూరి బాలకృష్ణ నటించిన మరో కుటుంబ కథా చిత్రం ‘నారీ నారీ నడుమ మురారి’.. 1990 ఏప్రిల్ 27న విడుదలైన ఈ సినిమా 2020 ఏప్రిల్ 27 నాటికి విజయవంతంగా 30 సంవత్సరాలు పూర్తి చేసుకుంటోంది. యువ చిత్ర ఆర్ట్స్ పతాకంపై, స్టార్ డైరెక్టర్ ఎ.కోదండరామి రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో శోభన, నిరోషా కథానాయికలు కాగా, ‘నవరస నటనా సార్వభౌమ’ కైకాల సత్యనారాయణ, ‘ఊర్వశి’ శారద కీలక పాత్రలు పోషించారు.
కెరీర్లో 50వ చిత్రం అయినా ఎటువంటి కమర్షియల్ హంగులకు పోకుండా కుటుంబ కథా చిత్రాన్ని ఎంపిక చేసుకుని.. ప్రేక్షకాభిమానులను అలరించాడు బాలయ్య. ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. కె.వి.మహదేవన్ స్వరపరచిన పాటలు, నేపథ్య సంగీతం, ఎ.విన్సెంట్, అజయ్ విన్సెంట్ కెమెరా వర్క్, ఆచార్య ఆత్రేయ, వేటూరి, సిరివెన్నెల పాటలు, తనికెళ్ల భరణి, భమిడిపాటి రాధాకృష్ణ, జి,సత్యమూర్తి, వినాయక శర్మ రాసిన మాటలు సినిమాకు ప్లస్ అయ్యాయి. బాలయ్య నటన, కామెడీ టైమింగ్, డ్యాన్సులు అభిమానులను అలరించాయి. ఈ సినిమాలో ఒక్క ఫైట్ కూడా లేకపోవడం విశేషం. బాలయ్య నటజీవితంలో ‘నారీ నారీ నడుమ మురారి’ ప్రత్యేకమైన చిత్రం అని చెప్పొచ్చు.