Balakrishna : బాలకృష్ణకు పద్మ భూషణ్.. దేశంలోనే అత్యున్నత మూడో పురస్కారం..
నందమూరి బాలకృష్ణకు నటన, రాజకీయాలు, సేవా కార్యక్రమాలలో కేంద్ర ప్రభుత్వం పద్మ భూషణ్ అవార్డు ప్రకటించింది.

Central Government Announce Padma Bhushan Award to Nandamuri Balakrishna
Balakrishna : రిపబ్లిక్ డే సందర్భంగా ప్రతి సంవత్సరం పద్మ అవార్డులను ప్రకటిస్తారని తెలిసిందే. తాజాగా నేడు పద్మ అవార్డులను ప్రకటించారు. పద్మశ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్ అవార్డులను ప్రకటించారు. ఈ క్రమంలో మన బాలయ్య బాబుకు కేంద్ర ప్రభుత్వం పద్మ భూషణ్ అవార్డు ప్రకటించారు. నందమూరి బాలకృష్ణకు కళా రంగం కేటగిరిలో పద్మ అవార్డులకు నామినేట్ చేయగా కేంద్ర ప్రభుత్వం దేశంలోనే అత్యున్నత మూడో పురస్కారం అయిన పద్మ భూషణ్ అవార్డు ప్రకటించింది. దీంతో బాలయ్య అభిమానులు, తెలుగు దేశం కార్యకర్తలు, సినీ ప్రముఖులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బాలకృష్ణకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
Also Read : Padma Awards: పద్మ అవార్డులకు మీ పేరును మీరు ఎలా నామినేట్ చేసుకోవచ్చంటే..?
నటుగానే కాక రాజకీయ నాయకుడిగా, బసవతారకం క్యాన్సర్స్ ఆస్పత్రి ఛైర్మన్ గా బాలకృష్ణ ప్రజలకు ఎంతో సేవ చేస్తున్నారు. విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారకరామారావు తనయుడిగా తాతమ్మ కల సినిమాతో 1974వ సంవత్సరంలో సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. 14 ఏళ్ల వయస్సులోనే తండ్రి ఎన్టీఆర్ తో కలిసి నటించారు. ఇటీవలే నటుడిగా 50 ఏళ్ళు కూడా పూర్తి చేసుకున్నారు. ఇప్పటి వరకు 109 సినిమాల్లో నటించారు బాలయ్య బాబు. రెగ్యులర్ లవ్, మాస్ కమర్షియల్ సినిమాలతో పాటు చారిత్రక, జానపద, పౌరాణిక, సాంఘిక చిత్రాలలో కూడా నటించి ప్రేక్షకులను మెప్పించారు. అభిమానులతో యువరత్న అని పిలిపించుకున్న బాలయ్య ఇప్పుడు గాడ్ ఆఫ్ మాసెస్ గా మారారు. సినిమాల కోసం ఎన్ని రిస్కులైన తీసుకొని డూప్స్ లేకుండానే ఫైట్స్ చేసి ఫ్యాన్స్ ని అలరించారు.
గత కొంతకాలంగా బాలయ్య బాబు ఫుల్ ఫామ్ లో ఉన్నారు. అఖండ సినిమాతో బాలయ్య విజయాల పర్వం మొదలైంది. అఖండ, వీరసింహా రెడ్డి, భగవంత్ కేసరి, ఇటీవల డాకు మహారాజ్.. ఇలా వరుసగా అన్ని 100 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి భారీ హిట్స్ కొట్టాయి. చేతిలో మరో రెండు సినిమాలు ఉన్నాయి. త్వరలో అఖండ 2 షూటింగ్ లో పాల్గొనబోతున్నారు. మరోవైపు అన్‌స్టాపబుల్ అంటూ ఆహా ఓటీటీలో యాంకర్ గా సరికొత్తగా ప్రేక్షకులకు పరిచయమయ్యారు. చాలా మంది సినీ సెలబ్రిటీలను తన షోకి తీసుకొచ్చి తనదైన శైలిలో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చి ప్రేక్షకులను, ఫ్యాన్స్ ని ఆశ్చర్యపోయేలా చేసారు.
Also Read : Raviteja : రవితేజ మైల్ స్టోన్ సినిమా.. ఈసారి పక్కా హిట్..
ఇక హిందూపురం నియోజకవర్గానికి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ సాధించి అక్కడి ప్రజలకు అండగా నిలుస్తున్నారు. క్యాన్సర్ భారినపడ్డ ఎంతో మందికి తన బసవతారకం ఆస్పత్రిలో ఉచిత చికిత్సను అందిస్తూ ఎంతోమందికి ప్రాణదానం కూడా చేసాడు మన బాలయ్య బాబు. ఇలా నటనలో ప్రజా క్షేత్రంలో ప్రజా సేవలో గత 50 ఏళ్లుగా నిర్విరామంగా కృషి చేస్తున్న బాలకృష్ణకు పద్మ భూషణ్ అవార్డు రావడం ఎంతో ఆనందకరం అని ఫ్యాన్స్, తెలుగుదేశం కార్యకర్తలు, నెటిజన్లు అంటూ ఆయనకు అభినందనలు తెలుపుతున్నారు.