Tollywood : టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కీలక తీర్పు.. పూరీ, తరుణ్ శరీరంలో డ్రగ్స్ ఆనవాళ్లు లేవు..
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కీలక తీర్పు ప్రకటించిన కోర్టు. ఎఫ్ఎస్‌ఎల్ నివేదిక ప్రకారం పూరీ, తరుణ్ శరీరంలో డ్రగ్స్ ఆనవాళ్లు..

Court Crucial judgement on Tollywood stars drugs case
Tollywood : ఏడేళ్ల క్రిందట టాలీవుడ్ లోని బడా సెలబ్రిటీస్ పేర్లు డ్రగ్స్ కేసులో వినిపించి.. సంచలనంగా మారింది. ఈ మధ్యలో ఏ డ్రగ్స్ కేసు వినిపించినా, ఆ మునపటి కేసు మళ్ళీ తెరపైకి వస్తూనే ఉంది. ఇప్పుడు ఆ కేసు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తుంది. 2017లో సంచలనం అయిన ఆ డ్రగ్స్ కేసులో పూరిజగన్నాథ్, ఛార్మి, రకుల్ ప్రీత్ సింగ్, దగ్గుబాటి రానా, రవితేజతో పాటు అతని అసిస్టెంట్ శ్రీనివాస్, నవదీప్, ముమైత్ ఖాన్, తనీష్, నందు, తరుణ్.. పేర్లు వినిపించాయి.
ఇక వీరందర్నీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక సిట్ విచారించడం కూడా జరిగింది. ఇక ఆ కేసు విషయంలో పూరిజగన్నాథ్, తరుణ్ స్వచందంగా ముందుకు వచ్చి.. తమ రక్తం, గోళ్లు, వెంట్రుకల నమూనాలను వైద్య పరీక్షల కోసం అందజేశారు. ఇక వాటిని పరీక్షించిన ఎఫ్ఎస్‌ఎల్.. ఆ నమూనాల్లో డ్రగ్స్ లేవని స్పష్టం చేసింది. ఆ రిజల్ట్స్ వచ్చిన తరువాత కూడా… కోర్టులో ఇంకా ఆ కేసు కొనసాగుతూనే వస్తుంది.
తాజాగా ఈ కేసులో ఎక్సైజ్ శాఖకు ఎదురు దెబ్బ తగిలింది. ఈ డ్రగ్స్ కేసు విషయంలో మొత్తం 8 కేసులు నమోదు అయ్యాయి. వీటిలో ఇప్పుడు ఆరు కేసులను కోర్టు కొట్టిపారేసింది. డ్రగ్స్ కేసులో పాటించాల్సిన ప్రొసీజర్ ని ఎక్సైజ్ శాఖ ఫాలో కాలేదని, ఆరు కేసుల్లో ఎలాంటి సాక్ష్యాలను, ఆధారాలను కూడా హాజరుపరచలేని ఎక్సైజ్ శాఖ.. నెలల తరబడి టాలీవుడ్ నటులను విచారించడం పై ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇక నటీనటుల దగ్గర నుంచి సేకరించిన గోళ్లు, వెంట్రుకల శాంపిళ్స్ లో డ్రగ్స్ ఆనవాళ్లు లేవని ఇచ్చిన ఎఫ్‌ఎఎస్‌ఎల్ నివేదం ప్రకారం.. కోర్టు కేసుపై తీర్పుని ఇచ్చింది. టాలీవుడ్ టార్గెట్‌గా నమోదైన ఎక్సైజ్ కేసుల్లో సరైన ఆధారాలు సాక్ష్యాలు లేకపోవడంతో కోర్టు కేసులను కొట్టిపారేసింది. దీంతో కొన్నాళ్లగా తెలుగు స్టార్స్ కి ఓ తలనొప్పిగా ఉన్న.. ఈ సమస్య వదిలిపోయినట్లు అయ్యింది.