Fans Wars : సోషల్ మీడియాలో నెగిటివిటీ.. ఫ్యాన్ వార్స్ తో సినిమాని చంపేస్తున్న అభిమానులు..
ప్రస్తుతం బాక్సాఫీస్ రెస్పాన్స్ కంటే సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్‌తోనే సినిమా రిజల్ట్స్ డిసైడ్ అవుతున్నాయ్.

Fan Wars Social Media Negativity Kills Telugu Cinema
Fans Wars : అందరూ బాగుండాలని కోరుకోవడమే నిజమైన అభిమానం. ఇన్‌స్టాగ్రామ్ భాషలో చెప్పాలంటే టీఎఫ్‌ఐ బానిస అనే వాడు ఇండస్ట్రీ బాగుండాలని కోరుకోవాలి. కానీ వెర్రి అభిమానంతో కొందరు ఇండస్ట్రీ ఉసురు తీస్తున్నారు. అడ్డగోలు ట్రోలింగ్‌తో సినిమాను చంపేస్తున్నారు. దీంతో సోషల్‌మీడియాతో ఫిల్మ్ ఇండస్ట్రీ యుద్ధం చేయాల్సి వస్తోంది.
సోషల్‌మీడియా చెడ్డదేం కాదు.. అలాగని మంచిది కూడా కాదు. వివాదాలు ముదిరి విద్వేషం పెరిగి ఆలోచనలను తొక్కేసి లక్ష్యాలను వెనక్కి నెట్టేసి అన్నట్లుగా సోషల్‌మీడియా తీరు ఇప్పుడు కనిపిస్తుంది. చాలా మంది ఎప్పుడూ ఎవరో ఒకరి మీద విద్వేషంతో ఊగిపోతున్నారు. ముఖ్యంగా సినిమా హీరోల అభిమానుల విషయంలో మరీ ఎక్కువైంది. తమ హీరో సినిమా రిలీజైతే ఒకలా వేరొక హీరో సినిమా రిలీజైతే మరొకలా రెచ్చిపోతున్నారు. ఓ దరిద్రపు ట్రెండ్ స్టార్ట్ చేశారు. ఎలాగైనా వేరే హీరోల సినిమాలు ఫ్లాఫ్ చేయాలని కంకణం కట్టుకుని తిరుగుతున్నారు. ట్రోలింగ్ చేయడానికి, ఎదుటి వారిని కించపరచడానికి సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారు. గుంటూరు కారం నుంచి ఇప్పుడు గేమ్‌ఛేంజర్ వరకు అదే జరిగింది. సినిమాని తొక్కేయాలని కొందరు యాంటీ ఫ్యాన్స్ రచ్చ చేశారు. నెగిటివ్ రివ్యూలు ప్రచారం చేశారు. వీడియో లింక్‌లు ఇచ్చేశారు. నార్త్, ఓవర్సీస్‌లో థియేటర్లు ఖాళీగా ఉన్నాయంటూ ట్రోలింగ్ చేశారు.
గేమ్ ఛేంజర్ ఫస్ట్ డే కలెక్షన్ల పోస్టర్ మీద జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. దీంతో మళ్లీ గేమ్ ఛేంజర్ కలెక్షన్ పోస్టర్లను మూవీ యూనిట్ రిలీజ్ చేయలేదు. ఎవరు చేస్తున్నారో, ఎలా చేస్తున్నారో కానీ గేమ్‌ఛేంజర్ మొదటి నుంచి టార్గెట్‌గానే కనిపించింది. ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడే ఓ తప్పుడు వీడియోను వైరల్ చేశారు. థియేటర్‌లో హీరో ట్రైలర్ ఈవెంట్ కు అక్కడ జనాలు లేరని, మూలన కూర్చుని బాధపడుతున్నట్టుగా వీడియో ఒకటి షేర్ చేసి ట్రోలింగ్ చేశారు. నిజమా అబద్ధమా అని తెలుసుకోకుండా, చూసుకోకుండా వైరల్ చేసేశారు. ఇలాంటి నెగిటివ్ ట్రోలింగ్ మధ్య ఆ మూవీ వచ్చింది. రిలీజ్ తర్వాత కూడా అదే నెగిటివ్ ట్రెండ్ కంటిన్యూ అయింది.
Also Read : Naresh : మా అమ్మకు పద్మ అవార్డు ఇవ్వాలి.. సీనియర్ నటుడు నరేష్ కామెంట్స్..
ఈ పరిణామాలపై మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మాట్లాడిన మాటలు ఇప్పుడు ప్రతీ ఒక్కరిని కదలిస్తున్నాయ్. ట్రోలింగ్ సినిమాను చంపేస్తుందని ఆవేదన వ్యక్తం చేశాడు. నెగిటివ్ ట్రోల్స్ వల్ల తెలుగు సినిమా ఇండస్ట్రీ పరువు పోతుందని దయచేసి ఇది మానుకోవాలని సూచించాడు. తెలుగు సినిమా ట్రోలింగ్ చూస్తుంటే భయంగా ఉందని అదే సమయంలో సిగ్గుగా ఉందని తమన్ ఆవేదన వ్యక్తం చేయగా అతని మాటలు తనను కదిలించాయని చిరంజీవి ట్వీట్ చేశారు. విషయం సినిమా అయినా క్రికెట్ అయినా మరో సామాజిక సమస్య ఏదైనా సోషల్ మీడియా వాడుతున్న ప్రతి ఒక్కరు తమ మాటల తాలూకు ప్రభావం అవతలి వ్యక్తుల మీద ఎలా ఉంటుందో ఆలోచించుకోవాలని సూచించారు. మాటలు ఫ్రీనే అని ఐతే అవి ప్రేరేపించగలవని, ఆ మాటలే నాశనం చేయగలవని ఇందులో మీరు ఏమి చేయాలనుకుంటున్నారో ఎంచుకోండి అంటూ రాసుకొచ్చారు. దీంతో ఇప్పుడు ట్రోలింగ్ వ్యవహారం మళ్లీ తెరమీదకు వచ్చింది.
సోషల్‌మీడియా వాడకం పెరిగిపోయాక దిక్కుమాలిన దరిద్రాలన్నీ మొదలయ్యాయ్. ఏ హీరో సినిమా అయినా అందరి ఫ్యాన్స్ కలిసి ఎంజాయ్ చేసే వాళ్లు ఒకప్పుడు. అలాంటిది ఇప్పుడు తమ హీరోనే గొప్ప అని అర్థం లేని యుద్ధానికి దిగుతున్నారు. అక్కడితో ఆగుతున్నారా అంటే ఓవరాల్‌గా సినిమాను చంపేస్తున్నారు. ఇప్పుడు గేమ్ ఛేంజర్ అని మాత్రమే కాదు. గతంలో చాలా మంది హీరోల విషయంలో ఇదే జరిగింది. ఏం పాపం చేశా, ఎందుకిలా అంటూ కిరణ్ అబ్బవరంలాంటి వాళ్లు స్టేజీ మీదే ఎమోషనల్ అయ్యారు. మరికొందరు అయితే నెక్ట్స్ సినిమా ఒప్పుకునేందుకు కూడా ఆలోచిస్తున్నారు. హీరోల మనోధైర్యాన్ని ట్రోలింగ్ ఇంతలా దెబ్బతీస్తోంది. ఆ హీరో అంటూ వాడు ఈ హీరో అంటూ వీడు ఎవడికి వాడు హీరో పేరు చెప్పుకొని విలన్‌గా మారుతున్నాడు. సినిమా ప్రాణం తీస్తున్నారు. దీంతో ఈ ఫ్యాన్ వార్ నిర్మాతలకు ప్రాణసంకటంగా మారుతున్న పరిస్థితి. తమ అభిమాన హీరో కోసం ఫ్యాన్స్ మిగిలిన హీరోలపై విషం చిమ్ముతూ చేస్తున్న ప్రచారంతో కొన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడుతున్న పరిస్థితి. అసలే ఓటీటీ కాలం ప్రేక్షకుడిని థియేటర్‌కు తీసుకురావడమే గగనం అయింది. అలాంటిది ఈ నెగిటివ్ ట్రోలింగ్ థియేటర్‌కు వెళ్లాలన్న కోరికలను కూడా చంపేస్తోంది. ఇండస్ట్రీ మీద ఎఫెక్ట్ చూపిస్తోంది.
ఒకసారి ఒక హీరో సినిమాపై మరో హీరో అభిమానులు నెగెటివిటీ ప్రచారం చేస్తే ఆ హీరో వంతు వచ్చినప్పుడు తాము అదే చేస్తామని వార్నింగ్ ఇస్తున్నారు. సినిమా అలా రిలీజ్ అవగానే ఇలా నెగిటివ్ ట్రోలింగ్ స్టార్ట్ చేస్తున్నారు. వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. నెగిటివ్ రివ్యూలు ఇస్తున్నారు. ఇలా ఫ్యాన్ వార్‌తో టాలీవుడ్‌లో నాన్సెన్స్ ఎక్కువైపోయింది. తెలుగు సినిమా గురించి ప్రపంచం మాట్లాడుకుంటున్న సమయంలో మన పరువు మనమే తీసుకున్నట్లు అవుతోంది. తమన్ చెప్పింది అదే. అర్థం చేసుకోండని చిరు సూచించింది కూడా అదే. గేమ్ ఛేంజర్ మూవీ విషయంలోనే కాదు గతంలో చాలాసార్లు ఇలానే జరిగింది. ఈ టార్చర్ తట్టుకోలేక కొందరు దర్శకులు, హీరోలు పోలీస్‌స్టేషన్ మెట్లు కూడా ఎక్కారు.
Also See : ‘సంక్రాంతికి వస్తున్నాం’ స్పెషల్ ఇంటర్వ్యూ.. సుమ ఇంట్లో.. ఇక్కడ చూసేయండి..
థియేటర్‌కు ప్రేక్షకుడిని తీసుకురావడమే ఇబ్బందిగా మారుతున్న సమయంలో ఇండస్ట్రీని ఈ ట్రోలింగ్ మరింత దెబ్బతీస్తోంది. ఫ్యాన్ వార్ అనేది ఓవరాల్‌గా ఇండస్ట్రీకే సవాల్‌గా మారింది. పరిస్థితి ఇలానే కొనసాగితే సినిమా ఇండస్ట్రీ మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుంది. సోషల్‌మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌ను అభిమానం పేరుతో కొందరు అడ్డగోలుగా వాడేస్తున్నారు. తమ హీరోను హైలైట్ చేస్తూ ఇంకో హీరోను టార్గెట్ చేస్తున్నారు. ఫ్యాన్ వార్‌కు తెరతీస్తున్నారు. ఒకరకంగా కోలీవుడ్ కల్చర్‌ను టాలీవుడ్‌లోనూ తీసుకువస్తున్నారు. ఇది నిర్మాతలకు ఇబ్బందిగా మారుతోంది. తమన్ ఆవేదన కూడా అదే. ఇకపై సినిమా అవకాశాలు వస్తాయో రావో కూడా అర్థం కావడం లేదు అన్నాడంటే ట్రోలింగ్ మధ్య ఇండస్ట్రీ ఎంతలా నలిగిపోతుందో అర్థం చేసుకోవచ్చు.
ఓ స్టార్ హీరో సినిమాకు ఎంత పాటిజివిటీ కనిపిస్తుందో అంతే స్థాయిలో నెగెటివిటీ వస్తుంది. ఒక్కసారిగా యాంటీ ఫ్యాన్స్ అంతా కలిసి మూవీని ట్రోలింగ్ స్టార్ చేస్తే ఎలా ఉంటుంది అనడానికి గేమ్ ఛేంజర్ బెస్ట్ ఎగ్జాంపుల్. మొదటిరోజే HD ప్రింట్‌తో సినిమాను లీక్ చేసి పడేశారు. థియేటర్‌లోనే ట్రోలింగ్ వీడియోలు, రీల్ వీడియోలు చేస్తున్నారు. పని గట్టుకుని మరీ పాతాళంలోకి తొక్కేయాలని చూస్తున్నట్లు కనిపించింది. ఇప్పుడు గేమ్‌ఛేంజర్ మాత్రమే కాదు గతంలో చాలామంది హీరోలు ఈ ట్రోలింగ్ బారిన పడ్డారు. దేవర మూవీ మీద కూడా నెగిటివ్ ట్రెండ్ చేసారు. మహేష్ బాబు గుంటూరు కారం కూడా ట్రోలింగ్ బాధిత సినిమానే. కానీ చివరకు బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదనిపించుకుంది. విజయ్ దేవరకొండ ఫ్యామిలీస్టార్ అయితే ట్రోలింగ్‌లో కొట్టుకుపోయింది.
ప్రస్తుతం బాక్సాఫీస్ రెస్పాన్స్ కంటే సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్‌తోనే సినిమా రిజల్ట్స్ డిసైడ్ అవుతున్నాయ్. ఒక సినిమా రిలీజ్ చేస్తున్నారంటే ప్రమోషన్స్ ఎలా ఉండాలని ప్లాన్ చేసుకునే వాళ్లు ఇప్పటివరకు. ఇప్పుడు సీన్ మారిపోయింది. నెగిటివ్ ట్రెండ్‌ను ఎలా కంట్రోల్ చేయాలి, ట్రోలింగ్ ఎలా ఆపాలన్నది నిర్మాతలకు తలపోటుగా మారింది. ఇప్పుడున్న సోషల్ మీడియా కాలంలో నెగెటివిటీని దాటుకొని సినిమా నిలబడటం అంటే మామూలు విషయం కాదు. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే ఈ ట్రోలింగ్‌ను దాటుకుని సినిమాను నిలబెట్టుకోవాల్సి ఉంటుంది.
Also Read : DVV Danayya : త్వరలోనే OG రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తాం.. తిరుమలలో పవన్ OG నిర్మాత..
తమ ఇష్టమైన హీరోను మరీ ప్రేమించే ఫ్యాన్స్ మిగిలిన హీరోలపై అసహ్యం కలిగించే కామెంట్స్ చేస్తున్నారు. దీంతో జనరల్ ఆడియన్స్ ఇన్‌ఫ్లూయెన్స్ అవుతున్నారు. అంతే కాదు ఆ సినిమాలు చూడ్డానికి కూడా ముందుకు రావడం లేదు. ఇది ఓవరాల్‌గా సినిమా కలెక్షన్లు, రిజల్ట్ మీద ఎఫెక్ట్ చూపిస్తోంది. ఫ్యాన్ వార్ కంట్రోల్‌లో ఉండాలంటే హీరోలు బాధ్యత తీసుకోవాలనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. ఒకరి సినిమా ఈవెంట్లకు, ప్రోగ్రామ్‌లకు మరొక హీరో రావడం, ఇలా తామంతా ఒకటే అనే విషయాన్ని హీరోలు ప్రేక్షకుల్లోకి తరుచూ తీసుకెళ్తే ఫ్యాన్స్ మధ్య విభేదాలు తగ్గే అవకాశాలు ఉంటాయని, ఫ్యాన్ వార్‌కు బ్రేక్ పడుతుందని, దీంతో నెగిటివ్ ట్రోలింగ్ కూడా కంట్రోల్ అవుతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్.
ట్రోలింగ్ అనేది విషసంస్కృతి. అంతకంతకు పెరుగుతుందే తప్ప తగ్గే అవకాశం ఉండదు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. అందరూ బాగుండాలని కోరుకోవడమే నిజమైన అభిమానం. అది వదిలేసి అర్థం లేని ట్రోలింగ్ స్టార్ట్ చేయడం ఏ మాత్రం కరెక్ట్ కాదు. హీరోను టార్గెట్ చేస్తున్నాం అనుకొని సినిమా ఇండస్ట్రీకి పొగ పెడుతున్న పరిస్థితి. ప్రపంచం అంతా తెలుగు సినిమా వైపు చూస్తున్న వేళ ఇది కరెక్ట్ కాదు. TFI బానిసలం అని సోషల్‌మీడియాలో గర్వంగా చెప్పుకునే ప్రతీ ప్రేక్షకుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఇదే.