మోడీకి బహిరంగ లేఖ : సెలబ్రెటీలపై దేశద్రోహం కేసు నమోదు

బిజెపి మరో వివాదానికి పరోక్షంగా తెర తీసింది. సామూహిక దాడులను అరికట్టాలంటూ ప్రధాని మోదీకి బహిరంగ లేఖ రాసినందుకు 49మంది సెలబ్రెటీలపై బీహార్ లోని ముజఫర్ లో దేశద్రోహం కేసు నమోదు అయింది. రామ్ చంద్ర గుహా, మణిరత్నం, అపర్ణ సేన్లతో సహా ప్రముఖులపై అక్టోబర్ 3వ తేదీ గురువారం FIR నమోదైంది. దేశం ప్రతిష్ట, వేర్పాటువాద ధోరణులకు మద్దతు ఇవ్వడంపై కేసు బుక్ చేసినట్లు సమాచారం.
స్థానిక న్యాయవాది సుధీర్ కుమార్ ఒజా దాఖలు చేసిన పిటిషన్ పై రెండు నెలల క్రితం విచారించిన చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ సూర్యకాంత్ తివారీ ఉత్తర్వుల మేరకు ఈ కేసు నమోదైంది. పిటిషన్ లో దాదాపు 50 మందిని నిందితులుగా చేర్చారు. భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగిందని, దేశ ద్రోహం, మతపరమైన భావాలను దెబ్బతీయడం, శాంతిని ఉల్లంఘించే ఉద్దేశాలు ఉన్నట్టు భావిస్తూ కేసు నమోదైంది.
దేశంలో అసహనం, మూక దాడులను నిర్మూలించాలని కోరుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి 49 మంది సెలబ్రెటీలు లేఖ రాశారు. ప్రముఖ సింగర్ శుభా ముద్గల్, నటి కొంకణా సేన్ శర్మ, దర్శకుడు శ్యామ్ బెనగల్, మణిరత్నం, క్రీడా రంగానికి చెందిన అనురాగ్ కశ్యప్ తదితరులున్నారు. జులై 23న దేశంలో జరిగిన మూక దాడులను నివారిస్తూ..వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, కులం పేరిట దళితులు, ముస్లింలపై దాడులు జరుగుతున్నాయని ప్రస్తావించారు.
జై శ్రీరామ్ అంటూ దాడులకు పాల్పడడం బాధాకరమని, దేశ వ్యాప్తంగా జరుగుతున్న దాడుల్లో జై శ్రీరామ్ పేరు ప్రస్తావించడం దురదృష్టకరమని వారు లేఖలో వెల్లడించారు. వీరికి కౌంటర్‌గా కంగనా రనౌత్, మాధుర్ బండార్కర్ వంటి వారు మోదీకి సపోర్ట్‌గా మరో లేఖ రాశారు. పిటిషన్ దాఖలు చేసిన లాయర్ సుధీర్ ఓజా బిజెపి అనుకూలుడు అనే ప్రచారం జరగుతోంది. అప్పటి ఈ వ్యవహారంపై ఇప్పుడు కేసులు నమోదు కావడం వివాదానికి దారి తీస్తోంది.