Kingston : ‘కింగ్‌స్టన్’ మూవీ రివ్యూ.. సముద్రంలో హారర్ తో భయపెట్టారుగా..
జీవి ప్రకాష్ ఇది ఒక సీ హారర్ సినిమా, ఫాంటసీ సినిమా అని ప్రమోట్ చేసాడు.

GV Prakash Kumar Divyabharathi Kingston Movie Review and Rating
Kingston Movie Review : తమిళ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్, నటుడు జీవి ప్రకాష్ హీరోగా తెరకెక్కిన సినిమా ‘కింగ్‌స్టన్’. ఈ సినిమాలో దివ్యభారతి హీరోయిన్ గా నటించగా చేతన్ కాదంబి, అజగన్ పెరుమాళ్, సాబుమాన్ అబ్దుసమద్, ఎలాంగో కుమారవేల్.. పలువురు ముఖ్య పాత్రలు పోషించారు. పేర్లల్ యూనివర్స్ పిక్చర్స్ బ్యానర్ పై GV ప్రకాష్ సొంత నిర్మాణంలో కమల్ ప్రకాష్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. తమిళ్ లో తెరకెక్కిన కింగ్ స్టన్ సినిమా డబ్బింగ్ తో తెలుగులో కూడా నేడు మార్చ్ 7న రిలీజయింది.
కథ విషయానికొస్తే.. 1982లో సముద్ర తీరంలోని ఓ గ్రామంలో బోసయ్య(అజగన్ పెరుమాళ్) అనే వ్యక్తిని ఊరంతా కలిసి చంపేసి పాతి పెడతారు. అది ఆత్మ అయి గ్రామస్థులను భయపెడుతుండటంతో ఆ శవాన్ని సముద్రంలో పడేస్తారు. సముద్రంలోకి ఎవరు వెళ్లినా శవాలుగా తిరిగొస్తుండటంతో ఆ ప్రాంతంలో చేపల వేటకు వెళ్ళొద్దని, ఆ ఊరి సముద్రానికి కంచె వేస్తారు. ఆ ఊరి వాళ్లకు పని పోవడంతో అక్కడ నుంచి వెళ్లి మరో సముద్రం ఉన్న సిటీలో సెటిల్ అయిన థామస్ అనే రౌడీ వాళ్లకు పని ఇస్తాడు. ప్రస్తుతం 2025లో కింగ్ స్టన్(జీవి ప్రకాష్ కుమార్) థామస్(సాబుమాన్ అబ్దుసమద్) వద్దే డబ్బు కోసం పని చేస్తుంటాడు. థామస్ చెప్పినట్టు సముద్రంలోకి వెళ్లి శ్రీలంక బోర్డర్ లో అక్రమంగా ఏదో తరలిస్తూ ఉంటారు కింగ్ స్టన్ అతని స్నేహితులు. ఓ రోజు సముద్రంలో నేవీ అధికారులు వాళ్లపై అటాక్ చేయడంతో ఒక పిల్లాడు చనిపోతాడు. దీంతో థామస్ వాళ్ళతో డ్రగ్స్ సరఫరా చేయిస్తున్నాడని తెలిసి కింగ్ స్టన్ అతనికి ఎదురు తిరిగి తన ఊరి వాళ్ళు ఎవరూ కూడా ఇక అతని దగ్గరికి పనికి రారు అని చెప్తాడు.
ఊర్లో మూసేసిన సముద్రంలోకి వేటకు వెళ్లి చేపలు పట్టుకొస్తే ఊరి వాళ్ళు ఆత్మలు, దయ్యాలు లేవని నమ్ముతారని కింగ్ స్టన్ అతని స్నేహితులు థామస్ ని కూడా తీసుకొని మూసేసిన సముద్రంలోకి వెళ్తారు. కింగ్ స్టన్ గర్ల్ ఫ్రెండ్ రోజ్(దివ్య భారతి)కూడా వాళ్ళ షిప్ లో వెళ్తుంది. మరి వాళ్ళు సముద్రంలోకి వెళ్ళాక ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేసారు? అక్కడ దయ్యాలు, ఆత్మలు ఉన్నాయా? వీళ్లంతా తిరిగి వచ్చారా? అసలు సముద్రంలోకి వెళ్లిన వాళ్లంతా ఎందుకు చనిపోతున్నారు? బోసయ్యని ఎందుకు చంపారు? సముద్రంలో బోసయ్య ఆత్మ ఉందా? థామస్ కి ఆ ఊరికి సంబంధం ఏంటి తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
Also Read : Madraskaaran : ‘మద్రాస్ కారన్’ మూవీ రివ్యూ.. నిహారిక తమిళ సినిమా ఎలా ఉందంటే..
సినిమా విశ్లేషణ.. ఫస్ట్ హాఫ్ లో 1982లో జరిగింది కాస్త కథ చూపించి ప్రస్తుతంలో హీరో పాత్ర, ఆ ఊరి వాళ్ళ కష్టాలు, హీరో పని చూపిస్తారు. థామస్ ని ఎదిరించి హీరో సముద్రంలోకి వెళ్లడంతో సెకండ్ హాఫ్ దయ్యాలను చూపిస్తాడా, సముద్రంలో ఏం జరుగుతుంది అనే ఆసక్తి నెలకొంటుంది. ఇక సెకండ్ హాఫ్ అంతా సముద్రం మీదే సాగుతుంది. సముద్రంలో ఓ బోటులో వీళ్లంతా చేసే అడ్వెంచర్స్, అక్కడ దయ్యాలు, ఆత్మలు, అసలు సముద్రంలో ఏముంది అని హారర్ థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ తో సాగుతుంది.
ప్రమోషన్స్ లో జీవి ప్రకాష్ ఇది ఒక సీ హారర్ సినిమా అని, ఫాంటసీ సినిమా అని ప్రమోట్ చేసాడు. దీంతో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. అయితే అదంతా కేవలం సెకండ్ హాఫ్ లోనే. ఫస్ట్ హాఫ్ అంతా తమిళ్ నేటిటివిటిలో ఉండే ఓ మత్స్యకారుల గ్రామం బ్యాక్ డ్రాప్ లోనే చూపిస్తారు. ఫస్ట్ హాఫ్ బోర్ కొడుతుంది. ఫస్ట్ హాఫ్ లో ఏదో ఒకటి రెండు సార్లు భయపెట్టినా సెకండ్ హాఫ్ లో మాత్రం బాగానే భయపెట్టారు. సముద్రంలో సీన్స్ అయితే అదిరిపోయాయి. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే సీన్స్ కూడా ఆసక్తికరంగా అంటాయి. క్లైమాక్స్ లో ఇచ్చే కొన్ని ట్విస్టులు బాగానే వర్కౌట్ అయ్యాయి. అయితే తమిళ పాత్రలు, తమిళ్ పేర్లు, కథ ముందుకి వెనక్కి వెళ్లడంతో అక్కడక్కడా కాస్త కన్ఫ్యూజ్ ఉంటుంది. ఈ సినిమాకు ఫ్రాంచైజ్ లాగా సీక్వెల్స్ తీస్తాను అన్నాడు జీవి ప్రకాష్. మరి తీస్తాడో లేదో ఫ్యూచర్ లో చూడాలి. జీవి చెప్పినట్టు ఆ ఫాంటసీ వరల్డ్, హారర్ ఇంకా ఎక్కువ సేపు ఉంటే బాగుండేది అనిపిస్తుంది. ఇది జీవి ప్రకాష్ కి నటుడిగా 25వ సినిమా కావడం గమనార్హం.
నటీనటుల పర్ఫార్మెన్స్.. జీవి ప్రకాష్ కుమార్ ఓ పక్క సంగీత దర్శకుడిగా సూపర్ హిట్స్ ఇస్తూనే మరో పక్క హీరోగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తమిళ్ విలేజ్ కుర్రాడిగా మాస్ పాత్రలో బాగానే నటించాడు. బ్యాచిలర్ సినిమాలో తన అందాలతో వైరల్ అయిన దివ్యభారతి ఈ సినిమాలో విలేజ్ అమ్మాయి పాత్రలో మెప్పించింది. చేతన్ కాదంబి రెండు షేడ్స్ లో బాగా నటించాడు. బోసయ్య పాత్రలో అజగన్ పెరుమాళ్ మెప్పిస్తాడు. ఎలాంగో కుమారవేల్, థామస్ గా సాబుమాన్ అబ్దుసమద్ పర్వాలేదనిపించారు. కింగ్ స్టన్ స్నేహితుల పాత్రల్లో చేసిన నటులు, మిగిలిన నటీనటులు అంతా వారి పాత్రల్లో మెప్పించారు.
Also See : పెళ్లి వేడుకలో జూనియర్ ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల సందడి.. చూశారా..?
సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ మాత్రం బాగున్నాయి. సముద్రంలోని గ్రాఫిక్స్ సీన్స్ అన్ని మెప్పిస్తాయి. జీవి ప్రకాశే ఈ సినిమాకు సంగీతం కూడా ఇచ్చాడు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో భయపెట్టినా పాటలు మాత్రం తెలుగు డబ్బింగ్ లో వర్కౌట్ అవ్వలేదు. దయ్యాలు సెటప్ కి మేకప్ టీమ్ కూడా బాగానే పనిచేసింది. రెగ్యులర్ పాయింట్ అయినా కొత్తగా సముద్రంలో చెప్పాలనే ఆసక్తికర కథనంతో డైరెక్టర్ బాగానే రాసుకున్నాడు. దర్శకుడిగా మాత్రం టేకింగ్ బాగా తీసాడు. ఇక నిర్మాతగా కూడా జీవి ప్రకాష్ ఈ సినిమాకు బాగానే ఖర్చు పెట్టాడని తెలుస్తుంది.
మొత్తంగా ‘కింగ్‌స్టన్’ మూవీ తమ ఊరిని భయపెడుతున్న ఆత్మలు, దయ్యాలు సంగతేంటో చూద్దామని సముద్రంలోకి వెళ్లిన హీరో అతను చేసే అడ్వెంచర్స్ తో సాగే హారర్ థ్రిల్లర్. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.