‘మహర్షి’ బాదుడు : తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన సినిమా టికెట్ల ధరలు

సినిమా థియేటర్లలో టికెట్ల ధరలను పెంచుతూ సినిమా థియేటర్ యాజమాన్యాల సంఘం నిర్ణయించింది. మహేష్ బాబు నటించిన మహర్షి మూవీ విడుదల నేపథ్యంలో యాజమాన్యాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.80 నుంచి రూ.110, మల్టీ ఫ్లెక్స్ ల్లో ఒక్కో టికెట్ పై రూ.50 పెంచాయి. ప్రసాద్ ఐమాక్స్ లో 138 రూపాయులున్న టికెట్ ధరను 200 రూపాయలకు పెంచింది యాజమాన్యం.
పెరిగిన టికెట్ల ధరలు రెండు వారాలపాటు అమలులో ఉంటాయని థియేటర్ యాజమాన్యాలు స్పష్టం చేశాయి. ప్రభుత్వం అనుమతి తీసుకున్న తర్వాతే టికెట్ల ధరలు పెంచామని యాజమాన్యాలు అంటున్నాయి. అదనపు షోలకు కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని చెబుతున్నాయి. మే 9న నుంచి మే 22 వరకు 14 రోజులపాటు షోలను ఏర్పాటు చేసుకోవచ్చు.
తెలంగాణలో మహర్షి సినిమా ఐదు షోలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈమేరకు జీవో కూడా విడుదల అయింది. మే 9న ప్రపంచ వ్యాప్తంగా మహర్షి సినిమా విడుదల కానుంది. వంశి పైడిపల్లి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో హీరోయిన్ పూజాహెగ్డే. అల్లరి నరేష్ కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీంతం అందించారు.