Kamal Haasan : చైల్డ్ ఆర్టిస్ట్‌గా మొదటి సినిమాకే రాష్ట్రపతి అవార్డు.. లోకనాయకుడు బర్త్‌డే స్పెషల్ స్టోరీ..

నేడు నవంబర్ 7 లోకనాయకుడు కమల్ హాసన్ పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ స్టోరీ.

Kamal Haasan : చైల్డ్ ఆర్టిస్ట్‌గా మొదటి సినిమాకే రాష్ట్రపతి అవార్డు.. లోకనాయకుడు బర్త్‌డే స్పెషల్ స్టోరీ..

Indian 2 Thug Life hero Kamal Haasan birthday special story

Updated On : November 6, 2023 / 8:14 PM IST

Kamal Haasan : లోకనాయకుడు కమల్ హాసన్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన యాక్టింగ్ కి భాషతో అవసరం లేదు. మాటలు లేకున్నా హావభావాలతోనే ప్రేక్షకుడి మనసుని కదిలించే నటన కమల్ సొంతం. ఆరేళ్ళ వయసులో ఎంట్రీ ఇచ్చిన ఈ నటుడు.. మొదటి సినిమాకే రాష్ట్రపతి అవార్డుని అందుకున్నారు. అలా మొదలైన కమల్ సినీ ప్రయాణం.. ఎవరూ చేయలేని పాత్రలు, ఎవరూ చేయలేని సాహసాలు, ఎవరూ అందుకోలేని అవార్డులు అందుకొని లోకనాయకుడిగా పిలిపించుకున్నారు. నేడు నవంబర్ 7 ఆయన పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ స్టోరీ.

చైల్డ్ ఆర్టిస్ట్‌గా ప్రయాణం..
1960లో జెమినీ గణేశన్, మహానటి సావిత్రి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘కలతూర్ కన్నమ్మ’ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటిస్తూ కమల్ హాసన్.. తన సినీ కెరీర్ ని స్టార్ట్ చేశారు. ఈ మూవీ సమయానికి కమల్ కి ఆరేళ్ళు వయసు మాత్రమే. ఇక ఈ సినిమాలో తన నటనతో రాష్ట్రపతినే మెప్పించారు. మొదటి సినిమాకే ఆరేళ్ళ వయసులో రాష్ట్రపతి చేతులు మీదుగా ప్రెసిడెంట్ అవార్డు అందుకున్నారు. ఆ తరువాత మరికొన్ని సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు.

డాన్స్ కొరియోగ్రాఫర్‌గా ప్రయాణం..
1963 వరకు చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన కమల్ హాసన్.. ఆ తరువాత చదువు కోసం ఒక ఏడేళ్లు సినిమా నుంచి గ్యాప్ తీసుకున్నారు. 1970 నుంచి మళ్ళీ సినీ రంగంలో ప్రయాణం మొదలు పెట్టారు. అయితే ఈసారి నటుడిగా కాకుండా అసిస్టెంట్ డాన్స్ కొరియోగ్రాఫర్ గా పలు సినిమాల్లో పని చేశారు. ఈ సమయంలోనే పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో అలా కనిపించి స్క్రీన్ పై మెరిశారు.

మలయాళ ఫిలిం ఫేర్..
1973 నుంచి ‘అరంగేట్రం’ అనే తమిళ సినిమాతో నటుడిగా ప్రయాణం మొదలుపెట్టిన కమల్ హాసన్.. సపోర్టింగ్ రోల్స్ చేస్తూ వచ్చారు. 1974లో మలయాళ మూవీ ‘కన్యాకుమారి’తో హీరోగా కెరీర్ స్టార్ట్ చేశారు. ఇక హీరోగా చేసిన ఈ మొదటి సినిమాకే.. మలయాళంలో బెస్ట్ యాక్టర్ గా ఫిలిం ఫేర్ అవార్డుని అందుకున్నారు.

తమిళంలో గుర్తింపు తెచ్చిన సినిమా..
మలయాళ మూవీ తరువాత హీరోగా తమిళంలో కూడా సినిమాలు చేస్తూ వచ్చారు. పలు సినిమాల్లో నటించినా రాణి గుర్తింపు.. 1975లో బాలచందర్ దర్శకత్వంలో నటించిన ‘అపూర్వ రాగంగాళ్’ సినిమా నటిస్తే వచ్చింది. ఈ సినిమాతో తమిళంలో కూడా మంచి ఫేమ్ సంపాదించుకున్నారు. ఈ సినిమాకి కమల్ ఫిలిం ఫేర్ అవార్డుని అందుకున్నారు. ఇక్కడ విశేషం ఏంటంటే.. ఈ సినిమాలో రజినీకాంత్ ఒక ముఖ్య పాత్ర చేశారు.

తెలుగు, హిందీ మరో చరిత్ర..
ఇక అక్కడి నుంచి తమిళ్, మలయా సినిమాల్లో నటిస్తూ వచ్చిన కమల్ హాసన్.. ‘కబితా’ సినిమాతో బెంగాలీలో, ‘కోకిల’ సినిమాతో కన్నడలో ఎంట్రీ ఇచ్చారు. తెలుగు, హిందీలో ఒకటి రెండు సినిమాల్లో అలా మెరిసి మెప్పించారు. అయితే పూర్తి సినిమాతో డెబ్యూట్ ఇచ్చిందంటే ‘మరో చరిత్ర’ సినిమాతోనే. 1978లో తెలుగులో బాలచందర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా క్లాసిక్ గా నిలిచింది. ఇదే సినిమాని హిందీలో రీమేక్ చేస్తూ 1981లో కమల్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు.

కమల్, విశ్వనాథ్ సంగమం..
కమల్ హాసన్, బాలచందర్ కాంబినేషన్ ఆడియన్స్ ని ఎంతలా మెప్పించిందో.. కమల్, కె విశ్వనాథ్ కాంబినేషన్ కూడా అంతే ప్రజాధారణ పొందింది. సాగర సంగమం, స్వాతి ముత్యం, శుభ సంకల్పం.. మూడు చిత్రాలు మూడు కావ్యాలులా ఉంటాయి. వీటిలో సాగర సంగమం, స్వాతి ముత్యం రెండు సినిమాలకు తెలుగులో నంది అవార్డు, ఫిలిం ఫేర్ అవార్డుని అందుకున్నారు. తెలుగులో మొదటిసారి ‘ఆకలి రాజ్యం’ (1981) చిత్రానికి ఫిలిం ఫేర్ అవార్డుని అందుకున్నారు.

లోకనాయుడు దశావతారం..
ఇలా భాషతో సంబంధం లేకుండా ప్రతి పరిశ్రమలో ప్రతిష్టాత్మకమైన అవార్డులు సొంతం చేసుకున్న లోకనాయకుడు కమల్ హాసన్. నటుడు గానే కాదు రైటర్‌గా, డైరెక్టర్‌గా, సింగర్‌గా, డాన్సర్‌గా, టెలివిజన్ ప్రెజెంటర్‌గా, సామాజిక కార్యకర్తగా, పొలిటిషన్‌గా.. ఇలా సినీ రాజకీయ రంగంలో తనదైన ముద్ర వేసి దశావతార మూర్తి అనిపించుకున్నారు. ఈ ఏడాదితో 69 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న కమల్ హాసన్.. ఇప్పటికీ కూడా నటుడిగా మూడు సినిమాల్లో నటిస్తూ, నిర్మాతగా కూడా మూడు చిత్రాలు నిర్మిస్తూ దూసుకు పోతున్నారు.