Darshan : జైలులో వెన్ను నొప్పితో హీరో బాధలు.. ఆత్మ వెంటాడుతుంది జైలు మార్చండి అంటూ రిక్వెస్ట్..?
తాజా సమాచారం ప్రకారం హీరో దర్శన్ తీవ్ర వెన్ను నొప్పితో బాధపడుతున్నట్టు తెలుస్తుంది.

Kannada Hero Darshan Effected with Back Pain in Jail
Darshan : కొన్ని నెలల క్రితం కన్నడ స్టార్ హీరో దర్శన్ తన అభిమాని రేణుకస్వామి అనే వ్యక్తిని హత్య చేయించిన కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. దర్శన్ తో పాటు నటి పవిత్ర గౌడ, ఈ కేసుకు సంబంధం ఉన్న మరో 17 మందిని అరెస్ట్ చేయగా ఇటీవల ముగ్గురికి బెయిల్ ఇచ్చారు. ఈ కేసులో దర్శన్, పవిత్ర కూడా బెయిల్ ప్రయత్నిస్తున్నా రావట్లేదు.
అయితే తాజా సమాచారం ప్రకారం హీరో దర్శన్ తీవ్ర వెన్ను నొప్పితో బాధపడుతున్నట్టు తెలుస్తుంది. ట్యాబ్లేట్స్ వాడుతున్నా కూడా దర్శన్ తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడుతున్నాడట. అయితే దర్శన్ ని పరిశీలించిన వైద్యులు శస్త్ర చికిత్స చేయాలని చెప్పగా పోలీసులు బళ్లారిలోనే చేయించుకోడానికి అనుమతి ఇచ్చినా దర్శన్ బెంగుళూరులోనే చేయించుకుంటాను అని చెప్పినట్టు సమాచారం.
అలాగే ప్రస్తుతం దర్శన్ బళ్లారి జైలులో ఉండగా రాత్రి పూట రేణుకస్వామి ఆత్మ వచ్చి తనని భయపెడుతుందని దయచేసి బెంగుళూరుకు తరలించండి అని పోలీసులను రిక్వెస్ట్ చేసినట్టు, అర్ధరాత్రి పూట దర్శన్ అరుస్తున్నాడని తోటి ఖైదీలు కూడా చెప్పినట్టు కన్నడ మీడియాలో ప్రచారం సాగుతుంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దీంతో హీరో దర్శన్ తీరు ప్రస్తుతం కన్నడ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది.