Dheera Movie Review : ‘ధీర’ మూవీ రివ్యూ.. పాపని కాపాడటం కోసం..

ధీర సినిమా ఓ ఫుల్ లెంగ్త్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్.

Dheera Movie Review : ‘ధీర’ మూవీ రివ్యూ.. పాపని కాపాడటం కోసం..

Laksh Chadalavada Dheera Movie Review and Rating

Dheera Movie Review : సీనియర్ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు తనయుడు, యువ హీరో లక్ష్ చదలవాడ (Laksh Chadalavada) ఆల్రెడీ వలయం, గ్యాంగ్‌స్టర్ గంగరాజు.. లాంటి సినిమాలతో మెప్పించి నేడు ‘ధీర’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. విక్రాంత్ శ్రీనివాస్ దర్శకత్వంలో చదలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర బ్యానర్‌ మీద పద్మావతి చదలవాడ నిర్మాణంలో తెరకెక్కిన ధీర సినిమా నేడు ఫిబ్రవరి 2న థియేటర్స్ లో రిలీజయింది.

కథ విషయానికొస్తే.. రణధీర్(లక్ష్) డబ్బుకోసం ఏ పని అయినా చేస్తూ ఉంటాడు. దీంతో వైజాగ్ నుంచి హైదరాబాద్ లో అంబులెన్స్ లో ఒక కోమా పేషంట్ ని తీసుకెళ్లాలి అనే డీల్ వస్తుంది. 25 లక్షలు ఇస్తారు అని తెలియడంతో ఓకే చెప్తాడు. అనుకోకుండా ఆ అంబులెన్స్ లో డాక్టర్ గా తన మాజీ ప్రేయసి అమృత(నేహా పఠాన్) వస్తుంది. వైజాగ్ నుంచి అంబులెన్స్ లో ఆ పేషంట్ ని తీసుకెళ్తుండగా చాలా మంది రణధీర్ ని వెంబడించి ఆ పేషంట్ ని చంపాలని చూస్తారు. కానీ రణధీర్ వాళ్ళ నుంచి తప్పించుకొని హైదరాబాద్ హాస్పిటల్ కి పేషంట్ ని చేరుస్తాడు. ఆ తర్వాత అదే వాహనంలో తిరిగి వెళ్తుండగా ఓ తల్లిపాప ఆ అంబులెన్స్ లో కూర్చుంటారు. తన పాపని కాపాడమని రణధీర్ ని కోరుతుంది ఆ తల్లి. రణధీర్ పై మళ్ళీ అటాక్ జరగ్గా ఆ తల్లి రణధీర్ ని కాపాడి చనిపోతుంది. అసలు ఆ పేషంట్ ఎవరు? ఆ తల్లి ఎవరు? జస్ట్ పేషంట్ ని సేఫ్ గా చేరిస్తే 25 లక్షలు ఎందుకు ఇస్తున్నారు? ఆ పేషంట్ కోసం అంతమంది ఎందుకు వెనక పడుతున్నారు? రణధీర్ ప్రేమ కథేంటి ? ఆ పాప ఎవరు? అనేది తెరపై చూడాల్సిందే.

సినిమా విశ్లేషణ.. మొదటి హాఫ్ హీరో డీల్ ఒప్పుకోవడం, అంబులెన్స్ పై దాడులు, కొన్ని యాక్షన్ సీన్స్, హీరో ప్రేమకథతో సాగుతుంది. సెకండ్ హాఫ్ లో ఆ పాపని కాపాడటం, ఫుల్ యాక్షన్ సీన్స్ తో సాగుతుంది. ఈ రేంజ్ యాక్షన్ సినిమాలో అక్కడక్కడా కామెడీ కూడా వర్కౌట్ చేశారు. హీరో హీరోయిన్స్ రొమాంటిక్ సీన్స్ కూడా బానే ఉన్నాయి. అయితే సినిమా ఓపెనింగ్ నుంచి హీరో క్యారెక్టర్ డబ్బు కోసం ఏదైనా చేస్తాడని చూపించి తర్వాత 2500 కోట్లను వదిలేసి పాపని కాపాడటానికి వెళ్లడం కొంచెం కన్విన్సింగ్ గా ఉండదు. సెకండ్ హాఫ్ లో కొన్ని టిస్టులు ఆశ్చర్యపరుస్తాయి. ఈ కథకి రాజకీయకోణాన్ని కూడా జోడించాడు దర్శకుడు.

Also Read : ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ రివ్యూ.. బ్యాండ్ మేళం సౌండ్ గట్టిగానే వినిపిస్తుంది..

నటీనటులు.. లక్ష్ చదలవాడ డబ్బు కోసం ఏమైనా చేసే పాత్రలో, ముఖ్యంగా యాక్షన్ సీన్స్ లో అదరగొట్టాడని చెప్పొచ్చు. నేహా పఠాన్ డాక్టర పాత్రలో ఎమోషనల్ సీన్స్ లో మెప్పించింది. ఇంకో హీరోయిన్ సోనియా బన్సల్ తన అందాలతో మెప్పిస్తుంది. సీఎం పాత్రలో సుమన్, హిమజ, సామ్రాట్ రెడ్డి.. మిగిలిన పాత్రలు పర్వాలేదనిపించాయి.

సాంకేతిక అంశాలు.. యాక్షన్ సీక్వెన్స్ లకు మంచి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు సాయి కార్తీక్. పాటలు పర్వాలేదనిపిస్తాయి. నైట్ టైం జరిగే సీన్స్ లో, యాక్షన్ సీన్స్ లో కెమెరా విజువల్స్ సరికొత్త లైటింగ్స్ తో ఆకట్టుకుంటాయి. ఎడిటింగ్ కూడా పర్ఫెక్ట్ గా ఉంటుంది. దర్శకుడు కొత్తవాడైనా ఈ రేంజ్ యాక్షన్ సినిమాని పర్వాలేదనిపించాడు. సొంత నిర్మాణ సంస్థ కావడంతో నిర్మాణ విలువలు కూడా బాగానే ఖర్చుపెట్టారు.

మొత్తంగా ధీర సినిమా ఓ ఫుల్ లెంగ్త్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్. యాక్షన్ సినిమాలు చూసేవారు ధీరని థియేటర్లో చూడొచ్చు.ఈ సినిమాకు 2.5 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.