“వెన్నుపోటు” @ ఎన్టీఆర్ నైట్ : లక్ష్మీస్ ఎన్టీఆర్ ఆడియో రిలీజ్

హైదరాబాద్: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో మార్చి 22న విడుదల కాబోతున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ కడపలో జరుగనున్నట్టు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రకటించారు. ఇప్పటికే విభిన్నంగా సినిమా ప్రచారం చేసుకుంటూ తనదైన స్టైల్ లో సినిమా పై ఆసక్తిని రేపుతున్న వర్మ ఆడియో రిలీజ్ ఫంక్షన్ కూడా అదే స్థాయిలో చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు.
“లక్ష్మీస్ ఎన్టీఆర్ ఆడియో రిలీజు ఈవెంట్ కడప లో ఒక గొప్ప బహిరంగ సభలో చెయ్యబడుతుంది…..ఈవెంట్ పేరు….“వెన్నుపోటు” అలియాస్ ఎన్టీఆర్ నైట్…ఈవెంట్ డేట్ త్వరలో .. జై ఎన్టీఆర్ అని వర్మ శనివారం ట్విట్టర్ లో తెలిపారు.
ఈ సినిమాలో చంద్రబాబు నాయుడుని టార్గెట్ చేస్తూ….. మామ ఎన్టీఆర్ ని వెన్నుపోటు పొడిచి ఆయన మానసిక క్షోభకు కారణం అయ్యారని, వాస్తవ ప్రపంచానికి తెలియని విషయాలను సినిమాలో చూపించబోతున్నానని ప్రకటించి సినిమాపై అంచనాలను పెంచేశారు ఆర్జీవీ. మరోవైపు లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను అడ్డుకునేందుకు టీడీపీ వర్గాలు అన్నిరకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి.
త్వరలో జరగబోయే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఈసినిమా ప్రభావం టీడీపీ పై ఉంటుందనే భయంతో, సినిమా విడుదల ఆపేయాలని టీడీపీ వర్గాలు ఎలక్షన్ కమీషన్ కు కూడా ఫిర్యాదు చేశాయి. అయితే సినిమాను ఆపలేమని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ ఇప్పటికే ప్రకటించారు.