లక్ష్మీ’స్ ఎన్టీఆర్ సినిమా విడుదలకు బ్రేకులు

  • Published By: vamsi ,Published On : March 17, 2019 / 08:55 AM IST
లక్ష్మీ’స్ ఎన్టీఆర్ సినిమా విడుదలకు బ్రేకులు

Updated On : March 17, 2019 / 8:55 AM IST

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన సినిమా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విడుదల వాయిదా పడింది. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదలకు సెన్సార్ బోర్డు పర్మిషన్ ఇవ్వలేదు. ఏప్రిల్ 11వ తేదీన తొలి దశ ఎన్నికలు పూర్తయ్యే వరకు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వలేమంటూ సెన్సార్ బోర్డ్ చెప్పేసింది. అయితే, సెన్సార్ బోర్డు తీసుకున్న నిర్ణయం అక్రమం అంటూ వర్మ వాదిస్తున్నారు. సెన్సార్డ్ బోర్డుపై కోర్టుకు వెళ్తామంటూ.. ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టారు. సినిమా చూడకుండా ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకుంటారంటూ ప్రశ్నించారు. సినిమా చూడకుండా దానికి సర్టిఫికెట్ ఇవ్వకపోవడాన్ని వర్మ ప్రశ్నిస్తున్నారు. ఇలా చేస్తే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 కింద ఉన్న భావ ప్రకటన స్వేచ్ఛను కాలరాయడమంటూ వర్మ ఆరోపించారు.

 

అంతకుముందు కూడా సినిమాను ఆపాలంటూ టీడీపీ ఎన్నికల కమీషన్‌కు ఫిర్యాదు చేయగా అందుకు ఈసీ నిరాకరించింది. సినిమాను చూడకుండా సినిమాను ఆపలేమని ఎన్నికల సంఘం చెప్పింది. వాస్తవానికి ఈ సినిమాని వర్మ మార్చి 22వ తేదీన విడుదల చేయాలని భావించింది. అయితే ది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిపికేషన్ (సీబీఎఫ్‌సీ) నిర్ణయంతో సినిమా విడుదలకు బ్రేకులు పడ్డాయి.

సినిమాల్లో అసాంఘిక కార్యకలాపాలను చూపించడం, నేరాలు ఏ విధంగా చేస్తారో చూపించడం, హింసాత్మక సన్నివేశాల్లో పిల్లలను చూపించడం, అసభ్యకరమైన సన్నివేశాలు, ద్వంద్వార్థాలు, అత్యాచారాలు, మత దూషణలు, సామాజిక వర్గాలపై వ్యాఖ్యలు వంటివి ఉంటే వాటి విడుదలకు అనుమతి ఇవ్వడానికి వీల్లేదని కేంద్ర ప్రభుత్వం సీబీఎఫ్‌సీకి ఆదేశాలు జారీచేసిందని, కానీ, ఇలాంటివేమి ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’లో లేకపోయినా కనీసం చూడటానికి కూడా బోర్డు అంగీకరించట్లేదంటూ వర్మ మండిపడుతున్నారు.