Vasudheva Sutham Review : ‘వసుదేవసుతం’ మూవీ రివ్యూ.. పూరి ఆలయం బ్యాక్ డ్రాప్లో డివోషనల్ టచ్ తో..
వసుదేవసుతం సినిమా నేడు జూలై 10న థియేటర్స్ లో రిలీజ్ అయింది. (Vasudheva Sutham Movie Review)
Vasudheva Sutham Movie Review
Vasudheva Sutham Review : మాస్టర్ మహేంద్రన్, అంబికా వాణి జంటగా తెరకెక్కిన సినిమా ‘వసుదేవసుతం’. రెయిన్బో సినిమాస్ బ్యానర్ పై ధనలక్ష్మి బాదర్ల నిర్మాణంలో వైకుంఠ్ బోను దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. వసుదేవసుతం సినిమా నేడు జూలై 10న థియేటర్స్ లో రిలీజ్ అయింది. జాన్ విజయ్, మైమ్ గోపి, సురేష్ చంద్ర మీనన్, ఐశ్వర్య లక్ష్మి, తులసి.. పలువురు కీలక పాత్రల్లో నటించారు.
కథ విషయానికొస్తే..
పురుషోత్తమపురిలో ప్రముఖ వాసుదేవ ఆలయం ఉంటుంది. ఆ ఆలయ చైర్మన్ శర్మ(దువ్వాసి మోహన్)ని హీరా బంధు(మైమ్ గోపి)చంపేసి చైర్మన్ ఎన్నికల్లో తన తండ్రిని గెలిపించుకుంటాడు. వాసుదేవుని ఉత్సవాలకు హైదరాబాద్ లో ఉండే కృశవ్(మహేంద్రన్) ఊరికి వస్తాడు. కృశవ్ లేచిపోయిన తన అక్క ప్రేమపెళ్లికి సపోర్ట్ చేసాడని అన్నయ్య మాట్లాడడు. హీరా బంధు మేనకోడలు భువి(అంబికా వాణి) కూడా ఆ ఉత్సవాలకు వస్తుంది. భువి కృశవ్ ని ఇష్టపడి ఇద్దరూ ప్రేమలో పడతారు.
కానీ కృశవ్.. శర్మ ఏమయ్యాడు, అందరూ వెళ్ళడానికి భయపడే కోయిరాతల అనే ప్రదేశంలో ఏముందో అని వెతకడం మొదలుపెడతాడు. దాంతో పాటు భువితో ప్రేమాయణం నడిపిస్తుండటంతో హీరా బంధు మనుషులు అతనిపై, అతని అన్నపై దాడి చేస్తారు. కృశవ్.. హీరా బంధుతో గొడవపెట్టుకోడానికి అతని ఇంటికి వెళ్తే అసలు వాళ్ళు మనుషులను పంపలేదు అని తెలుస్తుంది. అదే సమయంలో సెంట్రల్ మినిస్టర్(జాన్ విజయ్) ఫోన్ చేసి కృశవ్ జైలు నుంచి తప్పించుకొని వచ్చాడని చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోతారు. అసలు కృశవ్ ఎవరు? జైలుకు ఎందుకు వెళ్ళాడు? జైలు నుంచి ఎందుకు తప్పించుకున్నాడు? వాసుదేవ ఆలయంలో ఏముంది? కృశవ్ పై దాడి చేసింది ఎవరు? కొయిరాతలలో ఏముంది? కృశవ్- భువి ప్రేమకథ ఏమైంది? సెంట్రల్ మినిస్టర్ కథేంటి.. ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే..
Also Read : Lenin Review : ‘లెనిన్’ మూవీ రివ్యూ.. అయ్యగారు నెంబర్ 1 అనిపించుకున్నారా..?
సినిమా విశ్లేషణ..
చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో మెప్పించిన మాస్టర్ మహేంద్రన్ ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోగా సినిమాలు చేస్తున్నాడు. మహేంద్రన్ హీరోగా దేవుడి బ్యాక్ డ్రాప్ తో ఈ వసుదేవసుతం సినిమా తెరకెక్కింది. ఫస్ట్ హాఫ్ పురుషోత్తమపురిలో హీరాబందు గొడవలు, ఆలయ అధికారం కోసం అతను చేసే పనులు, హీరో హీరోయిన్స్ పరిచయం ప్రేమకథతో సాగదీశారు. అసలు ఆ కొయిరాతలలో ఏముంది అనే ఆసక్తి నెలకొల్పారు. రొటీన్ ఫైట్స్, విలన్ హీరో సీన్స్ తో సాగదీశారు. ఇంటర్వెల్ కి హీరో జైలు నుంచి తప్పించుకు వచ్చాడని తెలియడంతో సెకండ్ హాఫ్ పై ఆసక్తి నెలకొంటుంది.
సెకండ్ హాఫ్ లో హీరో ఫ్లాష్ బ్యాక్ బాగుంటుంది. కాకపోతే ఇలాంటి ఫ్లాష్ బ్యాక్ లు చాలా సినిమాల్లో చూసేసాము. ఫ్లాష్ బ్యాక్ లో హీరో అక్క ఎమోషన్ బాగా పండింది. ఫ్లాష్ బ్యాక్ అనంతరం ఓ ట్రెజర్ హంట్ మోడ్ లోకి తీసుకెళ్తారు కానీ అది సరిగ్గా రాసుకోలేదు. సింపుల్ గా విలన్ మనుషులు హీరో ఫైట్ మధ్యలో దేవుడు, గరుత్మంతుడు, పాములు వచ్చి కాపాడేయడం, విలన్స్ ని చంపేయడం.. ఇలా ఒక క్లారిటీ లేకుండా కథ సాగుతుంది. ప్రీ క్లైమాక్స్ లో అసలు విలన్ ఎవరు అని ఇచ్చే ట్విస్ట్ ఊహించము.
ఈ సినిమా అంతా పూరి జగన్నాధ్ ఆలయం, ఆ విగ్రహాలలో ఉండే బ్రహ్మపదార్థం, ఆ ఆలయం కింద ఉండే నిధి గురించి అన్నట్టు చూపించారు. పాయింట్ బాగానే ఉన్నా సరిగా కథనం రాసుకోలేదు. ఫస్ట్ హాఫ్ బాగా సాగదీశారు. ఇలాంటి ట్రెజర్ హంట్ ని ఇంకా బాగా చూపించొచ్చు. రియల్ లొకేషన్స్ కాకుండా సగం సినిమా గ్రీన్ మ్యాట్ మీద తీసినట్టు ఉంటుంది. అవి ఈజీగా తెలిసిపోతాయి. కొన్ని సీన్స్ కి కంటిన్యుటీ ఉండదు. పూరి ఆలయం, పూరి లొకేషన్స్ మధ్య మధ్యలో చూపించారు. మొత్తం పూరి ఆలయం బ్యాక్ డ్రాప్ తీసుకొని ఊరుపేరు, దేవుడి పేరు మార్చుకొని కల్పిత కథ సొంతంగా రాసుకున్నారు.
క్లైమాక్స్ లో గరుత్మంతుడుతో ఓ AI విజువల్స్ చూపించారు. అది ఎందుకో, కథకి సంబంధం ఏంటో దర్శకుడికే తెలియాలి. AI విజువల్స్ బాగానే వాడుకున్నారు. యాక్షన్ సీక్వెన్స్ చాలా పేలవంగా ఉంటాయి. అక్కడ చూపించే రక్తం గ్రాఫిక్స్ కూడా సరిగా ఉండదు. ఇక విలన్ అందరి గుండెలు తీసి బయటకు విసిరేసే ఇబ్బంది కలిగించే విజువల్స్ అన్ని సార్లు చూపించడం ఎందుకో. క్లైమాక్స్ లో పార్ట్ 2కి లీడ్ ఇవ్వడం గమనార్హం. ఇటీవల దేవుడి బ్యాక్ డ్రాప్ లో దేవుడ్ని చూపించేసి సినిమాని సక్సెస్ చేసుకోవాలని పలువురు అలాంటి కథలతో వస్తున్నారు. ఇది కూడా అలాంటి కోవలోకి వచ్చే సినిమానే.

నటీనటుల పర్ఫార్మెన్స్..
మహేంద్రన్ బాగానే నటించాడు. కానీ హీరోగా నటన విషయంలో ఇంకాస్త కష్టపడాలి. అంబికా వాణి పర్వాలేదనిపిస్తుంది. నెగిటివ్ షేడ్స్ లో మైమ్ గోపి, జాన్ విజయ్.. మెప్పించారు. హీరో అక్క, బావ పాత్రల్లో నటించిన నటులు బాగా నటించారు. ఆటో రామ్ ప్రసాద్, తులసి, రాజీవ్ కనకాల, టార్జాన్, సమేత బజాజ్, దువ్వాసి మోహన్,శివన్నారాయణ, ఐశ్వర్య లక్ష్మి.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో పర్వాలేదనిపించారు.
Also Read : I Nobody Review : ‘ఐ, నో బడీ’ మూవీ రివ్యూ.. వారణాసి విలన్ పృథ్వీరాజ్ సుకుమారన్ కొత్త సినిమా.. ఎలా ఉందంటే..?
సాంకేతిక అంశాలు..
సినిమాటోగ్రఫీ విజువల్స్ పర్వాలేదు అనిపిస్తాయి. సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్, RR చాలా మైనస్. ఆ స్కోర్ కి తలనొప్పి రాకుండా ఉంటే చాలు. పాటలు కూడా యావరేజ్. ఎడిటింగ్ లో చాలా సీన్స్ కట్ చేయొచ్చు. ఎడిటింగ్ లో కొన్ని సీన్స్ కంటిన్యుటీ మిస్ అయింది. చాలా చోట్ల డబ్బింగ్ కూడా సరిగ్గా కుదరలేదు. మంచి ఆసక్తికర కథని పూరి బ్యాక్ డ్రాప్ లో రాసుకున్నా దాన్ని తెరకెక్కించడంలో కాస్త విఫలమయ్యాడు దర్శకుడు. నిర్మాణ పరంగా మాత్రం సినిమాను తక్కువ బడ్జెట్ లోనే తీసినట్టు తెలుస్తుంది.
మొత్తంగా ‘వసుదేవసుతం’ సినిమా పూరి ఆలయం బ్యాక్ డ్రాప్ లో రాసుకున్న ఆసక్తికర కథ. కానీ సాంకేతికంగా తెరకెక్కించడంలో కాస్త తడబడ్డారు. ఈ సినిమాకు 2.5 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.
