సైరాకు బడ్జెట్ కష్టాలు.. రాజమౌళి వల్లే సినిమా వస్తుంది: చిరంజీవి

రక్తం పంచుకు పుట్టిన తమ్ముడు పవన్ కళ్యాణ్.. రక్తం పంచి నాకు తమ్ముళ్లు అయినటువంటి ప్రతీ అభిమానికి స్వాగతం అంటూ సైరా ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడిన మెగాస్టార్ చిరంజీవి ఇవాళ సెప్టెంబర్ 22వ తేదీ, నాకు చాలా ముఖ్యమైన రోజు అని, 1978 సెప్టెంబర్ 22 నా మొట్టమొదటి సినిమా ప్రాణం ఖరీదు విడుదలైంది. ఆరోజు నేను టెన్షన్ పడ్డా. 41 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు 2019 సెప్టెంబర్ 22న అదే విధంగా టెన్షన్ పడుతున్నా అనేది వాస్తవం. అందుకు కారణం సైరా సినిమా అని చిరంజీవి చెప్పారు. పుష్కరకాలం ముందు పరుచూరి బ్రదర్స్ ఉయ్యాలవాడ కథను తీసుకుని వచ్చారని, అయితే ఇన్నేళ్లు సినిమా తీయడానికి పట్టిందని అన్నారు.
యోధుడి కథను మన భారతీయులకు చెప్పాలని దశాబ్దానికి పైగా నా మదిలో ఉన్న కల ఈ సినిమా సైరా అని అంతకన్నా ముందు భగత్ సింగ్ సినిమాలో నటించాలని అనుకున్నానని. కానీ ఆ కథ ఎప్పుడూ నావద్దకు రాలేదు. కానీ సైరా రూపంలో స్వాతంత్ర ఉద్యమం ఉన్న కథలో నటించే అవకాశం దక్కినందుకు సంతోషంగా ఉందని అన్నారు. చంద్రశేఖర్ ఆజాద్, నేతాజీ, మహాత్మా గాంధీ వరకు చాలా మంది గొప్పవారి కథలు మనకు తెలుసు. కానీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించి చాలా మందికి తెలియదు. మన తెలుగు వీరుడి గురించి అందరికి తెలియాలని సినిమా తీస్తున్నట్లు చెప్పారు.
ఓ పదేళ్ల క్రితం నా మీద 30, 40కోట్లు పెడితే తిరిగి వచ్చేవి అని, అయితే ఈ సినిమా తీయాలంటే మాత్రం 60కోట్లు అవుతుందని, అందుకు ఎవరు ముందుకు వస్తారు? ఎవరినైనా ఎందుకు ఇబ్బంది పెట్టాలని భావించామని, అయితే ఈ సినిమాను ఎలాగైనా తెరకెక్కించాలి అని అనుకున్నా. బడ్జెట్ సపోర్ట్ లేక సినిమా ఆగిపోయింది. అలాంటి సమయంలో ఈ సినిమా ప్రారంభం కావడానికి పరోక్షంగా కారణమైన వ్యక్తి రాజమౌళి. రాజమౌళి బాహుబలి చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడం వల్లే మాకు ధైర్యం వచ్చింది. రాజమౌళికి హ్యాట్సాఫ్. దర్శకుడు రాజమౌళి బాహుబలి తీయకపోతే ఈ సినిమా వచ్చి ఉండేది కాదు. ఎన్ని వందల కోట్లు అయినా రాబట్టుకోవచ్చు.. అని అడుగు ముందుకు వేసినట్లు చెప్పారు.