Exhibitors Association: జీవోలు వచ్చినా టికెట్ రేట్లు పెంచం, థియేటర్ల పరిరక్షణే లక్ష్యం- ఎగ్జిబిటర్ల అసోసియేషన్ కీలక నిర్ణయం
మాకు ఎవరితోనూ శత్రుత్వం లేదు. పర్సెంటేజ్ విధానం ఉంటే థియేటర్లు నడుపుతాం. లేకపోతే బంద్ చేసుకోవాల్సి వస్తుందని సవినయంగా తెలియజేస్తున్నా.
Exhibitors Association: తెలంగాణలో సింగిల్ స్క్రీన్ థియేటర్ల మనుగడ కోసం ఎగ్జిబిటర్లు మరోసారి “పర్సెంటేజ్ షేరింగ్ విధానం” అమలు చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో నిర్మాతలు, ఎగ్జిబిటర్లు పాల్గొని ప్రస్తుత పరిస్థితులపై చర్చించారు. గత కొన్ని సంవత్సరాలుగా థియేటర్ల ఆదాయం తగ్గిపోవడంతో చిన్న థియేటర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని వారు పేర్కొన్నారు. ముఖ్యంగా రెంటల్ విధానం వల్ల నష్టాలు పెరుగుతున్నాయని అభిప్రాయపడ్డారు.
సమావేశంలో మాట్లాడిన పలువురు నిర్మాతలు, ఎగ్జిబిటర్లు పరిశ్రమలో నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ మధ్య సమన్వయం అవసరమని తెలిపారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న పర్సెంటేజ్ విధానాన్ని తెలుగులో కూడా అమలు చేస్తే థియేటర్లకు ఊరట లభిస్తుందని చెప్పారు. ప్రేక్షకులకు మెరుగైన అనుభవం అందించేందుకు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఆధునిక సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
థియేటర్లు మూతపడితే పరిశ్రమ మొత్తానికీ నష్టం జరుగుతుందని సమావేశంలో స్పష్టం చేశారు. ఎవరినీ లక్ష్యంగా చేసుకుని ఈ నిర్ణయాలు తీసుకోవడం లేదని, కేవలం థియేటర్ల పరిరక్షణ కోసమే ఈ పోరాటమని వివరించారు. పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేసే నిర్మాతల సినిమాలను ప్రదర్శించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అలాగే టికెట్ ధరలు పెంచే ఉద్దేశం లేదని కూడా స్పష్టం చేశారు.
సింగిల్ స్క్రీన్ థియేటర్ల పరిరక్షణ, కొనసాగింపునకు సంబంధించి ప్రతిపాదిత “పర్సెంటేజ్ షేరింగ్ విధానం” అమలుపై చర్చించి నిర్ణయం తీసుకునేందుకు తెలంగాణ ఎగ్జిబిటర్ సభ్యుల సమావేశం నిర్వహించారు. నిర్మాతలు చదలవాడ శ్రీనివాస్, శిరీష్ రెడ్డి, సునీల్ నారంగ్‌తో పాటు పలువురు ఎగ్జిబిటర్ సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇది ఎగ్జిబిటర్ల బతుకు పోరాటం. సింగిల్ స్క్రీన్ థియేటర్ల మనుగడ కోసం అందరికీ సమానంగా వర్తించే “పర్సెంటేజ్ షేరింగ్” విధానాన్ని అమలు చేయవలసిందిగా మనవి చేస్తున్నాము అని ప్రెస్ మీట్ లో తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ కోరింది.
సింగిల్ స్క్రీన్ థియేటర్ల పరిరక్షణ, కొనసాగింపుకు సంబంధించి ప్రతిపాదిత “పర్సెంటేజ్ షేరింగ్ విధానం” అమలుపై చర్చించి నిర్ణయం తీసుకునేందుకు తెలంగాణ ఎగ్జిబిటర్ సభ్యుల సమావేశం నిర్వహించారు. నిర్మాతలు చదలవాడ శ్రీనివాస్, శిరీష్ రెడ్డి, సునీల్ నారంగ్‌తో పాటు పలువురు ఎగ్జిబిటర్ సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఎగ్జిబిటర్లను బతికించుకోవాల్సిన అవసరం మనందరిపై ఉంది- చదలవాడ శ్రీనివాస్..
ఒక నిర్మాతగా మాట్లాడాలంటే నిర్మాత తండ్రి అయితే, ఎగ్జిబిటర్ బిడ్డ లాంటి వాడు. అలా చూసినప్పుడే సినిమా ఇండస్ట్రీ బాగుంటుంది. తండ్రి ఎంత కష్టపడినా బిడ్డల సుఖం కోసమే. గత 20 ఏళ్లుగా ఎగ్జిబిటర్లు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వారికి గిట్టుబాటు లేక, ఆదరణ లేక పరిస్థితులు క్షీణించాయి. గత ఏడాది నుంచి పరిస్థితి మరింత దిగజారింది. ముఖ్యంగా గత ఆరు నెలలుగా ఎగ్జిబిటర్ల పరిస్థితి అస్సలు బాలేదు. ఎగ్జిబిటర్ బాగుంటేనే సినిమా పరిశ్రమ బాగుంటుంది. సునీల్ నారంగ్, శిరీష్ అందరూ థియేటర్ల అభివృద్ధి కోసం తమ బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. నిర్మాతగా వారికి నా 100 శాతం సపోర్ట్ ఉంటుంది. ఎగ్జిబిటర్లను బతికించుకోవాల్సిన అవసరం మనందరిపై ఉంది. ప్రస్తుతం ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతల మధ్య సమన్వయం చాలా ముఖ్యం. సినిమా పరిశ్రమ మరింత బలపడేలా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగాలని ఆశిస్తున్నా.
జీవోలు వచ్చినా థియేటర్ లో టికెట్ రేట్లు పెంచము-నిర్మాత శిరీష్ రెడ్డి..
మేము పర్సెంటేజ్ విధానం గురించి మాట్లాడుతున్నామంటే ఇది ఎగ్జిబిటర్ల బతుకు పోరాటం. ఏ సినిమాను టార్గెట్ చేసి గానీ, ఏ నిర్మాతను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో గానీ ఇది చేయడం లేదు. థియేటర్లను రక్షించండి. మిగిలిన రాష్ట్రాల్లో థియేటర్లకు పర్సంటేజీ విధానం అమలు చేసి తెలుగులో మాత్రం ఎందుకు రెంటల్ పద్ధతిలో సినిమా రిలీజ్ చేస్తున్నారో ఒకసారి ప్రశ్నించుకోవాలి. మా విజ్ఞప్తి ఒక్కటే.. మమ్మల్ని వేరే కోణంలో చూడకండి. దయ చేసి ఎగ్జిబిటర్లను కాపాడండి. ఈ సందర్భంగా ప్రేక్షకులకు ఒక విషయం చెబుతున్నాం. జీవోలు వచ్చినా థియేటర్ లో టికెట్ రేట్లు పెంచమని తెలియజేస్తున్నాం.
మాకు ఎవరితోనూ శత్రుత్వం లేదు. -తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ శ్రీధర్..
పర్సెంటేజ్ విధానం కోసం మేము 2008 నుంచే పోరాడుతున్నాం. చివరిగా ‘హరిహర వీరమల్లు’ సినిమా విడుదల సమయంలో కూడా పర్సెంటేజ్ అమలు చేస్తామని చెప్పారు. కానీ అది జరగలేదు. మేము థియేటర్లు బంద్ చేస్తున్నామని అసత్య ప్రచారం చేశారు. మేము థియేటర్లు బంద్ చేయడం లేదు. ఎవరైతే పర్సెంటేజ్ ఇస్తారో వాళ్ల సినిమాలను ప్రదర్శిస్తామని చెబుతున్నాం. గీత, వెంకటేశ్వర, సురేష్ ప్రొడక్షన్స్, ఏషియన్ వంటి సంస్థలు ఇప్పటికే ఈ విధానంలోకి వచ్చాయి. మిగిలిన వారు కూడా త్వరలో వస్తారని ఆశిస్తున్నాం. దేశమంతా పర్సెంటేజ్ విధానంలోనే సినిమాలు ప్రదర్శిస్తున్నారు. మాకు ఎవరితోనూ శత్రుత్వం లేదు. పర్సెంటేజ్ విధానం ఉంటే థియేటర్లు నడుపుతాం. లేకపోతే బంద్ చేసుకోవాల్సి వస్తుంది అని సవినయంగా తెలియజేస్తున్నా.
మూతపడితే నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకే నష్టం-నిర్మాత సునీల్ నారంగ్
ఇది చాలా సీరియస్ ఇష్యూ. పర్సెంటేజ్ విధానం అమలు చేస్తామని చెబుతారు కానీ అమలు చేయరు. నిర్మాతలు కూడా నష్టాల్లోనే ఉన్నారు. అందరి పరిస్థితి బాగోలేదని అంటారు. మల్టీప్లెక్సుల్లో కొత్త టెక్నాలజీలు, ఆధునిక సౌకర్యాలు తీసుకొస్తున్నారు. కానీ సింగిల్ స్క్రీన్ థియేటర్లలో అలాంటి సదుపాయాలు కల్పించలేకపోతున్నాం. డాల్బీ వంటి ఆధునిక సౌకర్యాలు ఉంటే ప్రేక్షకులు తప్పకుండా సింగిల్ స్క్రీన్స్‌కి కూడా వస్తారు. సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడితే నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకే నష్టం. మేము ఏ సినిమాను టార్గెట్ చేయడం లేదు. చాలా ఏళ్లుగా ఈ విషయాన్ని నిర్మాతల దృష్టికి తీసుకెళ్తున్నాం. వారు హామీ ఇస్తున్నారు కానీ ఆ హామీని నిలబెట్టుకోవడం లేదు. అందుకే ఈ సమావేశం నిర్వహించాం. మీడియా కూడా సింగిల్ స్క్రీన్ థియేటర్లను రక్షించే ప్రయత్నంలో మాకు సహకరించాలని కోరుకుంటున్నా.
Also Read: మూడేళ్ల ప్రేమ, రెండేళ్ల పెళ్లి.. అప్పుడే బ్రేకప్? భర్త ఫోటోలు డిలీట్ చేసిన మౌనీ రాయ్
