Sandhya Theatre : మొన్న బన్నీ ఫ్యాన్స్.. ఇవాళ పవన్ ఫ్యాన్స్.. ఇకపై ‘సంధ్య’ థియేటర్లో కష్టమే..
నేడు పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు ట్రైలర్ రిలీజయిన సంగతి తెలిసిందే.

Sandhya Theatre
Sandhya Theatre : స్టార్ హీరోల సినిమాలు రిలీజయితే థియేటర్స్ వద్ద ఫ్యాన్స్ ఎంత సందడి చేస్తారో తెలిసిందే. ఇటీవల బన్నీ పుష్ప 2 సినిమా రిలీజ్ సమయంలో హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న సంధ్య థియేటర్స్ కి అల్లు అర్జున్ రావడంతో బన్నీ ఫ్యాన్స్ భారీగా తరలి వచ్చారు. దీంతో అక్కడ తొక్కిసలాట జరిగి ఓ మహిళ మరణించి, ఓ బాబు హాస్పిటల్ పాలయిన సంగతి తెలిసిందే. దీంతో సంధ్య థియేటర్ పోలీసుల దృష్టికి వెళ్ళింది.
హైదరాబాద్ లో సినిమా సింగిల్ స్క్రీన్స్ లో చూడాలంటే ఫ్యాన్స్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న థియేటర్స్ లోనే చూస్తారు. ముఖ్యంగా సంధ్య థియేటర్లో. రిలీజ్ రోజు థియేటర్స్ వద్ద ఫ్యాన్స్ హంగామా భారీగా ఉంటుంది. మొన్న బన్నీ సినిమాకు అలా జరగడంతో మాములు సినిమా షోలు ఉన్న టైం కి కాకుండా థియేటర్లో ఇంకెలాంటి స్పెషల్ షోలు, ఈవెంట్స్ చేసినా పోలిస్ పర్మిషన్ తీసుకోవాల్సిందే.
Also Read : Tollywood : టాలీవుడ్ కి 3700 కోట్ల నష్టం.. కీలక వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు..
నేడు పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు ట్రైలర్ రిలీజయిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో పలు థియేటర్స్ లో ఈ సినిమా ట్రైలర్ ని షో వేశారు. దీంతో ఆయా థియేటర్స్ వద్ద పవన్ ఫ్యాన్స్ సందడి చేసారు. ఈ థియేటర్స్ లిస్ట్ లో సంధ్య థియేటర్ కూడా ఉంది. కానీ ముందు రోజు సంధ్య థియేటర్ దగ్గర ట్రైలర్ షోకి పాస్ లు ఇస్తున్నారు అని తెలియడంతో భారీగా పవన్ ఫ్యాన్స్ చేరుకున్నారు. థియేటర్స్ దగ్గర ఫ్యాన్స్ హడావిడి చేయడం, కటౌట్లు కట్టాలని చూడటం, అక్కడ రోడ్లు బ్లాక్ అవ్వడంతో పోలీసులు రంగంలోకి దిగారు.
అసలు ట్రైలర్ వేయడానికి సంధ్య థియేటర్ కి పర్మిషన్ లేదని, పర్మిషన్ ఇవ్వమని పోలీసులు చెప్పడంతో చేసేదేం లేక సంధ్య థియేటర్ యాజమాన్యం హరిహర వీరమల్లు ట్రైలర్ షో క్యాన్సిల్ అయిందని థియేటర్ బయట ఓ బోర్డు పెట్టుకున్నారు. మొత్తానికి ఫ్యాన్స్ భారీ సంఖ్యలో వచ్చి థియేటర్స్ దగ్గర హడావిడి చేస్తుండటంతో ఏం జరగకూడదని పోలీసులు జాగ్రత్తలు తీసుకొని పర్మిషన్లు ఇవ్వడం మానేస్తున్నారు.
హైదరాబాద్ లో ఎంతో ముఖ్యమైన సంధ్య థియేటర్ ఇప్పుడు ఇలా సైలెంట్ గా మూగపోవడానికి అభిమానుల అత్యుత్సాహమే కారణమని పలువురు అభిప్రాయపడుతున్నారు. మొన్న బన్నీ ఫ్యాన్స్, ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ దెబ్బకి సంధ్య థియేటర్ మరోసారి పోలీసుల కళ్ళలో పడటమే కాక వార్తల్లో నిలిచింది. మున్ముందు కూడా సంధ్య థియేటర్లో సినిమా ఈవెంట్స్ కి, స్పెషల్ షోలకు పర్మిషన్ ఉండకపోవచ్చు అనే తెలుస్తుంది. ఫ్యాన్స్ అత్యుతాహం ఒక కీలక థియేటర్ కి కళ తప్పేలా చేస్తుందని పలువురు సినిమా ప్రేమికులు భావిస్తున్నారు. ఈ లెక్కన ఫ్యూచర్ లో కూడా సంధ్య థియేటర్లో ప్రీమియర్ షోలు, స్పెషల్ షోలు, సినిమా ఈవెంట్స్, ట్రైలర్ షోలు వేయడం కష్టమేనేమో అని టాలీవుడ్ టాక్.