Pawan Kalyan : కర్ణాటక, కాంతార సినిమా వివాదంపై పవన్ కళ్యాణ్.. వాళ్ళు అలా చేసారని మనం సపోర్ట్ చేయడం ఆపొద్దు..
కాంతార చాప్టర్ 1 సినిమాకు టికెట్ రేట్ల పెంపు కోసం ఏపీ ప్రభుత్వాన్ని కలిశారు. (Pawan Kalyan)

Pawan Kalyan
Pawan Kalyan : ఇటీవల వరుసగా తెలుగు సినిమాలపై కర్ణాటకలో దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు రిలీజ్ కాబోతున్న కాంతార చాప్టర్ 1 సినిమాని బాయ్ కాట్ చేస్తూ ట్రెండ్ చేశారు తెలుగు నెటిజన్లు. ఇక రిషబ్ శెట్టి తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా పూర్తిగా కన్నడలోనే మాట్లాడటంతో ఈ వివాదం మరింత పెద్దదయింది.(Pawan Kalyan)
అయితే కాంతార చాప్టర్ 1 సినిమాకు టికెట్ రేట్ల పెంపు కోసం ఏపీ ప్రభుత్వాన్ని కలిశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకుంది. అయితే ఈ సినిమా టికెట్ ధరల పెంపు విషయంలో తెలుగు సినిమా పరిశ్రమ వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. తెలుగు సినిమాను కర్ణాటక రాష్ట్రంలో విడుదల సందర్భంలో పలు ఆటంకాలు ఎదురవుతున్నాయని, మన చిత్రాలకు టికెట్ ధరల పెంపు విషయంలో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉండటంలేదని చెప్పారు.
అలాగే తెలుగు సినిమా అని పోస్టర్లు, బ్యానర్లు కూడా తొలగించే చర్యలకు కొందరు దిగుతున్నా కన్నడ సినీ పరిశ్రమ నుంచి స్పందన రావడం లేదని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. ఎన్టీఆర్, చరణ్ కలిసి చేసిన RRR సినిమా విషయంలో కూడా అక్కడ తరతమ బేధాలు చూపిన విషయాన్ని ప్రస్తావిస్తూ గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం, హరిహర వీరమల్లు, తాజాగా ఓజీ సినిమాలకు చోటు చేసుకున్న పరిణామాలను ప్రస్తావించారు. అక్కడ తెలుగు సినిమాకు టికెట్ ధరల విషయంలో హైకోర్టుకు కూడా వెళ్లారని తెలిపారు. అందుకే కాంతార చాప్టర్ 1 సినిమాకు, వేరే కన్నడ సినిమాలకు టికెట్ ధర పెంపుపై ముందుకు వెళ్ళే విషయంలో ఆలోచించాలని కోరారు పలువురు సినీ ప్రముఖులు.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
దీంతో ఈ విషయం పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, సంబంధిత శాఖ అధికారులు చర్చించారు. దీనిపై పవన్ కళ్యాణ్ స్పందిస్తూ.. కర్నాటకలో పరిణామాలను దృష్టిలో ఉంచుకొని అక్కడి చిత్రాలకు ఇక్కడ ప్రోత్సాహం ఇవ్వడం ఆపవద్దు. కళ అనేది మనసుల్ని కలపాలి కానీ విడదీయకూడదు. మంచి మనసుతో, జాతీయ భావనలతో ఆలోచనలు చేయాలి. కన్నడ కంఠీరవ డా.రాజ్ కుమార్ గారి కాలం నుంచి ఇప్పటి కిచ్చా సుదీప్, ఉపేంద్ర, శివరాజ్ కుమార్, రిషబ్ శెట్టి వరకూ అందరినీ తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. సోదరభావంతో ఉన్నాము. మన సినిమాకు వ్యాపారపరంగా ఎదురవుతున్న ఇబ్బందుల్ని రెండు భాషల ఫిల్మ్ ఛాంబర్స్ కూర్చొని మాట్లాడుకోవాలి. అప్పుడు ప్రభుత్వపరంగా మనమూ మాట్లాడదాము. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళతాను. అంతేకాని కర్ణాటకలో ఎదురైన పరిణామాలను దృష్టిలో పెట్టుకొని కాంతారా ఛాప్టర్ 1కి ఆటంకాలు కల్పించవద్దు అని అన్నారు.
Also Read : OG OST : గెట్ రెడీ ఫ్యాన్స్.. ఓజీ OST వచ్చేస్తుంది.. ఎప్పుడంటే.. వెరైటీగా ప్లాన్ చేస్తున్న తమన్..
దీంతో ఏపీలో కాంతార చాప్టర్ 1 టికెట్ రేట్లు పెరుగుతాయని తెలుస్తుంది. అయితే దీనిపై మిశ్రమ స్పందన వస్తుంది. పలువురు పవన్ కళ్యాణ్ మాటలను అంగీకరించినా మరికొంతమంది కన్నడ వాళ్ళు అంత చేస్తున్నా మీరు సపోర్ట్ చేయడం బాగోలేదని విమర్శిస్తున్నారు.