Chiranjeevi – Pawan Kalyan : ఆపద్భాందవుడు అన్నయ్య.. ఆయన ఇచ్చిన మద్దతే జనసేనకు విజయం.. పవన్ కళ్యాణ్ స్పెషల్ విషెస్..
నేడు చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా అధికారికంగా చిరంజీవికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ స్పెషల్ ప్రెస్ నోట్ విడుదల చేసారు పవన్ కళ్యాణ్.

Pawan Kalyan Special Birthday Wishes to his Brother Megastar Chiranjeevi
Chiranjeevi – Pawan Kalyan : నేడు మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు కావడంతో అభిమానులు, ప్రముఖులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక ఫ్యాన్స్ అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్నయ్య పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నయ్య చిరంజీవికి స్పెషల్ గా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
చిరంజీవి – పవన్ కళ్యాణ్ మధ్య ఉన్న అనుబంధం గురించి అందరికి తెలిసిందే. అన్నయ్య అంటే పవన్ కి ఎంత ఇష్టం, అభిమానమో ఎన్నోసార్లు ఆయన చేతల్లో చూపించారు. ఇటీవల ఎన్నికల్లో గెలిచాక కూడా అన్నయ్య ఇంటికి వెళ్లి ఆయన కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకున్నారు పవన్. నేడు చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా అధికారికంగా చిరంజీవికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ స్పెషల్ ప్రెస్ నోట్ విడుదల చేసారు పవన్ కళ్యాణ్.
ఈ ప్రెస్ నోట్ లో.. నా దృష్టిలో ఆపద్బాంధవుడు అన్నయ్య చిరంజీవి గారు. అన్నయ్య పుట్టిన రోజు సందర్భంగా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ఆపత్కాలంలో ఉన్న ఎందరికో ఆయన సహాయం చేయడం నాకు తెలుసు. అనారోగ్యం బారిన పడిన వారికి ప్రాణదానం చేసిన సందర్భాలు అనేకం. కొందరికి చేసిన సాయం మీడియా ద్వారా బాహ్య ప్రపంచానికి తెలిస్తే మరెన్నో సహాయాలు గుప్తంగా మిగిలిపోయాయి. కావలసిన వారి కోసం ఆయన ఎంతవరకైనా తగ్గుతారు, అభ్యర్ధిస్తారు. ఆ గుణమే చిరంజీవి గారిని సుగుణ సంపన్నునిగా చేసిందేమో. గత అసెంబ్లీ ఎన్నికలు కీలక దశకు చేరుకున్న తరుణంలో అయిదు కోట్ల రూపాయల విరాళాన్ని జనసేనకు అందచేసి, విజయాన్ని అందుకోవాలని మా ఇలవేలుపు ఆంజనేయుని సాక్షిగా శ్రీ చిరంజీవిగారు ఆశీర్వదించారు. ఆయన ఆ రోజున ఇచ్చిన నైతిక బలం, నైతిక మద్దతు జనసేనకు అఖండ విజయాన్ని చేకూర్చాయి. అటువంటి గొప్ప దాతను అన్నగా ఇచ్చినందుకు ఆ భగవంతునికి సదా కృతజ్ఞుణ్ని. తల్లి లాంటి మా వదినమ్మతో ఆయన చిరాయుష్షుతో ఆరోగ్యవంతంగా జీవించాలని ఆ దేవదేవుణ్ని మనసారా కోరుకుంటున్నాను అని తెలిపారు. దీంతో పవన్ అన్నయ్యకు చెప్పిన విషెస్ వైరల్ గా మారాయి.