అభిమానుల వీక్‌నెస్‌ను క్యాష్ చేసుకుంటారా?: సాహో నిర్మాతలపై హైకోర్టు ఆగ్రహం

  • Published By: vamsi ,Published On : August 28, 2019 / 06:53 AM IST
అభిమానుల వీక్‌నెస్‌ను క్యాష్ చేసుకుంటారా?: సాహో నిర్మాతలపై హైకోర్టు ఆగ్రహం

Updated On : August 28, 2019 / 6:53 AM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో రూ. 300కోట్ల భారీ బడ్జెట్ తో రూపొంది విడుదలకు సిద్దమైన సినిమా ‘సాహో’. ఈ సినిమాకు సంబంధించి కొన్ని ప్రత్యేక అనుమతులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చింది. టికెట్ రేట్స్ పెంచుకోవడంతో పాటు స్పెషల్ బెనిఫిట్ షోస్‌ వేసుకునేందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో థియేటర్లలోనే సినిమా టిక్కెట్లను రూ. 300 వరకు అమ్ముతున్నారు.

ఈ క్రమంలో ఇష్టమొచ్చినట్టు సినిమా టికెట్ రేట్లను పెంచి అమ్మడంపై ప్రముఖ నిర్మాత నట్టికుమార్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. ‘సాహో’ సినిమాను చూడాలకునుకొనే అభిమానులు, ప్రేక్షకుల బలహీనతను సినిమా నిర్మాతలు క్యాష్ చేసుకునేందుకు టిక్కెట్ రేట్లను పెంచడాన్ని అడ్డుకోవాలని కోరుతూ.. నట్టి కుమార్ హైకోర్ట్ లో పిటీషన్ వేశారు. ఈ సినిమా టికెట్ రేటును రూ.300 వరకు పెంచారని, అన్యాయంగా టిక్కెట్ ధరలను పెంచి అమ్మడాన్ని అడ్డుకోవాలని కోరుతూ.. నట్టికుమార్ పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై స్పందించిన కోర్టు ‘సాహో’ సినిమా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నోటీసులు విడుదల చేసింది.

దీనిపై వివరణ ఇవ్వాలని కోరుతూ ఏపీ హోమ్ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి, విశాఖ పోలీస్ కమిషనర్, సాహో చిత్ర పంపిణిదారు దిల్‌రాజు తదితరులకు నోటీసులు జారీ చేసింది హైకోర్టు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం మాత్రం ‘సాహో’ సినిమాకి స్పెషల్ పర్మిషన్ షోస్‌తో పాటు టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతులు ఇవ్వలేదు. ఇదే విషయాన్ని పిటీషనర్ తరపు న్యాయవాది కోర్టులో ప్రస్తావించనున్నారు.