Sowcar Janaki: చిత్రసీమలో తీవ్ర విషాదం.. షావుకారు జానకి కన్నుమూత
తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో వందలాది చిత్రాల్లో నటించి మెప్పించిన దిగ్గజ నటి, పద్మశ్రీ ‘షావుకారు’ జానకి (Sowcar Janaki)(94) తుది శ్వాస విడిచారు.
legendary actress padma shri sowcar janaki passes away at 94 in chennai
- సీనియర్ నటి జానకి కన్నుమూత
- చెన్నై ఆస్పత్రిలో తుది శ్వాస
- దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రముఖులు
Sowcar Janaki: తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో వందలాది చిత్రాల్లో నటించి మెప్పించిన దిగ్గజ నటి, పద్మశ్రీ ‘షావుకారు’ జానకి(Sowcar Janaki) (94) తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా శ్వాసకోశ మరియు వృద్ధాప్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమెను కుటుంబ సభ్యులు చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చేర్పించారు. ఐసీయూలో చికిత్స పొందుతూ ఆమె కన్నుమూశారు. 1931లో రాజమహేంద్రవరంలో జన్మించిన ఆమె అసలు పేరు టేకుమళ్ల జానకి కాగా, ప్రముఖ నటి కృష్ణకుమారికి ఈమె సోదరి. 1949లో ‘రక్షా రేఖ’ సినిమాతో వెండితెరకు పరిచయమై, 1950లో వచ్చిన ‘షావుకారు’ చిత్ర విజయం తర్వాత ‘షావుకారు జానకి’గా పేరు పొందారు.
ఏడు దశాబ్దాల ప్రస్థానం.. పద్మశ్రీ పురస్కారం:
సుదీర్ఘమైన సినీ ప్రస్థానంలో ఆమె సుమారు 400కి పైగా చిత్రాల్లో వైవిధ్యభరిత పాత్రలు పోషించారు. ‘వద్దంటే డబ్బు’, ‘కన్యాశుల్కం’, ‘రోజులు మారాయి’, ‘డాక్టర్ చక్రవర్తి’, ‘సంసారం ఒక చదరంగం’, ‘బాబు బంగారం’ వంటి ఎన్నో ప్రతిష్టాత్మక చిత్రాలలో ఆమె నటన చెరగని ముద్ర వేసింది. చివరిసారిగా ‘అన్నీ మంచి శకునములే’ చిత్రంలో నటించిన జానకికి, భారత ప్రభుత్వం 2022లో ‘పద్మశ్రీ’ పురస్కారంతో సత్కరించింది. ఆమె మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
