Cheekatilo Review : శోభిత ధూళిపాళ ‘చీకటిలో’ మూవీ రివ్యూ.. పెళ్లి తర్వాత శోభిత ఫస్ట్ సినిమా ఎలా ఉందంటే..
చాన్నాళ్ల తర్వాత తెలుగులో శోభిత డైరెక్ట్ సినిమా కావడం, ట్రైలర్ కూడా బాగుండటంతో ఈ చీకటిలో పై అంచనాలు నెలకొన్నాయి. (Cheekatilo Review)
Cheekatilo Review
Cheekatilo Review : శోభిత ధూళిపాళ మెయిన్ లీడ్ లో తెరకెక్కిన సినిమా ‘చీకటిలో’. విశ్వదేవ్ రాచకొండ, శ్రీనివాస్ వడ్లమాని, అదితి మ్యాకల్, ఆమని, చైతన్య కృష్ణ, ఈషా చావ్లా, ఝాన్సీ, రవీంద్ర విజయ్.. పలువురు ముఖ్య పాత్రల్లో ఈ సినిమా తెరకెక్కింది. సురేష్ బాబు నిర్మాణంలో శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన చీకటిలో సినిమా నేడు జనవరి 23 నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.(Cheekatilo Review)
కథ విషయానికొస్తే..
సంధ్య (శోభిత ధూళిపాళ) ఓ టీవీ ఛానల్ లో ఫేమస్ క్రైమ్ న్యూస్ ప్రజెంటర్. తన ఛానల్ టీఆర్పీ కోసం వార్తల్ని మార్చే తీరు నచ్చకపోవడంతో ఛానల్ హెడ్(రవివర్మ)తో గొడవ పెట్టుకొని జాబ్ మానేస్తుంది. తన ఇంటర్న్ బాబీ(అదితి మ్యాకెల్) సలహాతో, బాయ్ ఫ్రెండ్ అమర్(విశ్వదేవ్ రాచకొండ)సపోర్ట్ తో చీకటిలో అనే టైటిల్ తో ఓ క్రైమ్ పాడ్ కాస్ట్ మొదలుపెద్దుతుంది సంధ్య. అది మొదలుపెట్టగానే తన ఇంటర్న్ బాబీ, అతని బాయ్ ఫ్రెండ్ హత్యకు గురవుతారు. పోలీసాఫీసర్ రాజీవ్(చైతన్య కృష్ణ) ఆ కేసుని డీల్ చేస్తున్నా సంధ్య తన కోణంలో ఆ హత్య గురించి రీసెర్చ్ చేసి పాడ్ కాస్ట్ లో చెప్పడంతో అది కాస్తా వైరల్ అయి జనాల్లో, పోలీసుల్లో చర్చకు దారి తీస్తుంది.
ఈ పాడ్ కాస్ట్ తో ఓ ఆగంతకుడు సంధ్యని ఫోన్ చేసి హెచ్చరిస్తాడు. అదే సమయంలో గోదావరి జిల్లాల నుంచి ఓ మహిళ కాల్ చేసి కలిసి ఇలాంటి సంఘటనే ఓ ముప్పై ఏళ్ళ క్రితం జరిగింది అని సంధ్యకు చెప్తుంది. దీంతో అదేంటో కనుక్కోవడానికి సంధ్య అమర్ తో కలిసి ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. అసలు గోదావరి జిల్లాల్లో 30 ఏళ్ళ క్రితం ఏం జరిగింది? బాబీని ఎవరు హత్య చేసారు? ఎందుకు చేసారు? మళ్ళీ హత్యలు జరిగాయా? సంధ్య, పోలీసులు ఈ మర్డర్ మిస్టరీని ఎలా చేధించారు తెలియాలంటే చీకటిలో చూడాల్సిందే.
సినిమా విశ్లేషణ..
నాగచైతన్యతో పెళ్లి తర్వాత శోభిత ధూళిపాళ మొదటి సినిమా కావడం, చాన్నాళ్ల తర్వాత తెలుగులో శోభిత డైరెక్ట్ సినిమా కావడం, ట్రైలర్ కూడా బాగుండటంతో ఈ చీకటిలో పై అంచనాలు నెలకొన్నాయి. మర్డర్ మిస్టరీలు అంటే ఓ మర్డర్ జరగడం, దాంతో విలన్ ఎవరో కనిపెట్టడానికి పోలీసులు, మెయిన్ లీడ్ కష్టపడటమే ఉంటుంది. ఇందులో కూడా అంతే.
అయితే ఆ మర్డర్ మిస్టరీని 30 ఏళ్ళ క్రితం జరిగిన సంఘటనలను లింక్ చేస్తూ రాసుకోవడం బాగుంది. ప్రతి సీన్ తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే ఉత్కంఠను కలిగించినా చాలా చోట్ల సీరియస్ నెస్ కోసం సినిమాని సాగదీసినట్టు అనిపిస్తుంది. అయితే ఇవన్నీ చేసేది ఎవరు అనే క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం ఎవరూ ఊహించలేరు. ఇది సినిమాకు చాలా ప్లస్ అయింది. ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్స్ లో విలన్ అతనా, ఇతనా అని సందేహాలు వ్యక్తమవుతూ ఉంటాయి. ఈ చీకటిలో కూడా అలాగే చూపించినా సినిమాలో రివీల్ అయ్యేంతవరకు మనం గెస్ చేయలేకపోవడం గమనార్హం.
అలాగే ఇదంతా ఎందుకు చేస్తున్నారు అనే కారణం కూడా బాగా చూపించారు. ఇలాంటివి జరిగినప్పుడు ఆ వ్యక్తులు, కుటుంబాలు ఎంత బాధపడతాయి అనేది కూడా బాగా రాసుకున్నారు. కొన్ని విషయాల్లో అమ్మాయిలతో పాటు అబ్బాయిలు కూడా పడే బాధలని, జరిగే రియాలిటీని చూపించిన విధానానికి దర్శకుడికి హ్యాట్సాఫ్ చెప్పొచ్చు. అయితే సినిమాలో మెయిన్ లీడ్ పాడ్ కాస్ట్ చెప్తుంది, అది వైరల్ అవుతుంది అని చూపించారు కానీ అది ఏ ప్లాట్ ఫామ్ లో చెప్తుంది, గ్రామాల్లో కూడా అది వింటున్నారు అంటే ఎందులో వస్తుంది అని క్లారిటీ ఇవ్వలేదు. ఇక క్లైమాక్స్ లో శోభిత రీసెర్చ్ చేసినా చివర్లో తను చూపించే ఓ ఫోటో అసలు తన దగ్గరికి ఎలా వచ్చింది అనేది కూడా క్లారిటీ ఇవ్వలేదు.
ఈ రోజుల్లో సినిమాల్లో హీరోయిన్స్ ని జీన్స్, మోడ్రన్ డ్రెస్ లలో అక్కర్లేకపోయినా చూపిస్తుంటే డేరింగ్, మోడ్రన్ వుమెన్ అయిన శోభిత పాత్రని సినిమా అంతా పంజాబీ డ్రెస్, చీరలోనే చూపించడం అభినందనీయం. అది ఈ కథకు ఇంకా ప్లస్ అయింది. టైటిల్ చీకటిలో తగ్గట్టు సినిమా అంతా డార్క్ టోన్ లో ఉండటం, క్లైమాక్స్ లో వెలుగులోకి వచ్చినట్టు కలర్ ప్యాట్రన్ మారడం బాగా చూపించారు. మరో మంచి సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా చూడాలి అనుకుంటే అమెజాన్ ఓటీటీలోకి వెళ్లి చీకటిలో చూసేయొచ్చు.

నటీనటుల పర్ఫార్మెన్స్..
శోభిత ధూళిపాళ ధైర్యంగా తనకు నచ్చేది చేసే అమ్మాయి పాత్రలో అద్భుతంగా నటించింది. తన పాత్రలో, డైలాగ్స్ లో, నడవడికలో తెలుగుతనం ఉట్టిపడింది. ఎంతైనా తెలుగు అమ్మాయి కదా. ఈ సినిమాకు శోభిత మెయిన్ లీడ్ అవ్వడం చాలా ప్లస్ అయింది. గర్ల్ ఫ్రెండ్ కి సపోర్ట్ చేస్తూనే మధ్యలో గొడవలు పడే బాయ్ ఫ్రెండ్ పాత్రలో విశ్వదేవ్ రాచకొండ చాలా బాగా నటించాడు.
ఇషాచావ్లా పాత్రకి ఎవరైనా చిన్న ఆర్టిస్ట్ చేసినా సరిపోతుంది కానీ ఒకప్పుడు హీరోయిన్ గా మెపించిన ఇషాచావ్లాని తీసుకురావడం గమనార్హం. చైతన్య కృష్ణ పోలీస్ పాత్రలో బాగానే నటించాడు. ఝాన్సీ, ప్రదీప్, శ్రీలక్ష్మి, ఆమని, వడ్లమాని శ్రీనివాస్, రవీంద్ర విజయ్, రవివర్మ, విషిక, సురేష్.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో బాగానే మెప్పించారు. విలన్ గా చుపించిన వ్యక్తిని చూసి ఇతనా అని మనం ఆశ్చర్యపోతూనే అతని నటనని అభినందించకుండా ఉండలేము. సరదాగా ఉండే పాత్రలో అదితి మ్యాకెల్ చక్కగా నటించింది.
Also Read : Sobhita Dhulipala : తెలుగు వాళ్లకు నేను బాగా కనెక్ట్ అవ్వాలి అనుకుంటున్నా.. శోభిత ధూళిపాళ కామెంట్స్..
సాంకేతిక అంశాలు..
సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. కథకు తగ్గట్టు డార్క్ టోన్ లో లైటింగ్ సెట్ చేసుకొని పర్ఫెక్ట్ విజువల్స్ తో ప్రజెంట్ చేసారు. ఎడిటింగ్ బాగుంది. కాకపోతే కొన్ని సాగదీత సన్నివేశాలను క్రిస్పీగా కట్ చేసుంటే బాగుండేది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సస్పెన్స్ థ్రిల్లర్ కి కావాల్సినదానికంటే ఎక్కువ ఇచ్చి సస్పెన్స్ తో పాటు భయపెట్టారు కూడా.
దర్శకుడు రొటీన్ మర్డర్ మిస్టరీని చాలా బాగా రాసుకున్నాడు. క్లైమాక్స్ వరకు విలన్ ఎవరు అనేది గెస్ చేయలేకుండా రాసుకోవడం, దాన్ని ప్రజెంట్ చేయడం, ఎందుకు చేసాడు అనే కారణం బాగా రాసుకొని చక్కగా తెరకెక్కించాడు. డైలాగ్స్ కూడా తెలుగుతనం ఉట్టిపడేలా బాగున్నాయి. నిర్మాణ పరంగా కూడా బాగానే ఖర్చుపెట్టినట్టు సినిమాలో కనిపిస్తుంది.
మొత్తంగా శోభిత ధూళిపాళ కాస్త గ్యాప్ తర్వాత ‘చీకటిలో’ అంటూ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాతో వచ్చి ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.
