సోనూ సూద్‌కు ఐకరాజ్య సమితి అరుదైన గౌరవం..

  • Published By: sekhar ,Published On : September 29, 2020 / 05:20 PM IST
సోనూ సూద్‌కు ఐకరాజ్య సమితి అరుదైన గౌరవం..

Updated On : September 29, 2020 / 5:34 PM IST

Sonu Sood – Humanitarian Action Award: జాతీయస్థాయిలో వేలాది మంది వలస కూలీలను ఆదుకున్న ప్రముఖ స్వచ్ఛంద సేవకుడు, సినీ నటుడు రియల్ హీరో.. హెల్పింగ్ హ్యాండ్ సోనూ సూద్‌ను ప్రతిష్టాత్మక పురస్కారం వరించింది. ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ యూఎన్‌డీపీ (యునైటెడ్‌ నేషన్స్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌) స్పెషల్ హ్యుమానిటేరియన్ యాక్షన్ అవార్డును సోనూకు ప్రదానం చేసింది.


ఇప్పటివరకు నటుడిగా అవార్డులు, ప్రేక్షకుల ప్రశంసలు గెలుచుకున్న సోనూ ఇప్పుడు తన గొప్ప మనసుకు, మానవత్వానికి జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రశంసలతోపాటు తాజాగా యూఎన్‌డీపీ అవార్డును అందుకున్నారు. బాలీవుడ్‌లో చాలాకొద్దిమందికి మాత్రమే దక్కిన అరుదైన గౌరవాన్ని ఇప్పుడు సోనూ అందుకోవడం విశేషం. విదేశాలలో చిక్కుకున్న వేలాదిమంది విద్యార్థులకు సహాయం, చిన్న పిల్లలకు ఉచిత విద్య, వైద్య సదుపాయాలు, కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో అవసరమైన వారికి ఉచిత ఉపాధి అవకాశాలను కల్పించడం లాంటి అనేక సేవలకుగాను ఆయన ఈ గౌరవాన్ని దక్కించుకున్నారు.



సోమవారం సాయంత్రం జరిగిన వర్చువల్ వేడుకలో ఈ అవార్డును ప్రదానం చేశారు. దీంతో ఆయనకు సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. హాలీవుడ్ నటులు ఏంజెలీనా జోలీ, లియోనార్డో డికాప్రియో, ఎమ్మా వాట్సన్, లియామ్ నీసన్, నోబెల్ బహుమతి గ్రహీత ఫుట్ బాల్ లెజెండ్ డేవిడ్ బెక్హాం, బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా లాంటి వారిని ఐక్యరాజ్యసమితి పలు అవార్డులతో సత్కరించిన సంగతి తెలిసిందే..



ఇది అరుదైన గౌరవమనీ, యూఎన్ఓ గుర్తింపు తనకు చాలా ప్రత్యేకమైందంటూ సోనూ సూద్ సంతోషం వ్యక్తం చేశారు. తన దేశీయుల కోసం తనకున్న దాంట్లో తాను చేసిన చిన్న సాయమని పేర్కొన్నారు. 2030 నాటికి పేదరికం, ఆకలి, లింగ వివక్ష నిర్మూలన లాంటి 17 సమగ్ర అభివృద్ధి లక్ష్యాలు (ఎస్‌డీజీ) సాధనలో యుఎన్‌డీపీకి తన మద్దతు పూర్తిగా ఉంటుందన్నారు. కాగా సోనూ సూద్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో ‘అల్లుడు అదుర్స్’ షూటింగులో పాల్గొంటున్నారు.