Seetha Kalyana Vaibhogame : ‘సీతా కళ్యాణ వైభోగమే’ మూవీ రివ్యూ.. లేచిపోయిన జంట మళ్ళీ ఊరికి తిరిగొస్తే..

లేచిపోయిన ఓ ప్రేమ జంట మళ్ళీ హీరో తండ్రి చివరి కోరిక కోసం తమ ఊరికి తిరిగొస్తే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు అనే కథాంశంతో..

Seetha Kalyana Vaibhogame : ‘సీతా కళ్యాణ వైభోగమే’ మూవీ రివ్యూ.. లేచిపోయిన జంట మళ్ళీ ఊరికి తిరిగొస్తే..

Suma Tej Garima Chouhan Seetha Kalyana Vaibhogame Movie Review & Rating

Seetha Kalyana Vaibhogame Movie Review : సుమన్ తేజ్, గరీమ చౌహన్ జంటగా డ్రీమ్ గేట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాచాల యుగంధర్ నిర్మాణంలో సతీష్ పరమవేద దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘సీతా కళ్యాణ వైభోగమే’. పలు సినిమాల్లో హీరోగా నటించిన గగన్ విహారి ఈ సినిమాలో విలన్ గా నటించాడు. సీతా కళ్యాణ వైభోగమే సినిమా జూన్ 21న విడుదల అయింది.

కథ విషయానికొస్తే.. దేవరకద్ర అనే ఊళ్ళో గుడి ధర్మకర్త జానకి రామయ్య(నాగినీడు), ఊరి పాఠశాలలో మూర్తి(శివాజీరాజా) అనే టీచర్ ఉంటారు. ఒకరంటే ఒకరికి మంచి అభిప్రాయమే ఉంటుంది. మూర్తి కొడుకు రామ్(సుమన్ తేజ్), జానకి రామయ్య కూతురు సీత(గరీమా చౌహన్) ప్రేమించుకుంటారు. మరో పక్క జానకి రామయ్య అల్లుడు రమణ(గగన్ విహారి) ఊళ్ళో రౌడీ ఇజం చలాయిస్తూ అమ్మాయిలను బలవంతం చేస్తూ ఉంటాడు. సీతని ఎప్పటికైనా తనే పెళ్లి చేసుకునేది అని రమణ అనుకుంటుండగా వీరి ప్రేమ విషయం తెలిసి ఇంట్లో పెళ్లి సెట్ చేసుకుంటాడు.

ఇది తెలిసి మూర్తి తన కొడుకు ప్రేమ కోసం జానకి రామయ్య వద్దకు వెళ్లి మాట్లాడగా కోపంతో అవమానిస్తాడు. దీంతో వాళ్ళ పెళ్ళికి ఒప్పుకోరని రామ్ సీత లేచిపోతారు. రాముడి భక్తుడైన జానకి రామయ్య తన సీతను దూరం చేసినందుకు నీకు కూడా సీతని దూరం చేస్తా అని ఊరి గుడిలో సీత విగ్రహాన్ని బయటకి తీసుకొచ్చి గుడిని మూయిస్తారు. కొన్నాళ్ల తర్వాత మూర్తి చావు బతుకుల్లో ఉండటంతో తమ పరువు పోయిన ఆ ఊళ్ళోనే గౌరవంతో చనిపోవాలని కొడుకుని కోరతారు. మరి ఊరికి దూరంగా హ్యాపీగా బతికే రామ్, సీత మళ్ళీ ఆ ఊరికి తిరిగొస్తారా? సీత లేచిపోతే రమణ ఏం చేసాడు? ఆ ఊరి గుడి తెరుచుకుంటుందా? మూర్తి ఆ ఊళ్ళో మళ్ళీ అడుగుపెడతాడా? లేచిపోయిన కూతుర్ని జానకి రామయ్య మళ్ళీ దగ్గరకు తీసుకుంటాడా తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

Also Read : Kalki 2898 AD : క‌ల్కి ట్రైల‌ర్‌.. రామ్‌గోపాల్ వ‌ర్మ ప‌జిల్‌.. గెలిస్తే అక్ష‌రాలా ల‌క్ష మీదే..

సినిమా విశ్లేషణ.. ప్రేమించి లేచిపోవడం, ఆ తర్వాత కొన్నాళ్ళకు పేరెంట్స్ ఒప్పుకోవడం.. అనే కథాంశంతో చాలానే సినిమాలు వచ్చాయి. కానీ ఈ సినిమాలో అదే కథకి గుళ్లో సీత విగ్రహాన్ని తీసుకురావడం, గుడిని మూయించడం అని హీరో – హీరోయిన్ల ప్రేమ కథకి ఆలయానికి లింక్ పెట్టి కొత్తగా రాసుకున్నారు. కానీ స్క్రీన్ ప్లే, సీన్స్ అన్ని పాతవే. ఒక మాములు రెగ్యులర్ కమర్షియల్ సినిమా చూసినట్టే ఉంటుంది.

ఫస్ట్ హాఫ్ రామ్, సీత ప్రేమ, లేచిపోవడం, మూర్తి హాస్పిటల్ లో ఉండి కొడుకుని అడగడం చూపించారు. ఇంటర్వెల్ కి మంచి ఆసక్తి ఉన్న సీన్ ఉన్నా కూడా అది వదిలేసి సింపుల్ గా ఇచ్చేసారు. ఇక సెకండ్ హాఫ్ ఆ ఊరికి రామ్ సీత ఎలా వచ్చారు? ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు? గుడి తెరుచుకుందా అని కథని నడిపించారు. కొన్ని చోట్ల కామెడీ ట్రై చేసారు కానీ వర్కౌట్ అవ్వలేదు. క్లైమాక్స్ లో మాత్రం తండ్రి ఎమోషన్ ని బాగానే పండించారు. సినిమాకు ఈ టైటిల్ ఎందుకు పెట్టారో డైరెక్టర్ కే తెలియాలి. సెకండ్ హాఫ్ లో శ్రీరామ నవమి ఉత్సవాలు అని ఏదేదో చేసారు, ఆ ఉత్సవాల్లో ఐటెం సాంగ్ కూడా పెట్టడం గమనార్హం.

నటీనటుల పర్ఫార్మెన్స్.. కొత్త హీరో సుమన్ తేజ ఓకే అనిపించాడు. అచ్చ తెలుగు పల్లెటూళ్ళో జరిగే కథ కావడంతో ఎవరైనా తెలుగు అమ్మాయిని హీరోయిన్ గా పెడితే బాగుండేది. గరీమా చౌహన్ బాగానే నటించినా తెలుగమ్మాయి లక్షణాలు మాత్రం ఎక్కడా కనిపించలేదు. ఇక విలన్ గా మాత్రం గగన్ విహారి బాగానే నటించాడు. ఇటీవల గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో కూడా నెగిటివ్ రోల్ లో మెప్పించిన గగన్ ఇప్పుడు మరోసారి విలన్ పాత్రలో మెప్పించాడు. భవిష్యత్తులో గగన్ కి విలన్ గా మంచి పాత్రలు పడే అవకాశం ఉంది. తండ్రి పాత్రల్లో నాగినీడు, శివాజీ రాజా మంచి ఎమోషన్ ని పండించారు.

సాంకేతిక విషయాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ మాత్రం కలర్ ఫుల్ గా బాగున్నాయి. పల్లెటూళ్ళో మంచి మంచి లొకేషన్స్ లో షూట్ చేసారు. సాంగ్స్ పర్వాలేదనిపిస్తాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఓకే అనిపిస్తుంది. కథ, కథనం పాతవే. నిర్మాణ పరంగా మాత్రం సినిమాకు బాగానే ఖర్చు పెట్టినట్టు తెరపై కనిపిస్తుంది. దర్శకుడిగా సతీష్ ఓకే అనిపించాడు.

మొత్తంగా ‘సీతా కళ్యాణ వైభోగమే’ లేచిపోయిన ఓ ప్రేమ జంట మళ్ళీ హీరో తండ్రి చివరి కోరిక కోసం తమ ఊరికి తిరిగొస్తే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు అనే కథాంశంతో చూపించారు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.