ఆదివారం గొల్లపూడి అంత్యక్రియలు : అప్పటి వరకు భౌతికకాయం ఆస్పత్రిలోనే

  • Published By: madhu ,Published On : December 12, 2019 / 09:42 AM IST
ఆదివారం గొల్లపూడి అంత్యక్రియలు : అప్పటి వరకు భౌతికకాయం ఆస్పత్రిలోనే

Updated On : December 12, 2019 / 9:42 AM IST

ప్రముఖ నటుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి గొల్లపూడి మారుతీరావు (80) కన్నుమూశారు. చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ..2019, డిసెంబర్ 12వ తేదీ గురువారం మధ్యాహ్నం కన్నుమూశారు. ఈయన మృతికి సినీ, రాజకీయ, ఇతర రంగాలకు చెందిన వారు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే..ఆయన అంత్యక్రియలు చెన్నైలో 2019, డిసెంబర్ 15వ తేదీ ఆదివారం మధ్యాహ్నం జరుగుతాయని కుటుంబసభ్యులు వెల్లడించారు.

కుటుంబీకులు, బంధువులు విదేశాల్లో ఉంటున్నారు. వీరు వచ్చేంత వరకు ఆస్పత్రిలోనే మృతదేహాన్ని ఉంచనున్నట్లు గొల్లపూడి కుమారుడు మీడియాకు వెల్లడించారు. సినీ ప్రముఖులు, అభిమానులు భౌతికకాయాన్ని సందర్శించేందుకు శనివారం సాయంత్రం నుంచి అనుమతినిస్తామని తెలిపారు. అనంతరం గొల్లపూడి భౌతికకాయాన్ని నివాసానికి తరలిస్తామన్నారు. 

చిరంజీవి కథానాయకుడిగా, కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య చిత్రంతో.. నటుడిగా సినీ రంగప్రవేశం చేశారు గొల్లపూడి. ఆ చిత్రానికి మాటల రచయితగా కూడా పనిచేశారు. చిన్న వయసులోనే రాఘవ కళానికేతన్‌ పేరున నాటక బృందాన్ని నడిపారు గొల్లపూడి. ఆడది, కుక్కపిల్ల దొరికింది, స్వయంవరం, రిహార్సల్స్, వాపస్, మహానుభావాలు, నాటకాలకి నిర్మాణం, దర్శకత్వం వహించడంతో పాటు.. ప్రధాన పాత్రధారిగా కూడా నటించారు.

విద్యార్థి దశలో ఉండగానే స్నానాలగది, మనస్తత్వాలు నాటకంలోనూ అభినయించారు మారుతీరావు. అప్పట్లో చైనా ఆక్రమణపై తెలుగులో మొట్టమొదటి నాటకం వందేమాతరంని రచించి చిత్తూరు, మదనపల్లె, నగరిలో ప్రదర్శించారు. అలా వాటి ద్వారా వచ్చిన 50 వేల నిధుల్ని.. ప్రధాన మంత్రి రక్షణ నిధికి అందజేశారు.

ఆ నాటకాన్ని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సమాచార శాఖ ప్రచురించింది. అప్పటి విదేశీ వ్యవహారాల శాఖమంత్రి పీవీ నరసింహారావు దానికి ఉపోద్ఘాతం కూడా రాశారు. 1959 డిసెంబరు 16న రాగరాగిణి అనే నాటకాన్ని అప్పటి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌ ఎదుట ప్రదర్శించారు గొల్లపూడి. ఆ తర్వాత పథర్‌ కే అన్సూ అనే పేరుతో హిందీలోకి అనువదించారు.

Read More : గొల్లపూడి మారుతీరావు..జీవన ప్రయాణం