‘చారి 111’ మూవీ రివ్యూ.. స్పై కామెడీతో వెన్నెల కిషోర్ నవ్వించాడా..

స్టార్ కమెడియన్ గా వెన్నెల కిషోర్ హీరోగా పరిచయం అవుతూ ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చిన సినిమా 'చారి 111'. స్పై కామెడీ జానర్ లో రూపొందిన ఈ సినిమా రివ్యూ ఏంటి..?

‘చారి 111’ మూవీ రివ్యూ.. స్పై కామెడీతో వెన్నెల కిషోర్ నవ్వించాడా..

Vennela Kishore Telugu new spy comedy movie Chaari 111 Review

Chaari 111 Review : టాలీవుడ్ లో స్టార్ కమెడియన్ గా ఎదిగిన వెన్నెల కిషోర్.. ఇప్పుడు హీరోగా పరిచయం అవుతూ ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చిన సినిమా ‘చారి 111’. స్పై కామెడీ జానర్ లో రూపొందిన ఈ సినిమాలో సంయుక్త హీరోయిన్ గా నటిస్తుండగా సత్య, మురళి శర్మ ముఖ్య పాత్రలు పోషించారు. కీర్తి కుమార్ దర్శకత్వంలో బర్కత్ స్టూడియోస్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా నేడు రిలీజ్ అయ్యింది. టీజర్, ట్రైలర్స్ తో ఆకట్టుకున్న ఈ సినిమా థియేటర్ లో ఎలా అనిపించింది..?

కథ విషయానికొస్తే.. దేశంలో జరిగే కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ నుంచి దేశాన్ని కాపాడటానికి ముఖ్యమంత్రి ఓ రిటైర్డ్ ఆర్మీ ప్రసాద్ రావు(మురళి శర్మ) నేతృత్వంలో రుద్రనేత్ర ఏజెన్సీని స్థాపిస్తారు. ఓ సారి హైదరాబాద్ లో వరుసగా సూసైడ్ బాంబు అటాక్స్ జరుగుతాయి. ఈ మిషన్ ని డీల్ చేయడానికి ఏజెంట్స్ ఎవరూ ఖాళీగా లేకపోవడంతో ప్రసాద్ రావు చారిని(వెన్నెల కిషోర్)ని ఈ కేసుకి అపాయింట్ చేస్తారు. ఈ కేసు పని మీద శ్రీనివాస్(బ్రహ్మాజీ) అనే ఓ బిజినెస్ మ్యాన్ ని పట్టుకోడానికి వెళ్తే అక్కడ ఏజెంట్ ఈషా(సంయుక్త) చారి చేయాల్సిన పని ఓ సూట్ కేసుని దొంగలించి తీసుకుతుంది. దాంట్లో ఓ క్యాప్సుల్ ఉంటుంది. ఆ క్యాప్సూల్ వేసుకున్న కొన్ని సెకండ్స్ కే మనిషి బాంబ్ లా మారి పేలిపోతాడని తెలుస్తుంది.

దీంతో ప్రసాద్ రావుకి గతంలో దేశద్రోహం కేసులో తాను చంపినా ఓ కెమికల్ ఇంజనీర్ గుర్తొచ్చి ఈ పని వాళ్ళ అబ్బాయే చేసి ఉంటాడు అని అంచనాకు వస్తాడు. అసలు ఈ పిల్స్ తయారుచేసేది ఎవరు? ఆ కెమికల్ ఇంజనీర్ కథేంటి? సీరియస్ ఇష్యూలను సిల్లీగా మార్చేసే చారిని అసలు ఏజెంట్ గా ఎలా తీసుకున్నారు? చారి ఈ కేసుని ఎలా డీల్ చేసాడు. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ లు ఏంటి? ఆ పిల్స్ బాంబ్స్ గా ఎలా మారుతున్నాయి.. ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

Also read : ‘ఆపరేషన్ వాలెంటైన్’ మూవీ రివ్యూ.. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సత్తా చూపించిన సినిమా..

సినిమా విశ్లేషణ..
స్పై కామెడీ సినిమాలు మన దగ్గర తక్కువ కానీ హాలీవుడ్ లో బాగానే వర్కౌట్ అవుతాయి. ఆ జోనర్ లో వెన్నెల కిషోర్ ని హీరోగా తీసుకొని ఈ చారి 111 సినిమా తెరకెక్కింది. ఫస్ట్ హాఫ్ అంతా రుద్రనేత్ర ఏజెన్సీ, బాంబ్ బ్లాస్ట్ లు, చారి చేసే కామెడీతో సాగిపోతుంది. ఇంటర్వెల్ కి ఈ క్యాప్సూల్స్ తయారుచేసే అతన్ని ఎలా పట్టుకుంటారు అనే ఇంటరెస్టింగ్ ఎలిమెంట్ వస్తుంది. ఇక సెకండ్ హాఫ్ లో చారి, అతని టీం విలన్ ని ఎలా పట్టుకున్నారు అనే దానిపై సాగుతుంది.

అయితే స్పై కామెడీ అని చెప్పారు కానీ ఇది మరీ ఓవర్ కామెడీ అయిపొయింది. సీరియస్ సీన్స్ లో కూడా అక్కర్లేని కామెడీ ఉండడం కొంచెం ఇబ్బందిని కలిగిస్తుంది. వెన్నెల కిషోర్, సత్య, తాగుబోతు రమేష్ కలిసి చేసే కామెడీ బానే ఉన్నా కొన్ని సీన్స్ లో మాత్రం ఓవర్ గా అనిపిస్తుంది. సీక్రెట్ ఏజెన్సీ, దేశం సమస్యలు అని సీరియస్ కథనం నడుస్తున్నప్పుడు చారి చేసే ఓవర్ కామెడీ కొన్ని చోట్ల కన్విన్సింగ్ గా అనిపించదు. సెకండ్ హాఫ్ లో ట్విస్ట్ బాగుంటుంది, కథనం కూడా ఆసక్తిగా సాగుతుంది.

నటీనటులు..
వెన్నెల కిషోర్ ఇప్పటికే కమెడియన్ గా అందర్నీ మెప్పించాడు. ఈ సినిమాలో హీరో అని చెప్పినా ఇక్కడ కూడా కమెడియన్ గానే చూపించారు. హీరోయిన్ గా నటించిన సంయుక్త విశ్వనాథం యాక్షన్ సీన్స్ లో అదరగొట్టేసింది. మురళి శర్మ, రాహుల్ రవీంద్రన్, పావని రెడ్డి తమ పాత్రల్లో మెప్పించారు. తాగుబోతు రమేష్, సత్య.. కూడా కామెడీతో అలరిస్తారు.

సాంకేతిక అంశాలు..
సినిమాకి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా ప్లస్ అయింది. జేమ్స్ బాండ్ సినిమాల తరహాలో మ్యూజిక్ అదరగొట్టారు. సినిమాటోగ్రఫీ పరంగా కూడా మంచి విజువల్స్ తో చూపించారు. మాములు కథే అయినా దానికి క్యాప్సుల్ బాంబ్ గా మారే కొత్త పాయింట్ ని యాడ్ చేసి కథనాన్ని ఆసక్తిగా చూపించారు. స్క్రిప్ట్ లో కొంచెం కామెడీ ఇంకా క్లియర్ గా రాసుకుంటే బాగుండు అనిపిస్తుంది. దర్శకుడిగా కీర్తి కుమార్ ఓకే అనిపించాడు.

మొత్తానికి చారి 111 సినిమా సీరియస్ ఆపరేషన్స్ లో ఓ ఏజెంట్ చేసే కన్ఫ్యూజన్ కామెడీ సినిమా. కాసేపు నవ్వుకోవచ్చు అంటే థియేటర్ కి వెళ్లి చారి 111 సినిమా చూసేయొచ్చు. ఈ సినిమాకు రేటింగ్ 2.75 ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.