Chhaava : సూపర్ హిట్ ‘ఛావా’ మూవీ రివ్యూ.. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ తనయుడు శంభాజీ మహారాజ్ కథ..
మొఘల్స్ తో పోరాడి చిత్రహింసలు అనుభవించి వీరమరణం పొందిన మరో మరాఠా యోధుడి కథే ఈ ఛావా.

Vicky Kaushal Rashmika Mandanna Chhaava Movie Review and Rating
Chhaava Movie Review : విక్కీ కౌశల్, రష్మిక మందన్న జంటగా తెరకెక్కిన సినిమా ‘ఛావా’. బాలీవుడ్ లో ఫిబ్రవరి 14న రిలీజయి భారీ విజయం సాధించింది. ఇప్పుడు ఈ సినిమా తెలుగులో గీత్ ఆర్ట్స్ నేడు మార్చ్ 7న థియేటర్స్ లో రిలీజ్ చేసింది. మ్యాడ్ డాక్ ఫిలిమ్స్ బ్యానర్ పై దినేష్ విజయన్ నిర్మాణంలో లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ తనయుడు శంభాజీ జీవిత కథాంశంతో ఛావాని తెరకెక్కించారు.
కథ విషయానికొస్తే.. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మరణించాడని మొఘల్ రాజు ఔరంగజేబు(అక్షయ్ ఖన్నా) సంతోషిస్తాడు. కానీ అంతలోనే శివాజీ తనయుడు శంభాజీ మహారాజా(విక్కీ కౌశల్) ఓ మొఘల్ ప్రాంతాన్ని గెలుస్తాడు. దీంతో శంభాజీని పట్టుకోవాలని, మరాఠాని గెలవాలని, హిందువులు మతం మారకపోతే చంపేయమని ఆదేశిస్తాడు. మరాఠా సామ్రాజ్యాన్ని ఔరంగజేబు సేనలు అన్ని వైపులా ముట్టడిస్తుండగా శంభాజీ కూడా తన సైన్యంతో మొఘల్ సైన్యాన్ని మట్టుపెడుతూ ఉంటాడు.
ఔరంగజేబు శంభాజీ కోసం ఢిల్లీ వదిలి అక్లాజ్ కి వస్తాడు. అదే సమయంలో శంభాజీ మనుషులు ఇద్దరు ఔరంగజేబు మనుషులతో చేతులు కలిపి శంభాజీ ఔరంగజేబుని అంతం చేయాలనే ప్లాన్ ని లీక్ చేస్తారు. దీంతో ముందుగానే ఔరంగజేబు మనుషులు శంభాజీని చుట్టుముడతారు. ఎంతో పోరాడినా శంభాజీని మొఘల్ సైన్యం బంధిస్తారు. ఆ తర్వాత శంభాజీని ఎన్ని చిత్రహింసలు పెట్టారు? శంభాజీ మహారాజ్ ఎలా చనిపోయారు? శంభాజీని పట్టించింది ఎవరు? శంభాజీ తర్వాత మరాఠా రాజు ఎవరు తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
Also Read : Kingston : ‘కింగ్‌స్టన్’ మూవీ రివ్యూ.. సముద్రంలో హారర్ తో భయపెట్టారుగా..
సినిమా విశ్లేషణ.. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ గురించి మనం ఎన్నో కథలు విన్నాం, ఎంతో గొప్పగా చెప్పుకుంటాం. మరాఠా వాళ్ళు అయితే ఆయన్ని దేవుడిగా చూస్తారు. అయితే అయన కొడుకు శంభాజీ మహారాజ్ కూడా మరాఠాలను, హిందువులను మొఘల్స్ నుంచి కాపాడటానికి మొఘల్స్ తో పోరాడి చిత్రహింసలు అనుభవించి వీరమరణం పొందాడని చరిత్ర ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు. ఛావా అంటే సింహం పిల్ల అని అర్ధం.
బాలీవుడ్ లో సూపర్ హిట్ అయింది ఛావా. ఒకప్పటి మరాఠా రాజు గురించి కావడంతో మరాఠా ప్రజలు మరింత కనెక్ట్ అయి ఈ సినిమాని పెద్ద హిట్ చేసారు. ఎమోషన్ కూడా బాగా వర్కౌట్ అవ్వడంతో అన్ని చోట్లా ఛావా మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దీంతో తెలుగులో కూడా ఇప్పుడు రిలీజ్ చేసారు.
ఈ సినిమాని చరిత్ర ఆధారంగా తెరకెక్కించారు. అయితే సినిమాలో శంభాజీ పోరాడే మంచి హై ఎలివేషన్స్ ఉన్నా కాస్త స్లో నేరేషన్ తో సాగుతుంది. చివరి అరగంట మాత్రం శంభాజీ పోరాటం, అతను బంధీ అవ్వడం, అతన్ని చిత్రహింసలు పెట్టడం ఇవన్నీ ప్రేక్షకులకు కన్నీళ్లు తెప్పిస్తాయి. ఏ యుద్ధం ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, ఎవరు ఎప్పుడు కలిశారు అని చరిత్రని బాగా రీసెర్చ్ చేసి కథ రాసుకున్నట్టు అర్ధమవుతుంది. శంభాజీ పోరాట స్ఫూర్తి, ఆయన పడే బాధ అన్ని ఎమోషన్స్ ప్రేక్షకులకు కనెక్ట్ అవుతాయి. యుద్ధ సన్నివేశాలని చక్కగా డిజైన్ చేసి హై ఎమోషన్స్ తో చూపించారు.
నటీనటుల పర్ఫార్మెన్స్.. శంభాజీ మహారాజ్ పాత్రలో విక్కీ కౌశల్ జీవించేసాడు అని చెప్పొచ్చు. ఈ పాత్రకు నేషనల్ అవార్డు వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. రష్మిక మందన్న కూడా శంభాజీ భార్య పాత్రలో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఔరంగజేబు పాత్రలో అక్షయ్ ఖన్నా నెగిటివ్ షేడ్స్ లో అదరగొట్టాడు. మిగిలిన నటీనటులందరూ కూడా వారి పాత్రల్లో మెప్పిస్తారు.
Also Read : Chef Mantra Project K : ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సుమ కనకాల ‘చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ K’ సీజన్ 4
సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ చాలా బాగున్నాయి. యాక్షన్ సీన్స్, యుద్ధ సన్నివేశాలు చాలా బాగా డిజైన్ చేసారు. హిందీలో నటీనటులే డైలాగ్స్ చెప్పడం వల్ల ఎమోషన్ మరింత పండింది. కానీ తెలుగులో డైలాగ్స్ బాగా రాసినా డబ్బింగ్ లో ఆ రేంజ్ ఎమోషన్ తో చెప్పలేకపోయారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదరగొట్టేసారు. పాటలు బాగున్నాయి. ఆర్ట్ డిపార్ట్మెంట్ అప్పటి కోటలు, లొకేషన్స్ చూపించడానికి బాగా కష్టపడ్డారు. దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ శంభాజీ కథని మొఘల్స్ తో పోరాటం నుంచి చనిపోయేవరకు అద్భుతంగా రాసుకొని ఎమోషన్ పండించారు. నిర్మాణ పరంగా కూడా ఈ సినిమాకు చాలానే ఖర్చుపెట్టినట్టు తెలుస్తుంది.
మొత్తంగా ‘ఛావా’ సినిమా ఛత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ పోరాటగాధ. ఈ సినిమాని తప్పకుండా థియేటర్స్ లో చూడాలి. ఈ సినిమాకు 3.5 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ పూర్తిగా విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.