Jathara : ‘జాతర’ మూవీ రివ్యూ.. ఊరి నుంచి అమ్మవారు మాయమయితే..

జాతర సినిమా నాస్తికుడైన ఓ వ్యక్తి ఆ ఊర్లో దేవత విగ్రహం, తన తండ్రిని ఎలా కాపాడాడు అని విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రా అండ్ రస్టిక్ గా చూపించారు.

Jathara : ‘జాతర’ మూవీ రివ్యూ.. ఊరి నుంచి అమ్మవారు మాయమయితే..

Village Back Drop Raw and Rustic Jathara Movie Review and Rating

Updated On : November 8, 2024 / 5:58 PM IST

Jathara Movie Review : సతీష్ బాబు రాటకొండ, దీయారాజ్ జంటగా తెరకెక్కిన సినిమా ‘జాతర’. గల్లా మంజునాథ్ సమర్పణలో మూవీటెక్ ఎల్‌ఎల్‌సి, రాధాకృష్ణ ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్స్ పై రాధాకృష్ణారెడ్డి, శివశంకర్ రెడ్డి నిర్మాణంలో సతీష్ బాబు దర్శకత్వంలో ఈ సినిమాని తెరకెక్కించారు. జాతర సినిమా నేడు నవంబర్ 8న థియేటర్లో రిలీజయింది.

కథ విషయానికొస్తే.. చిత్తూరు జిల్లాలోని ఓ గ్రామంలో ఆలయ పూజారి పాలేటి అమ్మవారిని బతుకుతూ జీవితిస్తుంటాడు. కానీ అతని కొడుకు చలపతి(సతీష్ బాబు) మాత్రం నాస్తికుడు. చలపతి, వెంకటలక్ష్మి (దీయా రాజ్)తో ప్రేమలో పడతాడు. ఊరి పెద్దగా ఉండే గంగిరెడ్డి(ఆర్కే నాయుడు)కు, హీరోకు కొన్ని గొడవలు వస్తాయి. ఓ రోజు పాలేటి కలలోకి అమ్మవారు వచ్చి గ్రామాన్ని దురాచారాల నుంచి రక్షించమని కోరుతుంది. పాలేటి చేసే కొన్ని పనులతో ఊరి వాళ్ళు అతని కుటుంబంతో వైరం పెంచుకుంటారు. ఈ క్రమంలో ఓ రోజు పాలేటి, అమ్మవారిని తీసుకొని మాయమవుతాడు. పాలేటి వల్లే అమ్మవారు ఊరు విడిచి వెళ్లిపోయిందని ఊరు అంతా ఆ కుటుంబాన్ని శత్రువులుగా చూడడం మొదలుపెడతారు.

మరొకపక్క ఇదే సమయం అనుకోని గంగిరెడ్డి చలపతి మీదకు వస్తాడు. అసలు అమ్మవారు, పాలేటి గ్రామం వదిలి ఎందుకు వెళ్లిపోయారు? వాళ్ళ జాడని చలపతి కనిపెట్టడా? గంగిరెడ్డి, చలపతి మధ్య గొడవలు ఏంటి? ఆ ఊరి అమ్మవారి కథేంటి? నాస్తికుడైన చలపతి దేవత విగ్రహాన్ని, వాళ్ళ నాన్నను కాపాడతాడా? గంగిరెడ్డి కుట్రలను చలపతి ఎలా అడ్డుకుంటాడు ఈ క్రమంలో అమ్మవారు చలపతికి ఎలా సహాయపడ్డారు తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

Also Read : Appudo Ippudo Eppudo : ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ మూవీ రివ్యూ.. రుక్మిణి వసంత్ ఫస్ట్ తెలుగు సినిమా ఎలా ఉందంటే..

సినిమా విశ్లేషణ.. గంగావతి గ్రామదేవత, పాలేటి పాత్రలతో సినిమా మొదలవుతుంది. సినిమా మొదలయ్యాక కాస్త స్లోగా సాగినా ప్రీ ఇంటర్వెల్ నుంచి కథ పరిగెడుతుంది. చలపతి, వెంకటలక్ష్మి ప్రేమ, గంగిరెడ్డితో గొడవలతో ఫస్ట్ హాఫ్ సాగదీసి ఇంటర్వెల్ కి అమ్మవారు అదృశ్యమయ్యే ట్విస్ట్ ఇచ్చి నెక్స్ట్ ఏం జరుగుతుందని ఆసక్తి నెలకొల్పుతారు. ఇక సెకండ్ హాఫ్ లో గంగిరెడ్డి, చలపతి మధ్య సన్నివేశాలు, చలపతి తన తండ్రి జాడను వెతకడంతో సాగి క్లైమాక్స్ లో మాత్రం అదిరిపోయే ట్విస్టులు, యాక్షన్ సీక్వెన్స్ లతో చూపించారు. అక్కడక్కడా కాంతార ఫ్లేవర్ కనిపిస్తుంది. అమ్మవారు వచ్చి కాపాడటం అనేది చాలా సినిమాల్లో ఉన్నా ఓ నాస్తికుడికి సపోర్ట్ చేసి ఊరుని కాపాడటం కొత్తగా చూపించారు. మైథలాజి కాన్సెప్ట్ కు లవ్ స్టోరీ, రివెంజ్ యాక్షన్ జోడించి విలేజ్ బ్యాక్ డ్రాప్ లో మాస్ గా చూపించారు. సినిమాలో చాలా మందిని అక్కడి గ్రామంలో లోకల్ వాళ్లనే ఆర్టిస్టులుగా తీసుకోవడం గమనార్హం.

నటీనటుల పర్ఫార్మెన్స్.. సతీష్ బాబు ఓ పక్క హీరోగా నటిస్తూనే మరో పక్క దర్శకుడిగా కూడా చేసి మెప్పించాడు. నటన పరంగా తన బెస్ట్ ఇచ్చాడు. కొన్ని సీన్స్ లో చాలా రస్టిక్ గా నటించారు. దీయారాజ్ పల్లెటూరి అమ్మాయి పాత్రలో పర్వాలేదనిపించింది. ఆర్కే నాయుడు విలన్ పాత్రలో బాగా నటించారు. మిగిలిన నటీనటులు పర్వాలేదనిపించారు. చాలా పాత్రలకు అక్కడి లోకల్ వాళ్లనే, ఆర్టిస్టులు కాని వాళ్ళను తీసుకోవడం గమనార్హం.

సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ పర్వాలేదనిపిస్తాయి. విలేజ్ లొకేషన్స్ ని ఇంకా అందంగా చూపిస్తే బాగుండు అనిపిస్తుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం బాగుంది. చాలా సీన్స్ లో BGM అదిరిపోతుంది. పాటలు యావరేజ్. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఇలా దేవత కాన్సెప్ట్ తో కథ రాసుకొని దర్శకుడిగా మొదటి సినిమానే అయినా ఓ పక్క హీరోగా చేస్తూనే మరో పక్క బాగానే తెరకెక్కించాడు సతీష్ బాబు. నిర్మాణ పరంగా కూడా సినిమాకు కావాల్సినంత బాగానే ఖర్చుపెట్టారు. గ్రాఫిక్స్ విషయంలో కూడా ఇంకా బెటర్ చేయొచ్చు అనిపిస్తుంది.

మొత్తంగా ‘జాతర’ సినిమా నాస్తికుడైన ఓ వ్యక్తి ఆ ఊర్లో దేవత విగ్రహం, తన తండ్రిని ఎలా కాపాడాడు అని విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రా అండ్ రస్టిక్ గా చూపించారు. ఈ సినిమాకు 2.5 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.