Covid-19 Effected : 100 మంది బౌద్ధ సన్యాసులకు కరోనా..ఆధ్యాత్మిక కేంద్రాల్ని కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించిన అధికారులు

Covid 19 Affected
బౌద్ధ సన్యాసులు ఎంత నియమ నిష్టలతో ఉంటారో ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. ఎప్పుడూ ఆధ్యాత్మిక చింతనతో ఉంటారు. అటువంటి బౌద్ధ సన్యాసులను కూడా కరోనా మహమ్మారి వదల్లేదు. బౌద్ధులు ఎక్కువగా ఉండే సిక్కంలో 100మంది బౌద్ధులకు కరోనా సోకింది. వారిలో కరోనా లక్షణాలు కనిపించటంతో పరీక్షలు చేయగా 100మంది పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. సిక్కిం రాజధాని గ్యాంగ్ టక్ కి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న రూమ్ టెక్ కేంద్రంలో మొదట 37 మంది సన్యాసులు కరోనా బారిన పడ్డారు.
ఆ తర్వాత గుంజాంగ్ మోనాస్టరీలో 61 మంది సన్యాసులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో.. బౌద్ధాశ్రమ కేంద్రాలను అధికారులు కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు. కరోనా బారిన పడినవారిని పలు ప్రాంతాల్లోని ఐసొలేషన్ కేంద్రాలకు తరలించి చికిత్సనందిస్తున్నారు.
అలాగే కరోనా కట్టడి చేయటానికి చర్యలు కొనసాగుతున్నాయని..దీంట్లో భాగంగానే ఆధ్యాత్మిక కేంద్రాల్లోకి ఎవరినీ అనుమతించేది లేదని రాజధాని గ్యాంగ్ టక్ డివిజినల్ మేజిస్ట్రేట్ స్పష్టం చేశారు. మరోవైపు సిక్కింలో లాక్ డౌన్ మరోవారం పొడిగించారు. రూమ్ టెక్ కేంద్రానికి ప్రపంచ హెరిటేజ్ సైట్ గా గుర్తింపు ఉంది. దేశ, విదేశాల నుంచి వేలాది మంది బౌద్ధ సన్యాసులు ఈ కేంద్రానికి వస్తుంటారు. వీరి ద్వారానే ఇక్కడి సన్యాసులకు కరోనా సోకి ఉంటుందని భావిస్తున్నారు.
కాగా సిక్కింలోనే ఆదివారం ఒక్కరోజే 324 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో కేసుల సంఖ్య 1132కు చేరింది. ఆదివారం ముగ్గురు కరోనాతో మరణించగా..రాష్ట్రంలో మరణాల సంఖ్య 224కు చేరుకుందని ఆరోగ్యశాఖ తెలిపింది.