కశ్మీర్ లో విదేశీ ప్రతినిధుల బృందం పర్యటన

15 మంది విదేశీ ప్రతినిధులు ఇవాళ(జనవరి-9,2020) కశ్మీర్‌లో పర్యటిస్తున్నారు. కశ్మీర్‌లో శాంతియుత వాతావరణం నెలకొన్నదన్న విషయాన్ని చెప్పేందుకు ప్రభుత్వం విదేశీ ప్రతినిధులను ఆహ్వానించింది. ప్రతినిధుల బృందంలో అమెరికా, దక్షిణకొరియా, మొరాకో, నైగర్, నైజీరియా, గుయానా, అర్జెంటీనా, నార్వే, ఫిలిప్పీన్స్, మాల్దీవులు, టోగో, ఫిజి, పెరూ, బంగ్లాదేశ్, వియత్నాం దేశాలవాళ్లు ఉన్నారు.
కొత్తగా ఏర్పడిన కేంద్రపాలిత ప్రాంతం కశ్మీర్ లో వాస్తవ పరిస్థితులు తెలుసుకునేందుకు రెండురోజుల పాటు ఈ బృందం కశ్మీర్ లో పర్యటిస్తుంది. జమ్మూకశ్మీర్ కు చెందిన రాజకీయ నాయకులు గులాం హసన్ మీర్, అల్తాఫ్ బుఖారీ, షోయబ్ ఇక్బాల్ లోన్, హిలాల్ అహ్మద్ షా, నూర్ మొహద్ షేక్, అబ్దుల్ మజీద్ పాడర్, అబ్దుల్ రహీమ్ రాథర్ మరియు రఫీ అహ్మద్ మీర్ వంటి వాళ్లను 15 మంది విదేశీ ప్రతినిధులు కలుస్తున్నారు. గత ఏడాది కశ్మీర్‌లో ఆర్టికల్ 370ని ఎత్తివేసిన తర్వాత కొంత ఉద్రిక్తత నెలకొన్నది. అయితే ప్రస్తుతం అక్కడ ప్రశాంత వాతావరణం నెలకొన్నదని ప్రభుత్వం తెలిపింది. జమ్మూకశ్మీర్ ని సందర్శించే విదేశీ ప్రతినిధి బృందంలో పాల్గొనడానికి యూరోపియన్ యూనియన్ దౌత్యవేత్తలు నిరాకరించారని వస్తున్న రిపోర్టులపై స్పందించిన విదేశాంగ శాఖ ప్రతినిధి రవీష్ కుమార్..వాళ్లు ఇది ఒక గైడెడ్ టూర్ అని అనుకున్నారన్నారు.
జమ్మూకశ్మీర్ లో సెక్యూరిటీ పరిస్థితిని తెలుసుకునేందుకు సెక్యూరిటీ అధికారులతో మొదటగా 15మంది విదేశీ ప్రతినిధుల బృందం భేటీ అవుతుందని రవీష్ కుమార్ తెలిపారు. అక్టోబర్-31,2019 నుంచి అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా జమ్మూకశ్మీర్,అసెంబ్లీ లేని కేంద్రపాలిత ప్రాంతంగా లఢఖ్ అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆర్టికల్ 370రద్దు సమయంలో ప్రభుత్వం విధించిన పలు ఆంక్షలను ఒక్కొక్కటిగా తొలగిస్తూ వస్తున్న విషయం తెలిసిందే.