ఆరోజు పీవీ వినలేదు: సిక్కుల ఊచకోతపై మన్మోహన్ సంచలన కామెంట్

  • Published By: vamsi ,Published On : December 5, 2019 / 06:30 AM IST
ఆరోజు పీవీ వినలేదు: సిక్కుల ఊచకోతపై మన్మోహన్ సంచలన కామెంట్

Updated On : December 5, 2019 / 6:30 AM IST

1984 సిక్కు అల్లర్లు జరిగిన సమయంలో అప్పటి హోంమంత్రి పీవీ నరసింహారావు మాజీ ప్రధాని ఐకే గుజ్రాల్ సలహాలు తీసుకుని ఉంటే ఆ అల్లర్లే జరిగేవి కాదని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. ఐకే గుజ్రాల్ శత జయంతిని పురస్కరించుకొని మాజీ ప్రధాని మన్మోహన్ ప్రసంగం చేశారు. 

ఈ సంధర్భంగా.. ఆయన మాట్లాడుతూ గుజ్రాల్‌తో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. గుజ్రాల్‌ జీ, తాను ఒకే జిల్లాలో పుట్టామని, రాజకీయాల్లో చాలా ఏళ్లు కలిసి పని చేసినట్లు తెలిపారు. ఇక 1984లో సిక్కు వ్యతిరేక అల్లర్లు జరుగుతున్న సమయంలో గుజ్రాల్‌ జీ.. అప్పటి హోంమంత్రిగా ఉన్న పీవీ నరసింహరావు ఇంటికి వెళ్లారు. పరిస్థితి చేయిదాటిపోతుందని హెచ్చరించారు. వీలైనంత త్వరగా ప్రభుత్వం ఆర్మీని పిలవాల్సిన అవసరం ఉందని చెప్పారు. గుజ్రాల్‌ సలహాపై పీవీ అప్పుడే శ్రద్ధ పెట్టి ఉంటే సిక్కు వ్యతిరేక అల్లర్లు, ఊచకోత జరగేవి కాదు అని అన్నారు మన్మోహన్‌ సింగ్.

1984 అక్టోబరు 31న అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీపై ఆమె వ్యక్తిగత కాపాలదారులు దారుణ హత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన తర్వాత దేశవ్యాప్తంగా అల్లర్లు, సిక్కుల ఊచకోత జరిగాయి. ఈ ఘటనల్లో 3వేల మంది చనిపోయారు. దీనికి కారణం అప్పటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ అనే ఆరోపణలు ఉన్నాయి. అయితే లేటెస్ట్‌గా మన్మోహన్ సింగ్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

ఐకే గుజ్రాల్‌ 1997-98 మధ్య భారత ప్రధానిగా పనిచేశారు. అయితే 1998లో సంకీర్ణ ప్రభుత్వానికి కాంగ్రెస్‌ మద్దతు విరమించుకోవడంతో ప్రభుత్వం కూలిపోయింది. గుజ్రాల్‌ ప్రధాని పదవి నుంచి తప్పుకున్నారు. అనారోగ్య కారణాలతో 2012 నవంబరు 30న గుజ్రాల్ కన్నుమూశారు.