రెండు రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు…23 మంది పంజాబ్ ఎమ్మెల్యేలకు కరోనా

మరో రెండు రోజుల్లో పంజాబ్ లో అసెంబ్లీ సమావేశాలు జరగనుండగా 23 మంది ఎమ్మెల్యేలు, మంత్రులకు కరోనా పాజిటివ్ సోకింది. రాష్ట్రంలోని మొత్తం 117 ఎమ్మెల్యేల్లో 23 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ఆ రాష్ట్ర సీఎం అమరీందర్ సింగ్ తెలిపారు. శుక్రవారం ఒక రోజు అసెంబ్లీ నిర్వహణ నేపథ్యంలో ప్రభుత్వం ఎమ్మెల్యేలందరికీ కరోనా పరీక్షలు నిర్వహించగా ఈ విషయం తెలిసిందన్నారు.
కరోనా నెగిటివ్ సర్టిఫికెట్ ఉన్నవారినే అసెంబ్లీలోకి అనుమతిస్తామని ఆయన చెప్పారు. నీట్, జేఈఈ పరీక్షలను నిర్వహించాలన్న కేంద్రం నిర్ణయంపై శాసన సభలో చర్చ జరగవలసి ఉందన్నారు. ఇంత భారీ సంఖ్యలో మంత్రులు, ఎమ్మెల్యేలకు కరోనా సోకితే.. ఇక సాధారణ ప్రజల సంగతిని ఊహించవచ్చన్నారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితి చాలా దారుణంగా ఉన్నదని సీఎం అమరీందర్ సింగ్ అన్నారు.
బుధవారం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆధ్వర్యంలో జరిగిన బీజేపీయేతర ఏడు రాష్ట్రాల సీఎంల ఆన్‌లైన్ సమావేశంలో ఈ మేరకు ఆయన వెల్లడించారు. కాగా, ఈ కరోనా తరుణంలో నీట్, జేఈఈ పరీక్షలను వాయిదా వేసేందుకు అన్ని పార్టీలు కలిసికట్టుగా సుప్రీంకోర్టులో పోరాడవలసిన సమయం ఆసన్నమైందని ఆయన చెప్పారు.
లక్షలాది విద్యార్థులకు ముప్పుగా పరిణమించిన ఈ కొవిడ్ సమయంలో ఈ పరీక్షలను కేంద్రం తప్పక వాయిదా వేయాలని ఆయన కోరారు. అటు కాంగ్రెస్ తాత్కాలిక అధినేత్రి సోనియా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతోను, ఇతర కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతోను కలిసి న్యాయ పోరాటం చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.