సరిహద్దులో పాక్ కాల్పులు…ముగ్గురు జవాన్లు మృతి

3 Army jawans killed మరోసారి సరిహద్దు ఎల్ఓసీ వెంబడి పాక్ బరి తెగించింది. పాకిస్తాన్ సైనికులు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కాల్పులకు తెగబడ్డారు. జమ్ముకశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంట వేర్వేరు ప్రాంతాల్లో పాక్ సైనికులు జరిపిన షెల్లింగ్ లో ముగ్గురు భారత జవాన్లు మృతిచెందారు. మరో ఐదుగురు గాయపడ్డారు.
ఉత్తర కశ్మీర్ లోని కుప్వారా జిల్లాలోని నౌగామ్ సెక్టార్ లో పాకిస్తాన్ సైన్యం మోర్టార్ల కాల్పులకు తెగబడటంతో ఇద్దరు సైనికులు మరణించగా, మరో నలుగురు గాయపడినట్లు రక్షణశాఖ ప్రతినిధి తెలిపారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తరలించినట్లు చెప్పారు. అంతకుక్రితం పూంచ్ సెక్టార్ లో కాల్పుల విరమణను ఉల్లంఘించి పాక్ జరిపిన దాడిలో ఓ జవాను మరణించగా మరొక జవాను గాయపడ్డాడు.
భారత ఔట్‌పోస్టులను లక్ష్యంగా చేసుకుని పాక్ సైనికులు మోర్టార్లను ప్రయోగిస్తున్నారు. ప్రతీగా భారత సైన్యం తగు సమాధానం ఇస్తున్నట్లు సైనికాధికారులు తెలిపారు. కాగా, గడిచిన ఎనిమిది నెలల్లో పాకిస్తాన్ 3 వేల సార్లకు పైగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. గత 17 ఏళ్లలో ఇంత పెద్ద మొత్తంలో ఈ ఏడాదే అత్యధికం. 2003లో భారత్-పాక్ దేశాలు నియంత్రణ రేఖ వెంబడి కాల్పుల విరమణకు అంగీకరించిన విషయం తెలిసిందే.