కరోనా బారినపడ్డ 4 నెలల చిన్నారి మృతి, ఎలా సోకిందో తెలుసుకునే పనిలో డాక్టర్లు

కేరళలో విషాదం చోటు చేసుకుంది. కరోనాతో 4 నెలల చిన్నారి మృతి చెందింది. గుండె సంబంధిత సమస్యలతో కోజికోడ్‌లోని కోజికోడ్ మెడికల్ కాలేజి హాస్పిటల్‌లో ఏప్రిల్ 21న చిన్నారిని అడ్మిట్ చేశారు. చికిత్స పొందుతున్న చిన్నారికి న్యుమోనియా లక్షణాలు ఉండడంతో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు అధికారులు. వైద్యపరీక్షల్లో చిన్నారికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. తాజాగా చిన్నారి ఆరోగ్యం క్షీణించి శుక్రవారం(ఏప్రిల్ 24,2020) ఉదయం మరణించింది.
పాపకు కరోనా ఎలా సోకింది?
అయితే ఆ పాపకు కరోనా ఎలా సోకిందో ఇప్పటికీ అంతుబట్టడం లేదని డాక్టర్లు తెలిపారు. పాపకు కరోనా ఎలా సోకిందనే మిస్టరీని చేధించే పనిలో ఉన్నారు. ఆ చిన్నారికి చికిత్స అందించిన ఐదుగురు డాక్టర్లు, ఆ పాప తల్లిదండ్రులను క్వారంటైన్‌కు తరలించామని ఆరోగ్య శాఖ మంత్రి కేకే శైలజ తెలిపారు. వారికి కరోనా పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు.
దేశంలో 23వేలు దాటిక కరోనా కేసులు:
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కట్టడిలో ముందున్న కేరళలో ఇప్పటివరకు ముగ్గురు మరణించారు. రాష్ట్రంలో మొత్తం 447 పాజిటివ్ కేసులు నమోదు కాగా ఇప్పటికే 324మంది కోలుకున్నారు. మన దేశంలో కరోనా బారినపడ్డవారి సంఖ్య 23వేలు దాటింది. 718మంది మరణించారు. 5వేల మంది కరోనా నుంచి కోలుకున్నారు.
సత్ఫలితాలిస్తున్న ప్లాస్మా థెరపీ:
కరోనా చికిత్సలో భాగంగా ఢిల్లీలో ప్రయోగాత్మకంగా చేపట్టిన ప్లాస్మా ట్రయల్స్ సత్ఫలితాలిస్తున్నట్లు ప్రభుత్వం ప్రాథమిక అంచనాకు వచ్చింది. ఈ పద్ధతి ద్వారా కరోనా సోకిన వ్యక్తులకు చికిత్స చేసేందుకు గతవారమే కేంద్రం నుంచి అనుమతి పొందింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని ఆప్ ప్రభుత్వం వెల్లడించింది. ప్లాస్మా థెరపీ అంటే, కరోనా వైరస్ సోకి కోలుకున్న వ్యక్తుల నుంచి రక్తాన్ని సేకరించి బాధితులకు ఎక్కిస్తారు. ఆ విధంగా యాంటీబాడీస్ అభివృద్ధి చెంది రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వెంటిలేటర్ పై ఉన్న కరోనా బాధితులకు మాత్రమే ప్లాస్మా థెరపీ కింద చికిత్స ఇస్తారు.
ప్రపంచవ్యాప్తంగా 27.15లక్షల కరోనా కేసులు, 7.45లక్షల మరణాలు:
ప్రపంచవ్యాప్తంగా 27లక్షల 15వేల మంది కరోనా బారిన పడ్డారు. ప్రపంచవ్యాప్తంగా కొత్తగా 83వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా నిన్న(ఏప్రిల్ 23,2020) ఒక్కరోజే కరోనాతో 6వేల 300మందికిపైగా మరణించారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు లక్షా 90వేల మందికిపైగా మరణించారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా నుంచి 7లక్షల 45వేల మంది కోలుకున్నారు.
అమెరికాలో 8.79లక్షల కరోనా కేసులు, 49వేల మరణాలు:
అమెరికాలో కరోనా విలయతాండవం చేస్తోంది. అమెరికాలో 8లక్షల 79వేల మంది కరోనా బారినపడ్డారు. అక్కడ కొత్తగా 30వేల 713 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అమెరికాలో ఇప్పటివరకు 49వేల 769మంది కరోనాతో చనిపోయారు. అమెరికాలో ఇప్పటివరకు 85వేల మందికిపైగా కరోనా నుంచి కోలుకున్నారు.