దేశాన్ని నలుగురే నడిపిస్తున్నారు..ప్రధాని మనకిచ్చిన ఆప్షన్లు నిరుద్యోగం,ఆకలి,ఆత్మహత్య

Rahul Gandhi పార్లమెంట్ వేదికగా కేంద్రప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ప్రధానమంత్రి నరేంద్రమోడీ దేశాన్ని “హమ్ దో హమారో దో(మేము ఇద్దరం..మాకు ఇద్దరు)”అనే సిద్దాంతో నడిపిస్తున్నారని రాహుల్ విమర్శించారు. నోట్లరద్దు,జీఎస్టీ,లాక్ డౌన్ మరియు ఇటీవల తీసుకొచ్చిన సాగు చట్టాల విషయంలో ఈ సిద్దంతామే పనిచేసినట్లు రాహుల్ పేర్కొన్నారు. ఫ్యామిలీ ఫ్లానింగ్ కోసం తమ హయాంలో “మేము ఇద్దరం,మాకు ఇద్దరు” అనే పదాన్ని వాడామని..అయితే ప్రస్తుత మోడీ ప్రభుత్వం ఆ నినాదానికి కొత్త అర్థమిచ్చిందని అన్నారు. నలుగురు వ్యక్తులే దేశాన్ని నడిపిస్తున్నారని అన్నారు. ఆ నలుగురు ఎవరో ప్రతి ఒక్కరికి తెలుసునన్నారు.
ఇక రైతుల ఆందోళనపై రాహుల్ మాట్లాడుతూ..మీరందరూ ఇది రైతుల నిరసన అని భావిస్తున్నారు,కానీ మీరందరూ చాలా పొరబడుతున్నారు.ఇది భారతదేశపు ఆందోళన..కేవలం రైతులు దారి తీస్తున్నారు అంతే. చాలా మందికి బతుకు పోరాటం కూడా ఇది. నూతన చట్టాలు..రైతులను దెబ్బతీయడమే కాకుండా మధ్యవర్తులను ఫినిష్ చేస్తుందని మరియు చిన్న చిన్న షాపులు నడుపుకునేవాళ్లపై,చిరు వ్యాపారులపై భయంకరమైన ప్రభావం పడుతుందని అన్నారు. చిన్న మరియు మధ్యస్థాయి పరిశ్రమలకు ఇది భారీ ఎదురుదెబ్బ అని..ఇది ఇండియా ఆర్థికవ్యవస్థను నాశనం చేస్తుందని రాహుల్ పేర్కొన్నారు.
భారత్..అభివృద్ధిని నమోదుచేయలేదని,ఉద్యోగాలు కల్పించలేదని..ఇదంతా “మేముఇద్దరం,మాకు ఇద్దరు”కి లబ్ది చేకూర్చేందుకు మన దేశ వెన్నుముకను విరిచేయడం వల్లనే అని రాహుల్ అన్నారు. బీజేపీ సభ్యులు తన ప్రసంగాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ రాహుల్ తన ప్రసంగాన్ని ఆపలేదు.
ఈ సందర్భంగా గురువారం ప్రధాని మోడీ పార్లమెంట్ లో ఉపయోగించిన “కంటెంట్,ఇంటెంట్”పదాలను రాహుల్ ప్రస్తావిస్తూ..విపక్ష పార్టీ రైతుల ఆందోళన గురించి మాట్లాడుతోంది కానీ రైతుల చట్టాల కంటెంట్,ఇంటెంట్ గురించి మాట్లాడటం లేదని ప్రధాని అన్నారు. రైతు చట్టాల ఉద్దేశ్యం(ఇంటెంట్) మరియు విషయం(కంటెంట్)గురించి నేను మాట్లాడి ఆయనని సంతోషంగా ఉంచాలని అనుకుంటున్నాను. కొత్త చట్టాలు దేశపు మండీ వ్యవస్థను నాశనం చేస్తాయి. మొదటి చట్టం కంటెంట్ ఏంటంటే..దేశంలో ఎక్కడైనా సరే ఎవరైనా ఆహారధాన్యాలు,పండ్లు,కూరగాయలు తగినన్ని కొనుగోలు చేయవచ్చు. దేశంలో ఎక్కడైనా కొనుగోలు అన్ లిమిటెడ్ గా ఉంటే..అప్పుడు మండీలకు ఎవరు వెళ్తారు?మండీలను ఫినిష్ చేయడమే మొదటి చట్టం కంటెంట్ అని రాహుల్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి మనకు నిరుద్యోగం,ఆకలి,ఆత్మహత్య అనే ఆప్షన్లు ఇచ్చాడని రాహుల్ విమర్శించారు.
రాహుల్ ని కంట్రోల్ చేసేందుకు లోక్ సభ స్పీకర్ కూడా ప్రయత్నించారు. బడ్జెట్ పై సభ చర్చిస్తోందని రాహుల్ కి గుర్తు చేశారు స్పీకర్. అయినప్పటికీ రైతు చట్టాలు,రైతుల సమస్యలపైనే రాహుల్ మాట్లాడారు. తాను రైతు చట్టాల గురించే మాట్లాడతానని..బడ్జెట్ పై కాదని రాహుల్ అన్నారు.