Security breach in Lok Sabha: పార్లమెంటుపై ఆరుగురు దాడి చేస్తే ఐదుగురు పట్టుబడ్డారు.. అందరి ఫోన్లతో ఒకరు పరారి

పోలీసులకు పట్టుబడిన ఐదుగురిలో ఇద్దరు లోక్‌సభ ప్రేక్షకుల గ్యాలరీ నుంచి ఎంపీలు కూర్చునే చోటకు దూకారు. వీరిలో ఒకరు టేబుల్ పైనుంచి దూకి ముందుకు సాగడం వీడియోలో కనిపిస్తుంది

Security breach in Lok Sabha: పార్లమెంటుపై ఆరుగురు దాడి చేస్తే ఐదుగురు పట్టుబడ్డారు.. అందరి ఫోన్లతో ఒకరు పరారి

Updated On : December 13, 2023 / 7:48 PM IST

ఈరోజు (డిసెంబర్ 13) జరిగిన సంఘటనతో అత్యంత భద్రతతో కూడిన పార్లమెంట్ భద్రత విషయంలో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ఈ ఘటనలో ఓ కీలక విషయం వెల్లడి అయింది. ఇప్పటి వరకు నలుగురు నిందితులు ఉన్నట్లు తెలిసినప్పటికీ.. వాస్తవానికి ఆరుగురికి ప్రమేయం ఉందని తేలింది. వారిలో ఐదుగురిని అరెస్టు చేశామని, ఒకరి కోసం అన్వేషణ కొనసాగుతోందని భద్రతా వర్గాలు తెలిపాయి.

ఆరుగురు నిందితులు ఒకరికొకరు తెలుసని, గురుగ్రామ్‌లోని సెక్టార్ 7లోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో కలిసి ఉంటున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. అరెస్టయిన వారి నుంచి ఎలాంటి మొబైల్ ఫోన్ లభ్యం కాలేదని, విచారణ కొనసాగుతోందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. అరెస్టు చేసిన నిందితుల మొబైల్ ఫోన్లను ఢిల్లీ పోలీసులు సోదా చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: 22 ఏళ్ల తర్వాత పార్లమెంట్ రక్షణపై ప్రశ్నలు.. అసలు 2001 డిసెంబర్ 13న ఏం జరిగింది?

పోలీసులకు పట్టుబడిన ఐదుగురిలో ఇద్దరు లోక్‌సభ ప్రేక్షకుల గ్యాలరీ నుంచి ఎంపీలు కూర్చునే చోటకు దూకారు. వీరిలో ఒకరు టేబుల్ పైనుంచి దూకి ముందుకు సాగడం వీడియోలో కనిపిస్తుంది. వారిద్దరినీ మనోరంజన్, సాగర్ శర్మగా గుర్తించారు. పార్లమెంట్‌ కాంప్లెక్స్‌లో నిరసన తెలుపుతూ డబ్బాతో పొగను విడుదల చేసిన వారిని హర్యానాలోని జింద్‌ జిల్లా ఘసో ఖుర్ద్‌ గ్రామానికి చెందిన నీలం, మహారాష్ట్రలోని లాతూర్‌కు చెందిన అమోల్‌ షిండే (25)గా గుర్తించారు. ఈ కేసులో అరెస్టయిన ఐదో నిందితుడి పేరు విక్కీ.

5 మంది వ్యక్తులు పార్లమెంట్ హౌస్‌కు వచ్చారు. నలుగురూ (నీలం, మనోరంజన్, సాగర్, అమోల్) తమ మొబైల్ ఫోన్లను లలిత్ మరో నిందితుడికి ఇచ్చారు. ఇక్కడ గొడవ ప్రారంభం కాగానే లలిత్ అక్కడి నుంచి పరారయ్యాడు. అరెస్టయిన నలుగురు నిందితుల మొబైల్ ఫోన్లు లలిత్ వద్దే ఉన్నాయి. దీంతో లలిత్ కోసం ఢిల్లీ పోలీసులు గాలింపు ప్రారంభించారు.

ఇది కూడా చదవండి: పార్లమెంట్‭లో హంగామాకు కారణమైన కలర్ గ్యాస్ కన్సిస్టర్లు ఏంటో తెలుసా?