ఆప్‌ అగ్రనాయకత్వమంతా తీహార్ జైలులోనే.. ఈ నలుగురు వెళ్లింది అవినీతి కేసుల్లోనే..

AAP: అరెస్ట్ అయిన నలుగురు నేతలు తీహార్‌ జైలులోనే ఉన్నారు. కేజ్రీవాల్‌ తీహార్‌ జైలు నెంబర్-2లో ఉన్నారు.

ఆప్‌ అగ్రనాయకత్వమంతా తీహార్ జైలులోనే.. ఈ నలుగురు వెళ్లింది అవినీతి కేసుల్లోనే..

నాలుగేళ్ల కింద వరకు ఓ వెలుగు వెలిగిన ఆమ్ ఆద్మీ పార్టీ.. ఇప్పుడు దిక్కుతోచని స్థితిలోకి వెళ్ళిపోతుంది. బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఎదుగుతామని ఆశించిన.. ఆప్ కీలక నేతలంతా ఇప్పుడు తీహార్‌ జైలులోనే ఉన్నారు. లేటెస్ట్‌గా సీఎం కేజ్రీవాల్‌తో పాటు గతంలో కీలక మంత్రులుగా పనిచేసిన ఇద్దరు లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయ్యారు. ఓ ఆప్ రాజ్యసభ సభ్యుడు కూడా జైలుకు వెళ్లాడు. ఇప్పుడున్న పలువురు మంత్రులకు కూడా నోటీసులు అందాయి.

కేజ్రీవాల్ అరెస్ట్‌కు ముందు ముగ్గురు పెద్ద నాయకులు జైలుకు వెళ్లారు. ఆప్‌ పార్టీ కీలక నేతలనే కాకుండా.. ఢిల్లీ ప్రభుత్వంలో అత్యంత ప్రముఖమైన శాఖలు నిర్వహిస్తున్న మనీష్ సిసోడియా, సత్యేంద్రజైన్‌ అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌ను కూడా ఈడీ అరెస్ట్ చేసింది. అంతకముందే ఆప్ కమ్యూనికేషన్స్ హెడ్ విజయ్ నాయర్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది.

మనీష్ సిసోడియా
ఎక్సైజ్ మంత్రి హోదాలో అప్పటి ఢిల్లీ డిప్యూటీ సిఎం మనీష్ సిసోడియా ఏకపక్ష విధానాలు, నిర్ణయాలు తీసుకున్నారని ఈడీ ఆరోపించింది. ఆయన తీసుకున్న నిర్ణయాలతో ఢిల్లీ ప్రభుత్వ ఖజానాకు 292 కోట్ల రూపాయల ఆర్థిక నష్టం వచ్చిందనేది దర్యాప్తు సంస్థల వాదన. మార్చి 2023లో ఈడీ మనీష్‌ సిసోడియాను అదుపులోకి తీసుకుంది. అప్పటి నుంచి ఆయన తీహార్ జైలులో ఉంటున్నారు.

సత్యేంద్ర జైన్
2002 సెప్టెంబర్‌లో మరో మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్ అయ్యారు. అనారోగ్య సమస్యల కారణంగా ఆయనకు కోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. గతేడాది మే నుంచి ఆయన బయటే ఉన్నారు. తర్వాత కోర్టు ఆదేశాలతో మళ్లీ జైలుకు వెళ్లారు. 4.8 కోట్ల మనీలాండరింగ్ కేసులో ఆయనను ఈడీ అరెస్ట్ చేసింది. 2015-16 మధ్యకాలంలో షెల్ కంపెనీల నుంచి హవాలా మార్గంలో డబ్బులు పొందారని ఆయనపై ఆరోపణలున్నాయి.

ఆ డబ్బులతో భూములు కొనడంతో పాటు గతంలో భూములు కొనేందుకు తీసుకున్న రుణాలను తీర్చారని ఈడీ ఆరోపిస్తోంది. ఇదే కాకుండా తన దగ్గర సత్యేంద్రజైన్‌ ప్రొటెక్షన్ మనీ తీసుకున్నారని ఆర్థిక నేరగాడు సుఖేష్ చంద్రశేఖర్‌ చేసిన ఆరోపణలపై కూడా దర్యాప్తు కొనసాగుతోంది.

సంజయ్ సింగ్ కు ఊరట
ఇక ఎంపీ సంజయ్ సింగ్ గతేడాది అక్టోబర్‌లో అరెస్ట్ అయ్యారు. ఆయన కూడా లిక్కర్ స్కాం కేసులోనే జైలుకు వెళ్లారు. అమిత్‌ అరోరాను సిసోడియాకు పరిచయం చేసింది సంజయ్ సింగేనని ఆరోపించింది ఈడీ. లిక్కర్ స్కాం జరగడంలో అతని పాత్ర ఉందని చెబుతోంది. ఇవాళ సుప్రీంకోర్టులో ఆయనకు బెయిల్ దక్కింది. 

లేటెస్ట్‌గా సీఎం కేజ్రీవాల్
ఇక లేటెస్ట్‌గా సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. లిక్కర్ గేట్‌లో ప్రధాన పాత్రదారు కేజ్రీవాలేనని.. సౌత్ గ్రూప్‌ నుంచి ముడుపులు అందాయని ఆరోపించింది ఈడీ. ఆ డబ్బులను పంజాబ్, గోవా ఎన్నికల్లో పార్టీ ఖర్చుల కోసం వాడారని చెబుతోంది ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్.

అరెస్ట్ అయిన నలుగురు నేతలు తీహార్‌ జైలులోనే ఉన్నారు. కేజ్రీవాల్‌ తీహార్‌ జైలు నెంబర్-2లో ఉన్నారు. మనీష్ సిసోడియా జైల్ నెంబర్-1, సత్యేంద్ర జైన్ జైల్ నెంబర్-7, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ జైల్ నెంబర్-5లో ఉన్నారు.


Also Read: జనసేనకు బిగ్‌షాక్‌.. ఫ్రీ సింబల్స్ జాబితాలో గ్లాసు గుర్తు