Air India Crash: చెదిరిన కలలు, కూలిన బతుకులు.. ఎయిరిండియా విమాన ప్రమాద దుర్ఘటనలో ఒక్కొక్కరికి ఒక్కో కన్నీటిగాథ..
ఇలా ఎన్నో ఆశలతో ఫ్లైట్ ఎక్కిన వారి జీవితాలు క్షణాల వ్యవధిలోనే బుగ్గిపాలయ్యాయి.

Air India Crash: అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదంలో మంటల్లో కాలి బుగ్గిపాలైన ఒక్కొక్కరిది ఒక్కో కల, ఒక్కొక్కరిది ఒక్కో ఆశయం. ఒక్క ప్రమాదంతో వారి ఆశలన్నీ అడియాశలయ్యాయి. వారు కన్న కలలు కల్లలుగా మిగిలిపోయాయి. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాల్లో ఏ ఒక్కరిని పలకరించినా కన్నీటి ధారలే కనిపిస్తున్నాయి. కోటి ఆశలతో లండన్ వెళ్లేందుకు ఫ్లైట్ ఎక్కారు. అంతలోనే అనంత లోకాలకు వెళ్లిపోయారు వారంతా.
భారత్ లోనే తన అస్తికలను కలపాలన్న భార్య చివరి కోరికను తీర్చడానికి వచ్చిన భర్త, కొడుకు కొత్తగా కట్టుకున్న ఇంటిని చూద్దామనుకున్న తల్లిదండ్రులు, భర్త పుట్టినరోజును కలిసి జరుపుకోవాలని ఆశపడ్డ భార్య, తన కల నెరవేరిందన్న ఆనందంలో ఎయిర్ హోస్టెస్, సర్జరీ కోసం వచ్చిన ఆడబిడ్డ, లండన్ వెళ్లి ఎంజాయ్ చేద్దామనుకున్న సిస్టర్స్.. ఇలా ఎన్నో ఆశలతో ఫ్లైట్ ఎక్కిన వారి జీవితాలు క్షణాల వ్యవధిలోనే బుగ్గిపాలయ్యాయి.
అలా ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఇప్పటివరకు విమాన ప్రమాదంలో మొత్తం 274 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎయిర్ హోస్టెస్ గా తన కల నెరవేరిందని సంతోషపడే లోపలే 22ఏళ్ల క్రూ మెంబర్ మైధిలి పాటిల్ విమాన ప్రమాదంలో మరణించింది.
నవీ ముంబైకి చెందని పాటిల్ చిన్నప్పటి నుంచి ఎయిర్ బ్యూటీ క్వీన్ కావాలని కలలు కంది. ఎట్టకేలకు ఆమె కలలు నిజమై ఆమె ఎయిర్ ఇండియా సిబ్బందిలో భాగమైంది. అంతలోనే విధి వింత నాటకం ఆడింది. ఘోర విమాన ప్రమాదంలో అదే విమానంలో ఎయిర్ హోస్టెస్ గా విధులు నిర్వహిస్తున్న మైధిలి మంట్లో కాలి బూడిదైపోయింది.
Also Read: ఎయిరిండియా బాధితులకు ఇంకో సమస్య.. ఏ మృతదేహం ఎవరిది? డీఎన్ఏ టెస్టుల్లో ఓ పెద్ద అడ్డంకి..
పెళ్లైన రెండు రోజులకు నవ వరుడిని విమాన ప్రమాదం పొట్టన పెట్టుకుంది. లండన్ లోనే చదువుకుని అక్కడే ఉద్యోగం చేస్తున్న 26ఏళ్ల భవిక్ సెలవులపై రెండు వారాల క్రితం వడోదర వచ్చాడు. ఈ నెల 10న రిజిస్ట్రర్ వివాహం చేసుకున్నాడు. ఈసారి భారత్ కు వచ్చినప్పుడు పెళ్లి వేడుకలు చేసుకుందామని ఇరు కుటుంబాలు నిర్ణయించాయి. సెలవులు అయిపోవడంతో లండన్ కు బయలుదేరిన భవిక్ కు ఆయన భార్య కూడా అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ కు వెళ్లి వీడ్కోలు పలికింది. ఆమె ఇంటికి చేరకముందే పెను విషాద వార్త తెలియడంతో కుప్పకూలిపోయింది.