అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదంపై ప్రాథమిక రిపోర్ట్.. కారణాలు ఇవే.. పైలెట్ల సంభాషణలు బయటకు..

ఏఏఐబీ ప్రాథమిక నివేదికపై ఎయిర్ ఇండియా ట్విటర్ ద్వారా స్పందించింది.

అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదంపై ప్రాథమిక రిపోర్ట్.. కారణాలు ఇవే.. పైలెట్ల సంభాషణలు బయటకు..

Ahmedabad Plane Crash

Updated On : July 12, 2025 / 1:50 PM IST

Ahmedabad Plane Crash: అహ్మదాబాద్‌లో జూన్ 12న ఎయిర్ ఇండియా ఏఐ-171 విమానం ఘోర ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 260 మంది ప్రాణాలు కోల్పోయారు. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానాశ్రయానికి సమీపంలోని మెడికల్ హాస్టల్ కాంప్లెక్స్‌ను ఢీకొట్టింది. విమానంలో ఉన్న 242 మందిలో ఒక ప్రయాణికుడు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. విమాన ప్రమాదంపై ఎయిర్‌క్రాప్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేసన్ బ్యూరో (AAIB) దర్యాప్తు ప్రారంభించింది. తాజాగా.. 15 పేజీల ప్రాథమిక నివేదికను విడుదల చేసింది.

Also Read: Air India Crash: అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ఏఏఐబీ సంచలన నివేదిక.. ప్రమాదానికి కారణాలు ఇవే..

ఏఏఐబీ విడుదల చేసిన ప్రాథమిక నివేదిక ప్రకారం.. ప్రమాదానికి ముందు విమానంలో ఇంధన నియంత్రణ స్విచ్‌లు ఆపివేసివున్నాయి. అయితే, తరువాత ఆన్‌ చేశారని తేలింది. కాగా బోయింగ్ 787-8 విమానాల ఆపరేటర్లు తక్షణ భద్రతా చర్యలు చేపట్టలేదని ఏఏఐబీ తన నివేదికలో చెప్పకపోయినా, విమానంలో ఇంధన నియంత్రణలను మార్చడం దర్యాప్తులో కీలకమైన అంశంగా పేర్కొంది. దీనిపై లోతైన దర్యాప్తును కొనసాగిస్తున్నట్లు తెలిపింది. ఏఏఐబీ ప్రాథమిక నివేదికపై ఎయిర్ ఇండియా ట్విటర్ ద్వారా స్పందించింది.


‘‘ఏఐ-171 విమాన ప్రమాద బాధితులకు సంఘీభావం తెలుపుతున్నాం. బాధిత కుటుంబాలకు సహాయం అందిస్తాం. క్లిష్ట సమయంలో మద్దతు అందించడానికి పూర్తిగా కట్టుబడి ఉన్నాం. ఎయిర్‌లైన్‌కు ఏఏఐబీ ప్రాథమిక నివేదిక అందింది. విమాన ప్రమాదం దర్యాప్తులో ఎయిర్ ఇండియా ఏఏఐబీ, ఇతర అధికారులకు నిరంతరం సహకారం అందిస్తోంది. ఏఏఐబీ దర్యాప్తు వేగవంతంగా జరుగుతుంది. అందుకే దీనిపై ఇప్పుడే ఏమీ వ్యాఖ్యానించబోము’’ అంటూ ఎయిర్ ఇండియా ఎక్స్ పోస్టులో తెలిపింది.

మరోవైపు.. బోయింగ్ సీఈఓ కెల్లీ ఓర్ట్‌బర్గ్ ఓ ప్రకటన విడుదల చేశారు. బాధిత కుటుంబాలకు ఆయన సంతాపం తెలిపారు. తన పూర్తి మద్దతు తెలిపేందుకు ఎయిరిండియా చైర్మన్ తో మాట్లాడినట్లు వెల్లడించారు. విమాన ప్రమాద దర్యాప్తునకు పూర్తిగా మద్దతిచ్చేందుకు బోయింగ్ బృందం సిద్ధంగా ఉందని తెలిపారు.

మరోవైపు పైలెట్ల సంభాషణలు బయటకు వచ్చినట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ‘ఫ్యూయల్ ఎందుకు కటాఫ్ చేశావ్?’ అని ఒక పైలెట్ అడగ్గా.. ‘నేనేం చేయలేదు’ అని మరో పైలెట్ సమాధానం చెప్పినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ వాయిస్ ను బేస్ చేసుకుని నిర్ధారణకు రాలేమని ఎయిరిండియా ప్రకటించింది.