Engineering students : ఇంజినీరింగ్ విద్యా విధానంలో ఏఐసీటీఈ భారీ మార్పులు.. జాబ్ చేస్తూనే బీటెక్ చదువొచ్చు.. కీలక మార్పులివే..
Engineering students : ఇంజనీరింగ్ విద్యా విధానంలో అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) భారీ మార్పులు తీసుకొచ్చింది.
Engineering students
Engineering students : ఇంజనీరింగ్ విద్యా విధానంలో అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) భారీ మార్పులు తీసుకొచ్చింది. వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం కాలేజీల్లో ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ విధానాన్ని అమలు చేసుకోవచ్చునని ప్రకటించింది.. అంతేకాదు.. కొత్తగా ఎక్స్‌పీరియెన్షియల్ లర్నింగ్ ప్రోగ్రామ్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ విధానం ద్వారా క్లాస్ రూములకే పరిమితం కాకుండా.. నేరుగా పరిశ్రమల్లోనే పాఠాలు నేర్చుకునేలా ఏఐసీటీఈ నిర్ణయం తీసుకుంది.
దేశ వ్యాప్తంగా వర్కింగ్ ప్రొఫెషనల్స్ తమ చదువును కొనసాగించేందుకు ఏఐసీటీఈ మరోసారి అనుమతి ఇచ్చింది. డిప్లొమా, బీటెక్, ఎంబీఏ కోర్సులను ఉద్యోగం చేస్తూనే పూర్తిచేసే వెసులుబాటు కల్పించింది. ఇందుకోసం కాలేజీలు ‘ఫ్లెక్సిబుల్ టైమింగ్స్’ అమలు చేసుకోవచ్చునని పేర్కొంది. అంటే ఆఫీస్ వేళల తరువాత సాయంత్రం పూట లేదా వీకెండ్స్‌లో క్లాసులువిని, డిగ్రీలు పొందే చాన్స్ ఇచ్చింది. ఇప్పటికే కొన్నిచోట్ల దీన్ని అమలు చేస్తున్నా.. ఇకనుంచి ఎక్కువ సపోర్ట్ చేస్తామని తాజాగా ప్రకటించింది.
2026 – 27 అకడమిక్ ఇయర్ నుంచి ఎక్సై్‌పీరియెన్షియల్ లర్నింగ్ ప్రోగ్రామ్స్ పేరుతో కొత్త విధానాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఏఐసీటీఈ ప్రవేశపెడుతుంది. దీని ప్రకారం.. విద్యార్థులు తమ కోర్సుల్లో 50శాతం వరకు సిలబస్‌ను నేరుగా కంపెనీల్లో పనిచేస్తూ నేర్చుకోవచ్చు. కేవలం ఇంటర్న్‌షిప్‌లాగా కాకుండా క్రెడిట్స్, పరీక్షలు, సర్టిఫికేషన్ అన్నీ ఇండస్ట్రీ, కాలేజీ కలిసి నిర్వహించనున్నాయి. కొత్తగా తెచ్చిన ఈ విధానం ప్రకారం.. డిప్లొమా విద్యార్థులు ఏడాదిన్నర బీటెక్/డిగ్రీ విద్యార్థులు ఒక ఏడాదిపాటు పూర్తి ఇండస్ట్రీలోనే గడపాల్సి ఉంటుంది. అక్కడ థియరీతోపాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ నేర్చుకుంటారు. దీనికోసం నేషనల్ ఇనిస్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేంవర్క్ (ఎన్ఐఆర్ఎఫ్) ఉన్న కాలేజీలు లేదా ఇండస్ట్రీతో మంచి ట్రాక్ రికార్డు ఉన్న కాలేజీలకే పర్మిషన్ ఇస్తారు. ఇక స్టూడెంట్‌కు ట్రైనింగ్ ఇచ్చే కంపెనీకే కనీసం రూ.100 కోట్ల టర్నోవర్ (మూడేండ్ల సగటు) ఉండాలి. అక్కడ విద్యార్థులకు క్లాసులు చెప్పేందుకు ప్రత్యేకంగా ట్రైనింగ్ సెంటర్, ల్యాబ్స్, మెంటార్స్ ఉండాలి.
2026 -27 విద్యా సంవత్సరం నుంచి ఇన్నాళ్లూ ఇంజినీరింగ్ కాలేజీల్లో సీట్ల సంఖ్యపై ఉన్న గరిష్ఠ పరిమితిని ఎత్తివేస్తున్నట్లు ఏఐసీటీఈ ప్రకటించింది. మేనేజ్మెంట్ కోరినన్ని సీట్లకు పర్మిషన్ ఇవ్వాలని నిర్ణయించింది. అయితే, ఎన్‌బీఏ గుర్తింపు ఉన్న కాలేజీలు మాత్రమే ఈ అవకాశాన్ని వినియోగించుకునే అవకాశం ఉంది.
ఏఐసీటీఈ మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. విదేశీ విద్యార్థులకోసం ఇంజనీరింగ్ టెక్నాలజీ కోర్సుల్లో 15శాతం, పీజీ కోర్సుల్లో 25శాతం సూపర్ న్యూమరరీ (అదనపు) సీట్లను కేటాయించారు. అదేవిధంగా ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూకాశ్మీర్, లడఖ్, కేవలం మహిళలకోసం నడిచే కాలేజీలకు సెక్యూరిటీ డిపాజిట్లో 50శాతం రాయితీ కల్పించారు. కాలేజీల్లో వసతుల తనిఖీకి వెళ్లే ఎక్స్‌పర్ట్ విజిట్ కమిటీ (ఈవీసీ) ఇకపై ఫిజికల్‌గానే కాకుండా అన్‌లైన్ లేదా హైబ్రిడ్ మోడ్‌లోనూ తనిఖీలు చేయొచ్చునని ఏఐసీటీఈ నిర్ణయించింది.
ఉల్లాస్ స్కీమ్ కింద ప్రతి కాలేజీలో ఫ్యాకల్టీ, స్టూడెంట్స్ కలిసి ఏడాదికి కనీసం ఐదుగురు నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలని ఏఐసీటీఈ స్పష్టం చేసింది. కాలేజీ క్యాంపస్ లలో డ్రగ్స్ వాడకాన్ని అరికట్టేందుకు నషా ముక్త్ భారత్ అభియాన్ కింద కౌన్సిలింగ్ సెంట్లను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఒకేసొసైటీ లేదా ట్రస్ట్ కింద నడిచే వేరువేరు కాలేజీలు ఒకే సిటీ పరిధిలో ఉంటే వాటిని విలీనం చేసుకునేందుకు ఏఐసీటీఈ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
